పీఎఫ్ విత్‌డ్రా కోసం బ్యాంకు ఖాతా వివ‌రాలు అప్‌డేట్ చేయడం ఎలా?

ఈపీఎఫ్ఓ చందాదారులు ఆన్‌లైన్ ద్వారా బ్యాంకు ఖాతా వివ‌రాలు చాలా సుల‌భంగా అప్‌డేట్ చేసుకోవ‌చ్చు. 

Published : 06 May 2021 11:40 IST

ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) ఉపసంహరణ కోసం, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) - చందాదారులకు కొన్ని నియమాలను రూపొందించింది. యూఏఎన్‌( యూనివ‌ర్స‌ల్ అకౌంటు నెంబ‌రు) ప్ర‌వేశ‌పెట్టిన త‌రువాత చందాదారులు ఆన్‌లైన్‌లో పీఎఫ్ మొత్తాన్ని సుల‌భంగా విత్‌డ్రా చేసుకునే వీలుక‌ల్పించింది. యూఏఎన్ అనేది 12 అంకెల‌తో కూడిన ప్ర‌త్యేక‌మైన నెంబ‌రు. చందాదారులు ఒక్క‌క్క‌రికి ఒక్కో యూఏఎన్ నెంబ‌రు ఉంటుంది. ఇది శాశ్వ‌తంగా ఉంటుంది కాబ‌ట్టి ఎన్ని ఉద్యోగాలు మారిన యూఏఎన్ మాత్రం ఒక్క‌టే ఉంటుంది. 

ఈ యూఏఎన్ నెంబ‌రు ద్వారా ఈపీఎఫ్ పోర్ట‌ల్‌కి లాగిన్ అయ్యి పీఎఫ్ మొత్తాన్ని నిబంధ‌న‌ల‌కు లోబ‌డి విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. అయితే క్లెయిమ్‌లు ఆల‌స్యం అవుతున్నాయ‌ని, తిర‌స్క‌ర‌ణ‌కు గుర‌వుతున్నాయ‌ని కొంద‌రు స‌భ్యులు ఈపీఎఫ్ఓకి ఫిర్యాదు చేస్తున్నారు. దీనికి కార‌ణం స‌రైన బ్యాంకు ఖాతా వివ‌రాలు ఇవ్వ‌క పోవ‌డ‌మేన‌ని ఈపీఎఫ్ఓ తెలిపింది.  బ్యాంకు ఖాతా సంఖ్య‌, ఐఎఫ్ఎస్‌సీ వంటి వివ‌రాల్లో త‌ప్పులు ఉంటే మీ క్లెయిమ్ తిర‌స్కరించే అవ‌కాశం ఉంటుంది.

ఆన్‌లైన్ ద్వారా ఈపీఎఫ్ఓ ఖాతాలో మీ బ్యాంకు వివ‌రాలు అప్‌డేట్ చేసుకోవ‌డం చాలా సుల‌భం. అయితే దీనికి మీ సంస్థ యాజ‌మాన్యం ఆమోదం కూడా అవ‌స‌రం. 

బ్యాంకు ఖాతా నెంబ‌రును అప్‌డేట్ చేయు విధానం..
1. ముందుగా ఈపీఎఫ్ స‌భ్యుల‌ పోర్ట‌ల్‌ కు వెళ్లాలి.
2. హోమ్ పేజిలో లాగిన్ ఐడి, పాస్‌వ‌ర్డ్ వంటి వివ‌రాల‌ను ఇచ్చి లాగిన్ అవ్వాలి.
3. త‌ర్వాత ‘Manage’ ట్యాబ్ పై క్లిక్ చేయాలి
4. అక్క‌డ క‌నిపించే మెనూలో డ్రాప్‌డౌన్లో, కేవైసీ సెల‌క్ట్ చేయాలి
5. త‌రువాత డాక్యుమెంట్స్‌లోని బ్యాంక్ సెల‌క్ట్ చేసుకోవాలి
6. ఇక్క‌డ బ్యాంకు ఖాతా సంఖ్య‌, ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌ వంటి వివ‌రాలు ఎంట‌ర్ చేసి త‌ర్వాత సేవ్ చేయాలి
7. కొత్త బ్యాంకు వివ‌రాలు సేవ్ చేశాక 'కేవైసీ ఆమోదం కోసం పెండింగ్‌లో ఉంది' అని చూపుతుంది. 
8.  మీ సంస్థ ఆమోదం కోసం డాక్యుమెంట్ ఫ్రూవ్‌ని స‌బ్మిట్ చేయాలి. ఈ వివరాల‌ను సంస్థ య‌జ‌మాని వెరిఫై చేసి అప్రూవ్ చేస్తారు. ఆ త‌రువాత మీకు కేవైసీ డిజిట‌ల్ అప్రూవ్ అయిన‌ట్లుగా చూపిస్తుంది. టెస్ట్ మెసేజ్ రూపంలో మీ మొబైల్‌కు సందేశం కూడా వ‌స్తుంది. 

ఆన్‌లైన్ పోర్టల్‌లో క్లెయిమ్ చేసేట‌ప్పుడు , చెక్కుపై ఖాతా సంఖ్య‌, ఐఎఫ్‌ఎస్‌సి, పేరు స‌రిగ్గా ముద్రిత‌మై ఉన్నాయో లేదో చూసుకోవ‌డం తప్పనిసరి. ప్రత్యామ్నాయంగా, మీరు బ్యాంక్ పాస్‌బుక్ మొదటి పేజీ లేదా బ్యాంక్ స్టేట్‌మెంట్‌ను కూడా అప్‌లోడ్ చేయవచ్చు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని