Adani group: మాపై బురద చల్లడమే వారి పని: అదానీ గ్రూప్‌

Adani group: మహువా మొయిత్రాపై ఆరోపణల నేపథ్యంలో అదానీ గ్రూప్‌ స్పందించింది. తమ పేరు, ప్రతిష్ఠలను దెబ్బతీసేందుకు ఒకవర్గం నిత్యం కుట్ర పన్నుతూనే ఉందని పేర్కొంది.

Published : 17 Oct 2023 01:42 IST

Adani group | దిల్లీ: డబ్బులు తీసుకుని లోక్‌సభలో ప్రశ్నలు అడిగారంటూ తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రాపై భాజపా ఎంపీ నిషికాంత్‌ దుబే చేసిన ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. అదానీ గ్రూప్‌ను, ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకునేందుకు ప్రముఖ వ్యాపారవేత్త దర్శన్‌ హీరానందానీ నుంచి ఆమె డబ్బు తీసుకున్నారని దుబే ఆరోపించారు. ఈ నేపథ్యంలో అదానీ గ్రూప్‌ దీనిపై స్పందించింది. అదానీ గ్రూప్ పేరు ప్రతిష్ఠలను దిగజార్చేందుకు ఒక వర్గం, కొందరు వ్యక్తులు నిత్యం బురదజల్లే కార్యక్రమం పెట్టుకున్నారంటూ ఓ ప్రకటన విడుదల చేసింది.

ఒక వ్యాపార సంస్థ ప్రయోజనాలను కాపాడ్డానికి తృణమూల్‌ ఎంపీ పార్లమెంట్‌లో ప్రశ్నలు సంధించేవారంటూ భాజపా ఎంపీ నిషికాంత్‌ దుబే లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లాకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన ఆధారాలను న్యాయవాది జై అనంత్‌ దెహద్రాయ్ అందించారని పేర్కొన్నారు. సదరు వ్యాపారవేత్తకు లోక్‌సభ వెబ్‌సైట్‌ లాగిన్‌ యాక్సెస్‌ ఇచ్చారని దుబే ఆరోపించారు. దీనిపై తాజాగా ఆయన కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖకు మరో లేఖ రాశారు. ఈ నేపథ్యంలో అదానీ గ్రూప్‌ దీనిపై ఓ ప్రకటన విడుదల చేసింది.

మూడు నెలల్లో ఓయోలో కొత్తగా మరో 750 హోటళ్లు

‘‘అదానీ గ్రూప్‌, అదానీ గ్రూప్‌ కంపెనీలను లక్ష్యంగా చేసుకుని మహువా మొయిత్రా, హీరానందానీ గ్రూప్‌ నేరపూరిత కుట్ర పన్నినట్లు దెహద్రాయ్‌ సీబీఐకి ఫిర్యాదు చేశారు. హీరా నందానీ గ్రూప్‌, మహువా మొయిత్రా మధ్య క్విడ్‌ ప్రోకో జరిగిందని ఆయన పేర్కొన్నారు. అదానీ గ్రూప్‌, గౌతమ్‌ అదానీ కీర్తి, ప్రతిష్ఠలను దెబ్బతీసేందుకు 2018 నుంచి కుట్ర జరుగుతోందనడానికి లాయర్‌ ఫిర్యాదే నిదర్శనం’’ అని అదానీ గ్రూప్‌ పేర్కొంది. ఓసీసీఆర్‌పీ సహా కొన్ని విదేశీ మీడియా, షార్ట్‌ సెల్లర్‌ సంస్థలు దేశంలోని కొందరితో కలిసి పదే పదే తమపై దాడి చేస్తూనే ఉన్నాయని అదానీ గ్రూప్‌ పేర్కొంది. వాటాదారుల ప్రయోజనాల దృష్ట్యా ఈ ప్రకటనను జారీ చేస్తున్నట్లు తెలిపింది. మరోవైపు ఈ వ్యవహారంపై భాజపా ఎంపీకి, లాయర్‌కు మహువా మొయిత్రా లీగల్‌ నోటీసులు పంపించినట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని