చౌక‌గా విద్యా రుణాలు అందిస్తున్న ప్ర‌భుత్వ‌ బ్యాంకులు

విద్యా రుణాన్ని ప్ర‌భుత్వ బ్యాంకుల‌కు బ‌దిలీ చేసుకోవ‌డం ద్వారా 4 శాతం వ‌ర‌కు వ‌డ్డీ ఆదా చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

Updated : 03 Mar 2021 15:06 IST

నాణ్య‌మైన‌, ఉన్న‌త విద్య విద్యార్ధికి విజ‌య‌మంత‌మైన జీవితాన్ని ఇవ్వడంలో తోడ్ప‌డుతుంది అన‌డంలో సందేహం లేదు. అందువ‌ల్ల ప్ర‌తి ఒక్క‌రూ ఉన్న‌త విద్య‌వైపు అడుగులు వేస్తున్నారు. ప్ర‌ముఖ విద్యా సంస్థ‌ల‌లో చ‌ద‌వాల‌ని ఆశ‌ప‌డుతున్నారు. దీంతో ఉన్న‌త చ‌దువుల‌కు అయ్యే ఖ‌ర్చు పెరిగింది. ప్ర‌తిభావంతులైన విద్యార్ధులు ఆర్థిక స‌హాయం లేని కార‌ణంగా ఉన్న‌త విద్య‌కు దూరంగా ఉండ‌కూడ‌ద‌నే ఉద్దేశ్యంతో ప్రభుత్వం విద్యా రుణాల‌ను ప్ర‌వేశ‌పెట్టింది. ఇందులో భాగంగానే ప్ర‌భుత్వ బ్యాంకుల‌తో పాటు బ్యాంకింగేత‌ర సంస్థ‌లు కూడా విద్యా రుణాల‌ను అందిస్తున్నాయి. 

అయితే ప్ర‌స్తుతం బ్యాంకింగేత‌ర సంస్థ‌ల‌లో విద్యా రుణం తీసుకున్న చాలా మంది భార‌తీయ విద్యార్ధులు,  వారి రుణాన్ని ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల‌కు(పీఎస్‌యూ) మార్చుకునేందుకు ఆశ‌క్తి చూపుతున్నారు. వ‌డ్డీ రేట్ల‌లో వ్య‌త్యాస‌మే ఇందుకు కార‌ణంగా తెలుస్తుంది. 

రుణం బ‌దిలీ చేసుకోవ‌డం ద్వారా, వారి తీసుకున్న రుణంపై ఒక్కో విద్యార్ధి 4శాతం వ‌డ్డీ ఆదా చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. బ్యాంకింగేత‌ర ఆర్థిక సంస్థ‌లు(ఎన్‌బీఎస్‌సీ) విద్యారుణంపై 13 నుంచి 14 శాతం వ‌ర‌కు వ‌డ్డీని వ‌సూలు చేస్తున్నాయి. ఇటువంటి సంస్థ‌ల‌లో ఇప్ప‌టికే రుణం తీసుకున్న వారికి, ప్ర‌భుత్వ‌ బ్యాంకులు 9.3 శాతం వ‌డ్డీతో విద్యారుణ బ‌దిలీకి అనుమ‌తిస్తున్నాయి. ఐఐటీ(ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ), ఐఐఎమ్‌(ఇండియాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌) వంటి ప్రీమియం సంస్థ‌ల‌లో చ‌దువుతున్న విద్యార్ధుల‌కు కూడా త‌క్కువ వ‌డ్డీ రేట్ల‌తో ఎడ్యుకేష‌న్ లోన్‌ను ప్ర‌భుత్వ బ్యాంకులు ఆఫ‌ర్ చేస్తున్నాయి.

విద్యార్థి చ‌దువు పూర్త‌యి, విద్యారుణం తిరిగి చెల్లించేంద‌కు స‌న్నద్ధం అయ్యేంత వ‌ర‌కు ప్రాసెసింగ్ ఫీజుల‌ను ర‌ద్దు చేస్తున్నాయి కొన్ని ప్ర‌భుత్వ‌ బ్యాంకులు. అంతేకాకుండా తిరిగి చెల్లించే కాల‌వ్య‌వ‌ధిని కూడా పెంచుతున్నాయి. 

ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల‌లో కొత్త‌గా ద‌‌ర‌ఖాస్తు చేసుకునే వారు మ‌రింత సుల‌భంగా విద్యా రుణం పొంద‌వ‌చ్చు. చ‌దువుతున్న కోర్సు ఆధారంగా ఎంత రుణం ఇవ్వాలో నిర్ణ‌యిస్తారు, కోర్సును బ‌ట్టి అధిక మొత్తంలో కూడా రుణం ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకొస్తున్నాయి. పీఎస్‌బీ బ్యాంకుల‌లో వ‌డ్డీ రేట్లు త‌క్కువే అయిన‌ప్ప‌టికీ, బ్యాంకు జాబితాలోని సంస్థ‌లో చ‌దివే విద్యార్ధుల‌కు మాత్ర‌మే రుణాలు అందుబాటులో ఉన్నాయి. 

విద్యా కాలంలో పీఎస్‌బీల నుంచి మార‌టోరియంను పొందే అవ‌కాశం కూడా ఉంటుంది. ప్రైవేట్ సంస్థ‌లు రుణం మంజూరైన‌ వెంట‌నే కొంత మొత్తాన్ని వ‌డ్డీగా జ‌మ‌చేసుకుంటారు. 

చెల్లింపుల ప్ర‌క్రియ పూర్తిగా ప్రారంభ‌మ‌యిన త‌రువాత‌ ప్ర‌భుత్వ బ్యాంకులు రుణ బ‌దిలీకి అనుమ‌తిస్తాయి. రుణ బ‌దిలీపై మార‌టోరియం వ‌ర్తించ‌దు. వ‌డ్డీ రేటులో ఉన్న వ్య‌త్యాస‌మే రుణ బ‌దిలీకి ప్ర‌ధానం కార‌ణం. 

అర్హ‌త ప్ర‌మాణాలు బ్యాంకుపై ఆధార‌ప‌డి ఉంటాయి. ఇవి అన్ని బ్యాంకులకు ఒకే ర‌కంగా ఉండ‌వు. ఉదాహ‌ర‌ణ‌కి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 1.5 కోట్ల రుణాన్ని 15 సంవ‌త్స‌రాల కాల‌ప‌రిమితితో అందిస్తుంది. అయితే  చెల్లించ‌వ‌ల‌స‌ని క‌నీస రుణం రూ.10ల‌క్ష‌లు ఉండాలి. అదేవిధంగా మొత్తం రుణానికి 100శాతం హామీ ఇవ్వాలి. 

ఇప్ప‌టికే రుణం తీసుకున్న సంస్థ‌కు హామీ ఇచ్చి వుంటే, దాన్ని ప్ర‌భుత్వ బ్యాంకుకు బ‌దిలీ చేసుకోవ‌చ్చు. ఎటువంటి హామీ లేకుండా రుణం తీసుకుని వుంటే, రుణ మొత్తంపై 100శాతం హామీని ఇవ్వాల్సి ఉంటుంది. హామీ ఇచ్చిన వ్య‌క్తిని స‌హా-రుణ గ్ర‌హీత‌గా చేరుస్తారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని