Adani group shares: డెలాయిట్‌ ఎగ్జిట్‌.. ‘అదానీ’ షేర్లు డౌన్‌

Adani group shares: అదానీ పోర్ట్స్‌ ఆడిటర్‌ బాధ్యతల నుంచి డెలాయిట్‌ వైదొలిగిన నేపథ్యంలో అదానీ గ్రూప్‌ కంపెనీల్లో మరోసారి అమ్మకాల ఒత్తిడి నెలకొంది.

Published : 14 Aug 2023 13:20 IST

దిల్లీ: ప్రముఖ వ్యాపార వేత్త గౌతమ్‌ అదానీకి (Gautam adani) చెందిన అదానీ గ్రూప్‌ (Adani group) షేర్లలో మరోసారి అమ్మకాల ఒత్తిడి కనిపించింది. అదానీ పోర్ట్స్‌ ఆడిటర్‌ బాధ్యతల నుంచి డెలాయిట్‌ (Deloitte) సంస్థ వైదొలగడం ఇందుకు నేపథ్యం. హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ నివేదిక తర్వాత గ్రూప్‌లోని ఇతర సంస్థలపై ఆడిటర్‌ విస్తృత అంశాలు కోరుకుంటున్నట్లు డెలాయిట్‌ తెలిపింది. నివేదికలో ప్రధానంగా వెల్లడించిన కొన్ని లావాదేవీలపై ఆందోళన వ్యక్తం చేసిన కొన్ని వారాల్లోనే డెలాయిట్‌ వైదొలిగింది. దీంతో ఎంఎస్‌కేఏ అండ్‌ అసోసియేట్స్‌ను కొత్త ఆడిటర్‌గా అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌ నియమించుకుంది.

ద్వారకా ఎక్స్‌ప్రెస్‌ వ్యయం 14 రెట్లు పెరిగిందా..?

డెలాయిట్‌ వైదొలిగిన నేపథ్యంలో మరోసారి అదానీ గ్రూప్‌పై మదుపరుల్లో ఆందోళన మొదైలంది. దీంతో సోమవారం ఆ గ్రూప్‌ షేర్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. అదానీ గ్రూప్‌ ప్రధాన కంపెనీ అయిన అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేర్లు ఈ ఉదయం బీఎస్‌ఈలో 5.41 శాతం మేర నష్టపోయాయి. అదానీ ట్రాన్స్‌మిషన్‌ 4.77 శాతం, అదానీ పవర్‌ 4.23 శాతం, అంబుజా సిమెంట్‌ 4 శాతం, అదానీ పోర్ట్స్‌ 3.70 శాతం మేర నష్టపోయాయి. అదానీ గ్రీన్‌ ఎనర్జీ (3.14 శాతం), అదానీ టోటల్‌ గ్యాస్‌ (3 శాతం), ఎన్డీటీవీ (3 శాతం), ఏసీసీ (2.23 శాతం) షేర్లు కూడా పతనమయ్యాయి.

15 రోజులు గడువు కోరిన సెబీ

మరోవైపు అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్‌ ఆరోపణల వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న సెబీ.. తమ నివేదిక సమర్పించేందకు సుప్రీంకోర్టును మరింత గడువు కోరింది. దర్యాప్తు ఓ కొలిక్కి వచ్చిందని, నివేదిక సమర్పించేందుకు మాత్రం మరో 15 రోజలు గడువు కావాలని కోరింది. మొత్తం 24 లావాదేవీలకు సంబంధించి 17 లావాదేవీలపై దర్యాప్తు పూర్తయ్యిందని సుప్రీంకోర్టుకు తెలియజేసింది. మిగిలిన లావాదేవీలపైనా విచారణ పూర్తి చేసేందుకు గడువు ఇవ్వాలని కోరింది. వాస్తవంగా ఆగస్టు 14లోగా నివేదిక సమర్పించాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని