AI Tool: టైపింగ్‌ సౌండ్‌తో పాస్‌వర్డ్‌ గుట్టురట్టు.. AIతో పెద్ద చిక్కే వచ్చిందే..!

AI Tool: ఏఐ సాయంతో మోసాలకు పాల్పడుతున్న ఉదంతాలను ఇప్పటికే చూస్తున్నాం. ఇప్పుడు తాజా పరిశోధనలో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కీబోర్డ్‌లో మనం టైప్‌ చేసేటప్పుడు వచ్చే శబ్దాన్ని బట్టి మనం ఏ పాస్‌వర్డ్‌ ఎంటర్ చేశామో ఏఐ టూల్‌ ద్వారా తెలుసుకోవచ్చట!

Updated : 16 Aug 2023 18:07 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రంగంతో సంబంధం లేకుండా ప్రతి చోటా ఇప్పుడు వినిపిస్తున్న పేరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (AI). దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు వార్తలు వస్తున్నాయి. ఎక్కడ చూసినా దీని గురించే చర్చలు జరుగుతున్నాయి. ఈ సాంకేతికను వేగంగా అందిపుచ్చుకుంటూ ప్రయోజనాలు పొందుతున్నవారు కొందరైతే.. ‘డీప్‌ఫేక్‌’ ద్వారా మోసాలకు పాల్పడుతున్న వారూ ఉన్నారు. తాజాగా ఏఐకి సంబంధించి ఓ పరిశోధనలో విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి.

మాటల్లో మభ్యపెట్టి పాస్‌వర్డ్‌లు అడగడం, లింక్‌లు పంపి డేటాను సేకరించడం వంటివి సాధారణంగా సైబర్‌ మోసగాళ్లు ప్రయోగించే అస్త్రాలు. ఇప్పుడు వీటితో అవసరం లేకుండా సులువుగా పాస్‌వర్డ్‌ లాంటి సున్నితమైన సమాచారాన్ని సులువుగా సంపాదించే అవకాశం ఉందంటోంది ఈ అధ్యయనం. ఫోన్‌ మాట్లాడుతున్నప్పుడో లేదా జూమ్‌ కాల్‌లో ఉన్నప్పుడో బ్యాలెన్స్‌ చెక్‌ చేద్దామని పాస్‌వర్డ్‌ టైప్‌ చేశారో ఇక అంతే! ఇక మీ పాస్‌వర్డ్‌ మోసగాళ్ల చేతికి చిక్కినట్లే. ఏఐ సాయంతో ఇలాంటి కొత్త మోసాలకు తెర తీసే అవకాశాలూ ఉన్నట్లు ఓ పరిశోధనలో తేలింది. ఉదాహరణకు మనం జూమ్‌ కాల్‌ మాట్లాడుతున్న సమయంలో ఏదైనా టైప్‌ చేస్తే మనం ఉపయోగించే పరికరంలోని మైక్రోఫోన్‌ ద్వారా ఆ శబ్దాన్ని ఏఐ టూల్‌ కనిపెడుతుంది. మనం ఏ అక్షరం టైప్‌ చేస్తున్నామో 90 శాతం కచ్చితత్వంతో చెప్పగలదంటోంది ఈ అధ్యయనం.

డీప్‌ఫేక్‌ మాయాజాలం!

దుర్హామ్, సర్రే, రాయల్ హోల్లోవే యూనివర్సిటీలకు చెందిన పరిశోధకులు అధ్యయనంలో పాల్గొన్నారు. అందులో భాగంగా వీరు మ్యాక్‌బుక్‌ ప్రోను వినియోగించారు. కీ-బోర్డులోని కీని టైప్‌ చేసినప్పుడు ఆ శబ్దాన్ని జూమ్‌ కాల్‌లో విన్న ఏఐ టూల్‌.. వారు ఏ పదాన్ని టైప్ చేస్తున్నారో 93 శాతం కచ్చితత్వంతో కనిపెట్టగలిగిందని వారు వెల్లడించారు. అదే ఐఫోన్‌ 13 మినీ సాయంతో రికార్డు చేసినప్పుడు మరింత కచ్చితత్వంతో (95 శాతం) సరైన సమాధానం చెప్పగలిగిందని తెలిపారు. ఆరు బయట ప్రదేశాల్లో ల్యాప్‌ట్యాప్‌ల వినియోగించే వారికి ఇలాంటి మోసాల ముప్పు పొంచి ఉంటుందని పరిశోధకులు ఆందోళన వ్యక్తంచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని