రాఖీ పండ‌గ‌కు ఏం బ‌హుమ‌తి ఇస్తున్నారు ?

ఈ రాఖీ పండ‌గ‌కు మీ సోద‌రీమ‌ణుల భ‌విష్య‌త్తుకు భ‌రోసానిచ్చే కానుక‌ల‌ను ఇవ్వండి.​​​​​​....​

Updated : 01 Jan 2021 19:09 IST

ఈ రాఖీ పండ‌గ‌కు మీ సోద‌రీమ‌ణుల భ‌విష్య‌త్తుకు భ‌రోసానిచ్చే కానుక‌ల‌ను ఇవ్వండి.

ర‌క్షా బంధ‌న్ వ‌చ్చేసింది… అన్న‌య్యలూ! మీ చెల్లికి ఏం బ‌హుమ‌తి ఇస్తున్నారు? ఇప్ప‌టివ‌ర‌కు ఇంకా ఏం నిర్ణ‌యించుకోలేదా? అయితే మేం చెప్పే స‌ల‌హా వినండి. ముందు ఎప్పుటిలాగా ఏదైనా ఒక వ‌స్తువును బ‌హుమ‌తిగా ఇవ్వాల‌న్న ఆలోచ‌న‌ను మార్చుకోండి. వాటి వ‌ల‌న అప్పుడు సంతోషంగా ఉన్నా భ‌విష్య‌త్తులో ఎలాంటి ఉప‌యోగం ఉండ‌దు. ఇప్పుడు కాలం మారింది ఖ‌ర్చులు పెరిగిపోయాయి. డ‌బ్బు అవ‌స‌రం పెరిగిపోయింది. అందుకే మీ చెల్లికి, అక్క‌కి మీరున్నారంటూ భ‌రోసానిచ్చే, శాశ్వ‌తంగా గుర్తుండిపోయే బ‌హుమ‌తినివ్వండి.

ఈ రాఖీ పండ‌గ‌కి మీ సోద‌రీమ‌ణుల జీవితాల్లో వెలుగు నింపాల‌ని కోరుకుంటే కొన్ని స‌ల‌హాలు పాటించండి. స్మార్ట్‌ఫోన్‌, బ్రాండెడ్ దుస్తులు, చాక్లెట్స్, స్వీట్స్ వంటివి కాకుండా ఆర్థిక భ‌రోసానిచ్చే బ‌హామ‌తుల‌ను ఇవ్వండి. వారి పేరుతో బీమా పాల‌సీ, మ్యూచువ‌ల్ ఫండ్, లేదా ఏదైనా పొదుపు ప‌థ‌కాన్ని ప్రారంభించి చూడండి.

ఎలాంటి బ‌హుమతుల‌నివ్వాలి?

1. ఆరోగ్య‌, జీవిత బీమా పాల‌సీ

జీవితం ఎప్పుడూ అనుకున్న‌ట్లు ఉండ‌దు. ఎప్పుడో అనుకోని ప్ర‌మాదాలు, అవాంత‌రాలు ఎదురు కావొచ్చు. ఇది మీకు న‌చ్చినా న‌చ్చ‌క‌పోయినా ఒప్పుకోవాల్సిన నిజం. మ‌రి దీనికోసం చేయ‌వ‌ల్సింది ఏంటంటే ఆర్థికంగా అన్నిటికీ సిద్ధంగా ఉండాలి. అందుకే ఈ పండ‌గ సంద‌ర్భంలో వారి పేరుతో ఆరోగ్య బీమా పాల‌సీని తీసుకోవ‌డం అతిపెద్ద బ‌హుమ‌తి. జీవిత బీమా, ట‌ర్మ్ బీమా పాల‌సీలు కూడా ఎంచుకోవ‌చ్చు.

2. షేర్లను కొనుగోలు చేయండి

అదేవిధంగా మీరు కంపెనీ షేర్ల‌ను కూడా మీ సోద‌రీమ‌ణుల‌కు కానుక‌గా ఇవ్వొచ్చు. చిన్న వ‌య‌సులో పెట్టుబ‌డుల‌ను ప్రారంభిస్తే సంప‌ద‌ను సృష్టించుకోవ‌చ్చు. షేర్లలో పెట్టుబ‌డులు ఎప్ప‌టిక‌ప్పుడు మార్చుకోవ‌చ్చు. వారికి ఇష్టం వ‌చ్చిన‌ప్పుడు మ‌రిన్ని షేర్ల‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు లేదా ఇత‌ర కంపెనీల‌కు మార్చుకునే అవ‌కాశం ఉంటుంది. మంచి కంపెనీ షేర్ల‌ను ఎంచుకొని కొనుగోలు చేసి వారికి ఇస్తే అంత‌కంటే పెద్ద బ‌హుమ‌తి ఇంకేముంటుంది.

3. మ్యూచువ‌ల్ ఫండ్స్

మ్యూచువ‌ల్ ఫండ్ల‌ను కూడా మీరు కానుకగా అందించ‌వ‌చ్చ‌న్న ఆలోచ‌న మీకెప్పుడైనా వ‌చ్చిందా. అవును, ఈక్విటీ లింక్‌డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్‌) ద్వారా మ్యూచువ‌ల్ ఫండ్లలో పెట్టుబ‌డులు పెడితే ప‌న్ను ఆదాతో పాటు ఆశించిన లాభాల‌ను పొంద‌వ‌చ్చు. దీనికి మూడేళ్ల లాక్‌-ఇన్ పీరియ‌డ్ ఉంటుంది. బ్లూచిప్ షేర్ల‌ను కానుక‌గా ఇవ్వ‌డం మ‌రింత మేలు.

4. బంగారం

మీ అక్కాచెల్లెళ్ల‌కి చాలా సార్లు ఇప్ప‌టికే మీరు బంగారం కానుక‌గా ఇవ్వొచ్చు. ప‌సిడి అనేది చాలా విలువైన బ‌హుమ‌తి. అయితే ధ‌ర‌లు ఎప్పుడూ ఒకేలా ఉండ‌వు. అదేవిధంగా ఆభ‌ర‌ణాలు కొనుగోలు చేసిన‌ప్పుడు అనేక ఇత‌ర ఛార్జీలు కూడా ఉంటాయి. మీరు బంగారాన్ని బ‌హుమ‌తిగా ఇవ్వాల‌నుకున్న‌ప్పుడు గోల్డ్‌ ఈటీఎఫ్‌ల‌ను కొనుగోలు చేయ‌డం మంచిది. అవస‌ర‌మైన‌ప్పుడు ఎప్పుడైనా అమ్మేసి బంగారం విలువ‌ను పొంద‌వ‌చ్చు. అంత‌ర్జాతీయ ప‌రిణామాల నేప‌థ్యంలో గోల్డ్ క‌మోడిటీలు మ‌రో ఏడాదిలో 10 నుంచి 15 శాతం రాబ‌డిని ఇవ్వొచ్చ‌ని నిపుణులు అంచనా వేస్తున్నారు.

5. పొదుపు ప‌థ‌కాలు

మీరు మీ సోద‌రీమ‌ణుల‌కు ఇచ్చే అవ‌కాశం ఉన్న మ‌రో విలువైన బ‌హుమ‌తి పొదుపు ప‌థ‌కం. ఇది మీ ఆప్తుల‌కు పొదుపు అల‌వాటును కూడా నేర్పిస్తుంది. వారి పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్, పీపీఎఫ్‌, ఎన్ఎస్‌సీ ఖాతాను ప్రారంభించ‌వ‌చ్చు. ఎఫ్‌డీ ప్రారంభిస్తే దానికి త‌గిన గ‌డువును ఎంచుకోవ‌చ్చు. క‌నీసం రూ.5 వేల‌తో ఫిక్స్డ్ డిపాజిట్‌ను ప్రారంభించాలి. పీపీఎఫ్‌, ఎన్ఎస్‌సీ రెండూ ప్ర‌భుత్వ ప‌థ‌కాలు. వీటిపై ప‌న్ను మిన‌హాయింపులు కూడా ల‌భిస్తాయి.

ఈ బహుమ‌తితో మీ అక్కాచెల్లెళ్ల భ‌విష్య‌త్తుకు భ‌రోసానిచ్చిన‌వార‌వుతారు. వారి నిజ‌మైన ఆనందాన్ని కోరుకున్న‌వారు అవుతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని