Viveka Murder Case: ‘వేధించేందుకే కృష్ణారెడ్డి తప్పుడు ఫిర్యాదు’

పులివెందుల పోలీసులు తమపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ దివంగత మాజీమంత్రి వైఎస్‌ వివేకా కుమార్తె డాక్టర్‌ సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

Updated : 31 Dec 2023 09:44 IST

పులివెందుల పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయండి
హైకోర్టును ఆశ్రయించిన వివేకా కుమార్తె, అల్లుడు

ఈనాడు, అమరావతి: పులివెందుల పోలీసులు తమపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ దివంగత మాజీమంత్రి వైఎస్‌ వివేకా కుమార్తె డాక్టర్‌ సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కేసులో తదుపరి చర్యలను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోరారు. వివేకా పీఏ ఎం.వెంకటకృష్ణారెడ్డి, హైకోర్టు పీపీని వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. వివేకా హత్య కేసులో కొందరు తనను బెదిరిస్తున్నారనే ఆరోపణతో మృతుని పీఏ కృష్ణారెడ్డి 2021 డిసెంబర్లో పులివెందుల కోర్టులో పిటిషన్‌ వేశారు. పులివెందులకు చెందిన కొందరు నాయకుల ప్రమేయం ఉన్నట్టు సాక్ష్యం చెప్పాలని సీబీఐ ఎస్పీ రాంసింగ్‌.. సీబీఐ అధికారులకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డి ఒత్తిడి చేశారని ఆయన ఆరోపించారు. 2023 డిసెంబర్‌ 8న కృష్ణారెడ్డి ఫిర్యాదుపై పులివెందుల కోర్టు విచారణ జరిపింది. కేసు నమోదు చేసి జనవరి 4న తుది నివేదిక ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. దీంతో పులివెందుల పోలీసులు సునీత, రాజశేఖరరెడ్డి, సీబీఐ ఎస్పీ రాంసింగ్‌పై కేసు నమోదు చేశారు. తాజాగా అభియోగ పత్రం దాఖలు చేసిన విషయం తెలిసిందే.

ఒత్తిడి చేయలేదు..

తాము ఎలాంటి నేరానికి పాల్పడలేదని, తమను వేధించడానికే తప్పుడు కేసు నమోదు చేశారని పిటిషనర్లు పేర్కొన్నారు. కృష్ణారెడ్డి ఆరోపిస్తున్నట్లు సీబీఐ కోరిన విధంగా సాక్ష్యం చెప్పాలని ఒత్తిడి చేయలేదన్నారు. ఫిర్యాదుదారుడి నుంచి ప్రమాణపూర్వక వాంగ్మూలం నమోదు చేయకుండానే పులివెందుల కోర్టు.. ఫిర్యాదును పోలీసులకు పంపిందన్నారు. సంబంధిత మెజిస్ట్రేట్‌ యాంత్రికంగా ఉత్తర్వులు జారీచేశారన్నారు. ఫిర్యాదును పోలీసులకు పంపడం చెల్లుబాటు కాదన్నారు. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న ఆరోపణలు తమకు వర్తించవన్నారు. కోర్టులో వేసిన ప్రైవేట్‌ కంప్లైంట్‌, ఎస్పీ ముందు ఫిర్యాదుదారుడు పేర్కొన్న విషయాలేవీ తాము నేరానికి పాల్పడినట్లు కనిపించడం లేదన్నారు. తాము నేరానికి పాల్పడ్డామనేందుకు ఏవిధమైన కారణాలను పేర్కొనకుండా ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని పోలీసులకు ఫిర్యాదును పంపడం చట్టవిరుద్ధమన్నారు.

వివేకా హత్యకు గురైనప్పుడు ఫిర్యాదుదారు అక్కడ ఉన్నారన్నారు. సీబీఐ దాఖలు చేసిన తుది అభియోగపత్రంలో.. హత్య విషయంలో కృష్ణారెడ్డి జోక్యం ఉన్నట్లు స్పష్టంగా సందేహం వ్యక్తం చేసిందన్నారు. తమపై పగతో స్థానికుల ప్రమేయంతో తప్పుడు ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారన్నారు. దర్యాప్తు సంస్థను, మృతుడి కుటుంబ సభ్యులను వేధించాలన్న లక్ష్యంతో గజ్జెల ఉదయ్‌కుమార్‌రెడ్డి, తులశమ్మ(అయిదవ నిందితుడు శివశంకర్‌రెడ్డి భార్య) స్థానిక కోర్టులలో ప్రైవేటు ఫిర్యాదులు దాఖలు చేశారని గుర్తుచేశారు. సీబీఐ దర్యాప్తు అధికారిపై గతంలో ఓ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం కూడా వివేకా హత్య కేసు విచారణను ఏపీ కోర్టు పరిధి నుంచి.. సుప్రీంకోర్టు తెలంగాణకు బదిలీ చేయడానికి ఓ కారణం అన్నారు. 2023 జూన్‌ 30న సీబీఐ దాఖలు చేసిన అభియోగపత్రంలో ప్రస్తుత ఫిర్యాదుదారుడు ఎం. కృష్ణారెడ్డిని అనుమానితుడిగా పేర్కొంటూ కారణాలను వెల్లడించిందన్నారు. వివేకా హత్య కేసులో నిష్పాక్షిక విచారణ కోసం కేసును ఏపీ నుంచి తెలంగాణకు సుప్రీంకోర్టు బదిలీ చేసిందనే విషయాన్ని పులివెందుల కోర్టు పరిగణనలోకి తీసుకొని ఉండాల్సిందన్నారు. తమ విషయంలో ఎలాంటి ఆరోపణలు లేనందున పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు చెల్లుబాటుకావన్నారు. ఈ కేసులో పోలీసులు దాఖలు చేసిన ఛార్జిషీట్‌తో పాటు తదుపరి చర్యలన్నింటినీ నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలని కోరారు.


జమ్మలమడుగు కోర్టుకు సీబీఐ అధికారులు

జమ్మలమడుగు, న్యూస్‌టుడే: మాజీమంత్రి వివేకా హత్య కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు శనివారం వైయస్‌ఆర్‌ జిల్లా జమ్మలమడుగు కోర్టుకు వచ్చారు. గతంలో పనిచేసిన సీబీఐ ఎస్పీ రాంసింగ్‌, వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డిపై ఈ నెల 28న పులివెందుల పోలీసులు ఛార్జిషీట్‌ నమోదు చేశారు. ఆయన హత్య కేసుకు సంబంధించి విచారణ సక్రమంగా జరపలేదని.. ఆయన కుమార్తె, అల్లుడు చెప్పినట్టే సీబీఐ అధికారి వ్యవహరించారని వివేకా పీఏ కృష్ణారెడ్డి గతంలో పులివెందుల కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఛార్జిషీట్‌ నమోదు చేయగా.. హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ వేశారు. ఆయా కాపీలను మెమో ద్వారా జమ్మలమడుగు జూనియర్‌ సివిల్‌ జడ్జి భార్గవికి న్యాయవాదిచే సీబీఐ అధికారి ఖాలిబాబు సమర్పించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని