ఆశ.. దోశ.. క్రమబద్ధీకరణ!

అధికారంలోకి రాగానే కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తానని ప్రతిపక్ష నేతగా జగన్‌ హామీ ఇవ్వడంతో వారంతా ఆశపడ్డారు.

Updated : 18 Aug 2023 10:15 IST

ఒప్పంద ఉద్యోగుల విషయంలో మాట తప్పిన జగన్‌
నిబంధనల పేరుతో 10 వేల మందికే అవకాశం
40 వేల మందికి మొండిచేయి


అప్పుడు అలా..

మేం అధికారంలోకి రాగానే అన్ని ప్రభుత్వ శాఖల్లోని కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు, విద్యార్హతలను పరిగణనలోకి తీసుకుంటాం. వీలైనంత ఎక్కువ మందిని రెగ్యులరైజ్‌ చేస్తామని హామీ ఇస్తున్నా.

ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతగా జగన్‌


ఇప్పుడు ఇలా..

అధికారంలోకి వచ్చిన తర్వాత క్రమబద్ధీకరించే కాంట్రాక్టు ఉద్యోగుల సంఖ్యను తగ్గించేందుకు సీఎం జగన్‌ ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, ప్రాజెక్టులు, విశ్వవిద్యాలయాల్లో కలిపి 50 వేల వరకు ఒప్పంద ఉద్యోగులు ఉండగా, కేవలం 10,117 మందిని మాత్రమే రెగ్యులరైజ్‌ చేసేందుకు పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఎన్నికలకు ముందు ప్రతి సభలోనూ హామీలతో ఊదరగొట్టిన జగన్‌ ఇప్పుడు గడువులు విధిస్తున్నారు. క్రమబద్ధీకరణలోకి ఆ విభాగం రాదు.. ఈ ప్రాజెక్టు రాదంటూ సంఖ్యను కుదించేస్తున్నారు. ఏకంగా 40 వేల ఒప్పంద ఉద్యోగులకు మొండిచేయి చూపేందుకు సిద్ధమయ్యారు.


ఈనాడు, అమరావతి: అధికారంలోకి రాగానే కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తానని ప్రతిపక్ష నేతగా జగన్‌ హామీ ఇవ్వడంతో వారంతా ఆశపడ్డారు. ఆ సమయంలో ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, ప్రాజెక్టులు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ శాఖలని విడివిడిగా చెప్పలేదు. ఇప్పుడు ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న వారినే క్రమబద్ధీకరిస్తామంటూ జగన్‌ మాట మార్చి, మడమ తిప్పేశారు. ప్రస్తుతం కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు అనేక నిబంధనలు పెడుతూ.. సగం మందికి కూడా న్యాయం చేయడం లేదు. మంత్రివర్గం మొదట తీసుకున్న నిర్ణయం ప్రకారం 2014 జూన్‌ 2 నాటికి అయిదేళ్లు పూర్తి చేస్తున్న వారు 6,666 మంది ఉన్నారు. అయిదేళ్ల నిబంధనను ఎత్తివేయడంతో మరో 3,451 మంది మాత్రమే అదనంగా వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఎన్నికల ముందు జగన్‌ హామీ ఇచ్చినట్లుగా అందరినీ క్రమబద్ధీకరించాలని ఒప్పంద ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, ప్రాజెక్టులు, విశ్వవిద్యాలయాల్లో పని చేస్తున్న వారినీ రెగ్యులరైజ్‌ చేయాలని కోరుతున్నారు. వర్సిటీల్లో పనిచేస్తున్న ఒప్పంద అధ్యాపకులు ఇప్పటికే ఆందోళనకు సిద్ధమయ్యారు. వీరికి ఉద్యోగ భద్రత కల్పించకుండా వర్సిటీల్లో నియామకాలు చేపట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

అందరిలో కొందరికేనా?

ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనల కారణంగా 10,117 మంది కాంట్రాక్టు ఉద్యోగులు మాత్రమే క్రమబద్ధీకరణకు అర్హత పొందుతారు. రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌, రిజర్వేషన్‌ రోస్టర్‌లను అమలు చేస్తే ఈ సంఖ్య మరింత తగ్గిపోతుంది. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగులు మొత్తం 20,079 మంది ఉన్నారు. వీరిని సైతం పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఆర్థిక శాఖ అనుమతి పొంది, మంజూరైన పోస్టుల్లో పనిచేస్తూ ఉండాలని, ప్రకటన ద్వారా నియమితులై ఉండాలని నిబంధనలు తీసుకొచ్చారు. ఎన్నికల ముందు ఇవేవీ చెప్పనప్పుడు.. ఇప్పుడు ఈ నిబంధనలు ఎందుకు? ఓట్ల కోసం హామీలు గుప్పించి ఇప్పుడు కొంతమందినే క్రమబద్ధీకరించి.. దాన్నే గొప్పగా చెప్పేందుకు సీఎం జగన్‌ ప్రయత్నిస్తున్నారని ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో హామీ ప్రకారం 50 వేల మందిని క్రమబద్ధీకరించాలని ఒప్పంద ఉద్యోగులు కోరుతున్నారు.  

  • సమగ్ర శిక్ష అభియాన్‌ పరిధి కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లోనే సుమారు 4,594 మంది పని చేస్తున్నారు. వీరు కాకుండా ఆర్ట్‌, క్రాఫ్ట్‌ టీచర్లు, సీఆర్టీలు, ప్రత్యేక విద్య టీచర్లు, బోధనేతర సిబ్బంది కలిపి మరో 6 వేల మంది వరకు ఉన్నారు.
  • జాతీయ ఆరోగ్య మిషన్‌లో 15 వేలు, కార్పొరేషన్లు, విశ్వవిద్యాలయాల్లో కలిపి సుమారు 18 వేల మంది వరకు ఉన్నారు. విశ్వవిద్యాలయాల్లో ఒప్పంద అధ్యాపక పోస్టులను క్రమబద్ధీకరిస్తామని సీఎం జగన్‌ పాదయాత్రలో హామీ ఇచ్చారు. ఇప్పుడు వీరి ప్రస్తావన లేకుండా పోయింది.
  • ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో పని చేస్తున్న ఒప్పంద అధ్యాపకులు రాష్ట్ర వ్యాప్తంగా 3,618 మంది ఉన్నారు. వీరు కాకుండా మినిమం టైం స్కేల్‌తో పని చేస్తున్న వారు 264 మంది ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని