Vizag: ఫ్లోటింగ్‌ బ్రిడ్జి.. ఎత్తిపోయినట్లేనా..!

పర్యాటక పరంగా విశాఖలో ఏదో ఒకటి ఏర్పాటు చేస్తామని వైకాపా నేతలు కొన్ని రోజులుగా నగర ప్రజలను ఊరించారు.

Updated : 04 Mar 2024 09:33 IST

విశాఖ తీరంలో ముప్పుతిప్పలు పెడుతున్న తేలియాడే వంతెన
తరచూ విడిపోతున్న డబ్బాలు
అధికారులు, నేతల అత్యుత్సాహంపై విమర్శలు

ఈనాడు, విశాఖపట్నం: పర్యాటక పరంగా విశాఖలో ఏదో ఒకటి ఏర్పాటు చేస్తామని వైకాపా నేతలు కొన్ని రోజులుగా నగర ప్రజలను ఊరించారు. తీరా ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఏమీ చేయాలో తెలియక.. హడావుడి చేశారు. ఈ పరిస్థితిలోనే ‘ఫ్లోటింగ్‌ వంతెన’ను తెరమీదికి తెచ్చారు. కడలి పరిస్థితి తెలుసుకోకుండా, కనీస ఆలోచన చేయకుండా సముద్రంలో ‘టీ’ ఆకారంలో తేలియాడే వంతెనను ఏర్పాటు చేశారు. గత నెల 25న బ్రిడ్జి ప్రారంభిస్తే.. ఒక్క రోజులోనే రెండు ముక్కలైంది. ఇది చూసి పర్యాటకులు ఆందోళనకు గురయ్యారు. అప్పటి నుంచి పాలకులు, అధికారులు వంతెనను తిరిగి అందుబాటులోకి తెచ్చేందుకు యత్నించి, విఫలమవుతూనే ఉన్నారు. వంతెన గురించి వైకాపా నేతలు ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో డప్పు కొట్టుకోవడంతో.. అదేంటో చూడాలని పర్యాటకులు నిత్యం వస్తున్నారు. కానీ, అక్కడున్న అలల తీవ్రత, అంతెత్తున ఎగిసిపడుతున్న వంతెనను చూసి భయపడి వెనుదిరుగుతున్నారు. వారం రోజుల్లోనే పలుమార్లు తెగిపోవడంతో ఇప్పటికీ పూర్తిస్థాయిలో అనుసంధానం, పరిశీలన చేయలేకపోయారు. దీంతో ఒక్కరినీ దానిపైకి అనుమతించలేదు. వైకాపా నేతలను ప్రసన్నం చేసుకోవడానికే కెరటాల తీవ్రతపై ఓ అంచనాకు రాకుండా అధికారులు వంతెన ఏర్పాటు చేశారని విమర్శలొస్తున్నాయి.

వసూళ్ల లెక్కలేశారు.. అధ్యయనం మరిచారు

ఈ ప్రాజెక్టును ఓ సంస్థకు వీఎంఆర్‌డీఏ అప్పగించింది. రూ.1.60 కోట్ల పెట్టుబడి ఆ సంస్థ పెట్టుకోగా... ఏటా వీఎంఆర్‌డీఏకు రూ.15 లక్షలు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. ప్రాజెక్టు ప్రారంభమైతే పెద్దలకు రూ.100, పిల్లలకు రూ.70 వసూలు చేయాలనుకున్నారు. ఒకే సమయంలో 200 మంది సందర్శించేలా ప్రణాళిక వేశారు. వసూళ్లు, లెక్కలపై ముందే ఓ నిర్ణయానికి వచ్చిన అధికారులు.. అక్కడి కడలి పరిస్థితిపై ఎందుకు అధ్యయనం చేయలేదని పర్యాటకులు ప్రశ్నిస్తున్నారు. ఆదిలోనే చుక్కలు చూపిస్తున్న వంతెన అసలు అందుబాటులోకి వస్తుందా అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

వైఫల్యం 1: ఫ్లోటింగ్‌ బ్రిడ్జిని తొలుత తెన్నేటి పార్క్‌ వద్ద వీఎంఆర్‌డీఏ నిర్వహించాలనుకుంది. కొన్ని ఏర్పాట్లూ చేసింది. ఇంతలో అటవీశాఖ నిబంధనలు పాటించాలనడంతో అక్కడ విరమించుకుంది. రుషికొండ సమీపంలో పరిశీలించింది. ఆ బీచ్‌కూ బ్లూ ఫ్లాగ్‌ గుర్తింపు ఉంది. ఏవైనా ప్రమాదాలు జరిగితే ఆ గుర్తింపూ రద్దవుతుందని భావించి అక్కడా వద్దనుకుంది. ఇంతలో వైకాపా నేతల హడావుడి చూసి ఆర్‌కే బీచ్‌ సరైందని ఎంపిక చేసింది. అక్కడ ఈత ప్రమాదకరమని జీవీఎంసీ హెచ్చరిక బోర్డులు పెట్టినా పట్టించుకోలేదు.

వైఫల్యం 2: గోవా, ముంబయి, కేరళలో అరేబియా సముద్రం మే, జూన్‌, జులై, ఆగస్టులో ప్రమాదకరంగా, మిగిలిన రోజుల్లో ప్రశాంతంగా ఉంటుంది. తూర్పు తీరంలో మాత్రం ఏడాదంతా ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. సముద్ర అధ్యయనవేత్తల పరిశీలనతోనే ఈ స్థలం ఎంపిక చేశామంటున్నప్పటికీ జాతీయ సముద్ర పరిశోధన సంస్థ నిపుణులు మాత్రం ఈ ప్రాంతం నిత్యం అలజడితో ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని