Tirumala: గోవిందకోటి రాస్తే వీఐపీ బ్రేక్‌ దర్శనం

యువతలో సనాతన ధర్మం, హైందవ ధర్మవ్యాప్తికి ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు తితిదే ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి పేర్కొన్నారు.

Updated : 06 Sep 2023 09:33 IST

తితిదే ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి

ఈనాడు, తిరుపతి: యువతలో సనాతన ధర్మం, హైందవ ధర్మవ్యాప్తికి ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు తితిదే ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి పేర్కొన్నారు. చిన్నతనం నుంచే యువతలో భక్తిభావాన్ని పెంపొందించేందుకు 25 ఏళ్లలోపు యువత కోటి గోవింద నామాలు పూర్తి చేస్తే.. వారి కుటుంబానికి ఒకసారి వీఐపీ బ్రేక్‌ దర్శనం కల్పించాలని నిర్ణయించినట్లు చెప్పారు. యువతి/ యువకుడు 10,01,116 గోవిందనామాలు రాస్తే ఆ వ్యక్తికి స్వామివారి బ్రేక్‌ దర్శనం కల్పించనున్నట్లు వెల్లడించారు. మంగళవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో తితిదే ఛైర్మన్‌ అధ్యక్షతన ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించారు. అనంతరం కరుణాకర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. అధికమాసం రావడంతో ఈ ఏడాది సెప్టెంబరు 18-26 వరకు సాలకట్ల, అక్టోబరు 15-23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయని తెలిపారు. పెరటాసి మాసం వల్ల రద్దీతో భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. పారిశుద్ధ్య నిర్వహణకు అదనంగా సిబ్బంది నియమించామన్నారు. గరుడ సేవలో భక్తులకు సమస్యలు రాకుండా భద్రత ఏర్పాట్లు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. ఈ నెల 18న ధ్వజారోహణం సందర్భంగా సీఎం జగన్‌ ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని వెల్లడించారు. సమావేశంలో బోర్డు తీసుకున్న నిర్ణయాలను ఛైర్మన్‌ వెల్లడించారు.

  • ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు ఉచితంగా 20 పేజీలున్న.. కోటి భగవద్గీత పుస్తకాలు శ్రీవారి ప్రసాదంగా పంపిణీ.
  • తిరుపతిలో శిథిలావస్థకు చేరుకున్న 2, 3 గోవిందరాజుల సత్రాల స్థానంలో అచ్యుతం, శ్రీపథం వసతి సముదాయాల నిర్మాణం. ఒక్కో సత్రానికి రూ.300 కోట్ల అంచనా వ్యయం. 20 వేల మందికి వసతి కల్పన.
  • ముంబయిలోని బాంద్రాలో రూ.1.65 కోట్లతో శ్రీవారి రెండో ఆలయంతోపాటు రూ.5.35 కోట్లతో సమాచార కేంద్ర నిర్మాణానికి తీర్మానం.
  • తితిదే ఆలయాల్లో అర్చకులు, పరిచారకులు, పోటు వర్కర్లు, ప్రసాద పంపిణీదారులుగా 413 కొత్త పోస్టుల మంజూరు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని నిర్ణయం.
  • తితిదే ఆధ్వర్యంలోని ధర్మగిరి, కీసరగుట్ట, కోటప్పకొండ, విజయనగరం, ఐ.భీమవరం, నల్గొండ వేద విజ్ఞాన పీఠాలకు అదనంగా 47 అధ్యాపక పోస్టులకు ఆమోదం.
  • నడక మార్గంలో భక్తులకు చేతికర్రలు ఇచ్చి, ఎన్‌ఎస్‌ ఆలయం వద్ద తిరిగి తీసుకుంటాం. 8 వేల చేతికర్రలు బుధవారం రానున్నాయి.

సనాతన ధర్మం అంటే మతం కాదు

సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తున్నామని తితిదే ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు. ‘ఆయన రాజకీయపరంగా వ్యాఖ్యానించడంతో బోర్డులో మాట్లాడలేం. తితిదే ధర్మకర్తల మండలి ఛైర్మన్‌గా, రాజకీయ నేతగా చెబుతున్నా.. సనాతన ధర్మం అంటే మతం కాదు. అది ఒక జీవన యానం. ప్రతి దేశానికి ఒక సంస్కృతి, సంప్రదాయం ఉంటుంది. వాటిని అర్థం చేసుకోకుండా విమర్శించడం సరికాదు. ఇవి సమాజంలో అలజడిని సృష్టించడానికి పనికొస్తాయి తప్ప విమర్శించిన వాళ్లకు ఏ మాత్రం ప్రయోజనం ఉండదు’ అని పేర్కొన్నారు.


తితిదే దిల్లీ కమిటీ ఛైర్‌పర్సన్‌గా ప్రశాంతిరెడ్డి

నెల్లూరు (నగరపాలకసంస్థ), న్యూస్‌టుడే: తితిదే దిల్లీ లోకల్‌ అడ్వయిజరీ కమిటీ, సమాచార కేంద్రం ఛైర్‌పర్సన్‌గా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తిరిగి నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం తితిదే అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.


తితిదే సభ్యుడిగా శరత్‌చంద్రారెడ్డి ప్రమాణం

తిరుమల, న్యూస్‌టుడే: తితిదే ధర్మకర్తల మండలి సభ్యుడిగా అరబిందో గ్రూప్‌ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పి.శరత్‌చంద్రారెడ్డి మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీవారి ఆలయంలోని సన్నిధిలో జేఈవో వీరబ్రహ్మం ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం, అధికారులు తీర్థప్రసాదాలు, చిత్రపటం అందజేశారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు