OYO: మూడు నెలల్లో ఓయోలో కొత్తగా మరో 750 హోటళ్లు

OYO: శీతాకాల పర్యాటక సీజన్‌ ప్రారంభమైన నేపథ్యంలో ఓయో కొత్తగా మరికొన్ని హోటళ్లను తమ వేదికలో చేర్చనున్నట్లు కంపెనీ తెలిపింది.

Published : 16 Oct 2023 16:56 IST

OYO | దిల్లీ: ప్రముఖ ఆతిథ్య సేవల సంస్థ ఓయో (OYO) మరికొన్ని హోటళ్లను తమ వేదికపై జత చేయనున్నట్లు తెలిపింది. వచ్చే మూడు నెలల్లో కొత్తగా 750 హోటళ్లను తమ ప్లాట్‌ఫామ్‌లో చేరుస్తామని వెల్లడించింది. దాదాపు 35 మార్కెట్లలో ఇవి విస్తరించి ఉంటాయని పేర్కొంది. ఓయో (OYO) ప్రీమియం బ్రాండ్లయిన ప్యాలెట్‌, టౌన్‌హౌజ్‌, టౌన్‌హౌజ్‌ ఓక్‌, ‘కలెక్షన్‌ ఓ’ కేటగిరీల్లోనే కొత్త హోటళ్లు ఉంటాయని తెలిపింది.

గోవా, జైపుర్‌, ముస్సోరీ, రిషికేశ్‌, కట్రా, పురీ, శిమ్లా, ఉదయ్‌పుర్‌, మౌంట్‌ అబూ మార్కెట్లపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్లు ఓయో తెలిపింది. తమ కస్టమర్లకు నాణ్యమైన ఆతిథ్యం, సేవలు అందించాలన్న తమ లక్ష్యానికి అనుగుణంగానే ఇప్పటి వరకు కవర్‌ కాని మార్కెట్లలోకీ విస్తరిస్తున్నట్లు పేర్కొంది. కొత్త హోటళ్ల చేరిక వల్ల టూరిజం అభివృద్ధితో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని తెలిపింది.

జనవరి- జూన్‌ మధ్య భారత్‌లోకి విదేశీ యాత్రికుల సంఖ్య వార్షిక ప్రాతిపదికన 106 శాతం పెరిగినట్లు ఓ ప్రభుత్వ నివేదికను ఉటంకిస్తూ ఓయో వెల్లడించింది. శీతాకాలంలోకి ప్రవేశిస్తున్న తరుణంలో ఈ గణాంకాలు టూరిజం పరిశ్రమకు ఉత్సాహాన్నిచ్చే అంశమని పేర్కొంది. అక్టోబర్‌- జనవరి మధ్య అటు విదేశీయులతో పాటు దేశీయ యాత్రికుల సంఖ్య పెరుగుతుందని తెలిపింది. ఈ సీజన్‌ పర్యాటక, ఆతిథ్య రంగానికి చాలా కీలకమని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే తమ హోటల్‌ నెట్‌వర్క్‌ను విస్తరిస్తున్నట్లు తెలిపింది.

కస్టమర్లకు చెల్లింపుల విషయంలో మరింత సౌకర్యాన్ని అందించడం కోసం ఇటీవల ‘స్టే నౌ పే లేటర్‌ (SNPL)’ సేవలను కూడా ప్రారంభించినట్లు ఓయో తెలిపింది. దీని కింద కస్టమర్లు రూ.5,000 వరకు క్రెడిట్‌ వసతి పొందొచ్చు. దీన్ని రూ.15 రోజుల్లోగా చెల్లించాల్సి ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని