జీవిత‌ బీమా పాల‌సీ స‌రెండ‌ర్ లేదా మెచ్యూరిటీపై టీడీఎస్‌ ఎంత‌?

పాల‌సీ స‌రెండ‌ర్ లేదా మెచ్యూరిటీ త‌ర్వాత ప్ర‌త్యేక టీడీఎస్ విధానం ఉంటుంది.

Published : 18 Dec 2020 15:40 IST

జీవిత బీమా పాల‌సీపై ప‌న్ను మిన‌హాయింపులు ఉంటాయి. మెచ్యూరిటీ త‌ర్వాత కూడా ఎటువంటి ప‌న్ను వ‌ర్తించ‌దు. అయితే అన్ని జీవిత బీమా పాల‌సీల‌కు ఈ స‌దుపాయం ఉండ‌దు. పాల‌సీ స‌రెండ‌ర్ లేదా మెచ్యూరిటీ త‌ర్వాత ప్ర‌త్యేక టీడీఎస్ విధానం ఉంటుంది. పాల‌సీదారుడు మ‌ర‌ణిస్తే ఎటువంటి ప‌న్ను ఉండ‌దు.

మోచ్యూరిటీ త‌ర్వాత పాల‌సీ డ‌బ్బుల‌పై ప‌న్ను ఉంటుందా?
జీవిత బీమా పాల‌సీల‌న నాలుగు ర‌కాలుగా విభ‌జించుకుంటే …

  • సింగిల్ ప్రీమియం పాల‌సీ
  • యులిప్స్‌
  • ఎండోమెంట్, మ‌నీబ్యాక్ వంటి సాంప్ర‌దాయ పాల‌సీలు
  • పెన్ష‌న్ పాల‌సీ
    ఇక్క‌డ తెలుసుకోవాల్సిన మ‌రో ముఖ్య‌మైన అంశం ఏంటంటే పాల‌సీ ఎప్పుడు కొనుగోలు చేశార‌నేది.

మార్చి 31, 2012 కి ముందు పాల‌సీ కొనుగోలు చేస్తే హామీ ప్రీమియంపై క‌నీసం ఐదు రెట్లు ఉండాలి. దీనిపై స‌రెండ‌ర్ లేదా మెచ్యూరిటీ స‌మ‌యంలో ప‌న్ను మిన‌హాయింపు కొర‌కు క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. పాల‌సీని ఏప్రిల్ 01, 2012 త‌ర్వాత కొనుగోలు చేసిన‌ట్ల‌యితే హామీ ప్రీమియంపై క‌నీసం 10 రెట్లు ఉండాలి. పాల‌సీ మెచ్యూరిటీ లేదా స‌రెండ‌ర్ చేసేట‌ప్పుడు ప‌న్ను మిన‌హాయింపు కొర‌కు క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. పెన్ష‌న్ పాల‌సీకి ఇది వ‌ర్తించ‌దు. ఎందుకంటే ఈ పాల‌సీల‌కు క‌నీస హామీ ఉండ‌దు.

పాల‌సీదారుడు మ‌ర‌ణించిన త‌ర్వాత ల‌భించే మొత్తాన్ని బీమా హామీ అంటారు. కొన్ని పాల‌సీల‌లో హామీ పాల‌సీదారుడు మ‌ర‌ణించిన‌ప్పుడు లేదా పాల‌సీ మెచ్యూరిటీ గ‌డువు ముగిస్తే వేర్వేరుగా ఉంటుంది. అయితే చాలా వ‌ర‌క పాల‌సీల‌లో బీమా హామీ స‌మానంగా ఉంటుంది.

పాల‌సీ స‌రెండ‌ర్ లేదా మెచ్యూరిటీపై టీడీఎస్
పాల‌సీ సెరెండ‌ర్ లేదా మెచ్యూరిటీపై టీడీఎస్, ప‌న్ను వివ‌రాల‌ను బ‌డ్జెట్ 2019 లో ప్ర‌తిపాదించిన‌ట్లుగా తెలుసుకుందాం.

మార్చి 31, 2012 కి ముందు కొనుగోలు చేసిన పాల‌సీలు
సింగిల్ ప్రీమియం పాల‌సీ
మెచ్యూరిటీపై ప‌న్ను:

మ‌హేష్ అనే వ్య‌క్తి సింగిల్ ప్రీమియం పాల‌సీ (యులిప్) 2009 లో కొనుగోలు చేశాడు. దీనికి ల‌క్ష రూపాయ‌ల ప్రీమియం చెల్లించాడు. బీమా హామీ మొత్తం రూ.1.5 ల‌క్ష‌లు. ఆగ‌స్ట్ 2019 లో పాల‌సీ మెచ్యూరిటీ పూర్త‌వుతుంది. ప్ర‌స్తుత ఫండ్ విలువ రూ.3 ల‌క్ష‌లు. దీనిపై ఎంత ప‌న్ను వ‌ర్తిస్తుంది.

బీమా హామీ ప్రీమియం పై ఐదు రెట్ల కంటే త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు మెచ్యూరిటీపై ప‌న్ను వ‌ర్తిస్తుంది . మ‌హేష్‌కి ఇక్క‌డ రెండు ల‌క్ష‌ల లాభం వ‌చ్చింది. వ‌చ్చిన లాభాలు ఆదాయంతో క‌లుపుతారు. మొత్తం ఆదాయంపై వ‌ర్తించే ప‌న్ను శ్లాబు ప్ర‌కారం ప‌న్ను ప‌డుతుంది. ఇక టీడీఎస్ విష‌యానికొస్తే, రెండు ల‌క్ష‌ల లాభంపై బీమా కంపెనీ 5 శాతం టీడీఎస్ వ‌ర్తింప‌జేస్తుంది.

అయితే ఇదే పాల‌సీపై ల‌క్ష రూపాయ‌ల ప్రీమియంతో రూ.5 ల‌క్ష‌ల బీమా హామీ ఉంటే అప్పుడు ప‌న్ను ఏ విధంగా ఉంటుంది. పాల‌సీ మార్చి 31, 2012 కంటే ముందు కొనుగోలు చేస్తే ప్రీమియంపై హామీ ఐదు రెట్లు ఉంటుంది. వ‌చ్చిన లాభాల‌పై ప‌న్ను ఉండ‌దు. టీడీఎస్ కూడా ఉండ‌దు.

పాల‌సీ స‌రెండ‌ర్ చేస్తే…
ఇదే యులిప్ పాల‌సీ కాల‌ప‌రిమితి 15 సంవ‌త్స‌రాలు అయితే మ‌హేష్ ప‌దో సంవ‌త్స‌రంలో పాల‌సీని స‌రెండ‌ర్ చేయాల‌నుకుంటే, పైన తెలిపిన అవే నిబంధ‌న‌లు ఇక్క‌డ కూడా వ‌ర్తిస్తాయి. బీమా హామీ 5 రెట్ల కంటే త‌క్కువ‌గా ఉంటే ప‌న్నుతో పాటు టీడీఎస్ వ‌ర్తిస్తుంది. 5 రెట్ల కంటే ఎక్కువ‌గా ఉంటే ప‌న్ను, టీడీఎస్ ఉండ‌దు. మార్చి 31, 2012 ముందు కొనుగోలు చేసిన‌ యులిప్స్‌తో పాటు ఇత‌ర సాంప్ర‌దాయ పాల‌సీల‌కు ఇవే నిబంధ‌న‌లు వ‌ర్తిస్తాయి.

మార్చి 31, 2012 త‌ర్వాత పాల‌సీ కొనుగోలు చేస్తే
యులిప్స్, ఇత‌ర సాంప్ర‌దాయ పాల‌సీలు
మెచ్యూరిటీపై ప‌న్ను:
మ‌హేష్ యులిప్ లేదా ఇత‌ర సాంప్ర‌దాయ పాల‌సీ ఆగ‌స్ట్ 2018 లో కొనుగోలు చేశాడు. ప్రీమియం ల‌క్ష రూపాయ‌లు. బీమా హామీ రూ.10 ల‌క్ష‌లు. పాల‌సీకి ఆగ‌స్ట్ 2033 లో మెచ్యూరిటీ ల‌భిస్తుంది. అప్పుడు ఎంత ప‌న్ను వ‌ర్తిస్తుంది. అయితే బీమా హామీ ప్రీమియంపై ప‌ది రెట్లు ఉంటే మెచ్యూరిటీ స‌మ‌యంలో ప‌న్ను వ‌ర్తించ‌దు. టీడీఎస్ కూడా ఉండ‌దు.

అదే పాల‌సీపై ల‌క్ష రూపాయ‌ల ప్రీమియంకి రూ.7 ల‌క్ష‌ల హామీ ఉంటే ప‌న్ను ఎంత‌. ప్రీమియంపై ఏడు రెట్ల బీమా హామీ ఉంది కాబ‌ట్టి దీనిపై ప‌న్ను వ‌ర్తిస్తుంది. టీడీఎస్ మెచ్యూరిటీపై 5 శాతం ఉంటుంది.

దీనిపై వ‌చ్చిన లాభాలను ( మెచ్యూరిటీ విలువ‌-ప్రీమియం చెల్లింపు) ఆదాయానికి క‌లిపి శ్లాబు ప్ర‌కారం ప‌న్ను వ‌ర్తింప‌జేస్తారు. అదేవిధంగా బీమా కంపెనీ 5 శాతం టీడీఎస్ మిన‌హాయిస్తుంది.

పాల‌సీ స‌రెండ‌ర్ చేస్తే …
యులిప్స్:
మ‌హేష్ యులిప్ పాల‌సీని ఆగ‌స్ట్ 2018 లో కొనుగోలు చేశాడు. లక్ష రూపాయ‌ల ప్రీమియం, ఏడు ల‌క్ష‌ల బీమా హామి. పాల‌సీ 2033లో మెచ్యూరిటీ పూర్త‌వుతుంది. జులై 2019 లో పాల‌సీని స‌రెండ‌ర్ చేయాల‌నుక‌కుంటే ఎంత ప‌న్ను ప‌డుతుంది. మ‌హేష్‌కి 2023 లోనే స‌రెండ‌ర్ విలువ ల‌భిస్తుంది. అయితే 2023 లో స‌రెండ‌ర్ చేసిన‌ప్ప‌టికీ వ‌చ్చిన లాభాల‌పై ప‌న్ను వ‌ర్తిస్తుంది. ముందు సంవ‌త్స‌రానికి మ‌హేష్ సెక్ష‌న్ 80సి కింద ప‌న్ను మిన‌హాయింపులు క్లెయిమ్ చేస్తే, మిన‌హాయింపు మొత్తం గ‌త సంవ‌త్స‌ర ఆదాయానికి క‌లిపి దానిప్ర‌కారం ప‌న్ను వ‌ర్తింప‌జేస్తారు.

ఈ విధంగా ట్యాక్స్ రివ‌ర్స‌ల్ విధానం ఐదో సంవ‌త్స‌రం వ‌ర‌కు ఉంటుంది. మూడు, నాలుగు లేదా ఐదో సంవ‌త్స‌రంలో స‌రెండ‌ర్ చేస్తే (5 వ ఏడాది ప్రీమియం చెల్లించ‌క‌ముందు) గ‌త ఏడాది మిన‌హాయింపులు ఈ ఏడాది ఆదాయంలో క‌లుస్తుంది.
ఒక‌వేళ పాల‌సీ హామీ రూ.10 ల‌క్ష‌లు అయితే పాల‌సీ స‌రెండ‌ర్ చేస్తే పైన తెలిపిన ప్ర‌కారం ప‌న్ను ఉంటుంది. కేవ‌లం లాభాల‌పై మాత్ర‌మే ప‌న్ను ఉండ‌దు.

సాంప్ర‌దాయ పాల‌సీలు
ఆగ‌స్ట్ 2017 లో మ‌హేష్ ఎండోమెంట్ లేదా మ‌నీబ్యాక్ వంటి సాంప్ర‌దాయ‌ పాల‌సీని కొనుగోలు చేశాడు. ప్రీమియం ల‌క్ష రూపాయలు. బీమా హామీ రూ.7 ల‌క్ష‌లు. ఆగ‌స్ట్ 2033 లో పాల‌సీ మెచ్యూరిటీ ల‌భిస్తుంది. అయితే జులై 2019 లో (రెండో ఏడాది ప్రీమియం చెల్లించ‌క‌ముందే) స‌రెండ‌ర్ చేయాల‌నుకుంటే ఎంత ప‌న్ను వ‌ర్తిస్తుంది.

మ‌హేష్‌కి మెచ్యూరిటీ విలువ ల‌భించ‌దు. ఎందుకంటే చాలావ‌ర‌కు సాంప్ర‌దాయ పాల‌సీల‌కే ఏడాది త‌ర్వాత స‌రెండ‌ర్ విలువ ఉండ‌దు. ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న‌ ఒక‌టి లేదా రెండు పాల‌సీల‌కు మాత్ర‌మే ఇది స‌రెండ‌ర్ విలువ‌ను ఇస్తున్నాయి. ఒక‌వేళ ఆ విధంగా స‌రెండ‌ర్ విలువ వ‌స్తే దానిపై ప‌న్ను ఉంటుంది. ప‌న్ను మిన‌హాయింపులు క్లెయిమ్ చేస్తే రివ‌ర్స‌ల్ ప‌ద్ధ‌తి వ‌ర్తిస్తుంది. అంటే మిన‌హాయింపు మొత్తం ఆదాయానికి క‌లుపుతారు.

ఉదాహ‌ర‌ణ‌కు రెండేళ్ల త‌ర్వాత అత‌డు స‌రెండ‌ర్ చేయాల‌నుకుంటే బీమా హామీ ప్రీమియంపై ప‌ది రెట్లు అధికంగా ఉంటే ప‌న్ను, టీడీఎస్‌ వ‌ర్తించ‌దు.

సింగిల్ ప్రీమియం పాల‌సీ:
దీనిపై కూడా పైన తెలిపిన సాంప్ర‌దాయ పాల‌సీల మాదిరిగానే ప‌న్ను నిబంధ‌న‌లు ఉంటాయి. అయితే సింగిల్ ప్రీమియం పాల‌సీ స‌రెండ‌ర్ చేసేందుకు రెండేళ్లు ఆగాల్సి ఉంటుంది.

పెన్ష‌న్ పాల‌సీలు:
పెన్ష‌న్ పాల‌సీల‌కు బీమా హామీ ఉండ‌దు కాబ‌ట్టి ఇవ‌న్ని నిబంధ‌న‌లు వ‌ర్తించ‌వు.

పెన్ష‌న్ పాల‌సీల మెచ్యూరిటీ:
పెన్ష‌న్ పాల‌సీలపై మెచ్యూరిటీ స‌మ‌యంలో ప‌న్ను ఉండ‌దు. అయితే పాల‌సీలో మూడో వంతు మాత్ర‌మే ఉప‌సంహ‌రించుకునేందుకు వీలుంటుంది. మిగ‌తాది యాన్యుటీ కొనుగోలుకు ఉప‌యోగించాలి. దీనిపై ప‌న్ను ఉంటుంది.

పెన్ష‌న్ స‌రెండ‌ర్:
దీనికి రెండు ర‌కాల నిబంధ‌న‌లు ఉన్నాయి…

  1. పెన్ష‌న్ పాల‌సీ కొనుగోలు స‌మ‌యంలో సెక్ష‌న్ 80 సి కింద‌ ప‌న్ను మిన‌హాయింపుల‌ను క్లెయిమ్ చేస్తే, స‌రెండ‌ర్ చేసిన‌ప్పుడు ప‌న్ఉ ఉంటుంది. అంటే మిన‌హాయింపు మొత్తం ఆదాయానికి క‌లిపి శ్లాబు ప్ర‌కారం ప‌న్ను వేస్తారు.
  2. సెక్ష‌న్ 80 సీ కింద ప‌న్ను క్లెయిమ్ చేసుకోక‌పోతే కేవ‌లం లాభాల‌పై మాత్ర‌మే ప‌న్ను ప‌డుతుంది. అదేవిధంగా మెచ్యూరిటీ, ప్రీమియం చెల్లింపును గుర్తించి వ‌చ్చిన దానిని లాభంగా లెక్కిస్తారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని