Google Pixel 8a: AI ఫీచర్లు, 64MP కెమెరాతో గూగుల్‌ పిక్సెల్‌ 8ఏ.. ధర, ఫీచర్లివే

Google Pixel 8a: గూగుల్‌ పిక్సెల్‌ 8ఏ ఫోన్‌ 64ఎంపీ కెమెరా సహా అత్యాధునిక ఏఐ ఫీచర్లతో భారత్‌లో విడుదలైంది.

Published : 08 May 2024 12:05 IST

Google Pixel 8a | ఇంటర్నెట్‌ డెస్క్‌: టెక్‌ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూసిన గూగుల్‌ పిక్సెల్‌ 8ఏ (Google Pixel 8a) ఫోన్‌ భారత్‌లోకి వచ్చేసింది. మే 14న జరగనున్న గూగుల్‌ I/O కార్యక్రమంలో దీన్ని విడుదల చేస్తారని అంతా భావించారు. కానీ, ఎలాంటి ప్రకటన లేకుండా మే 7న సాయంత్రం తీసుకొచ్చి అందరినీ ఆశ్చర్యపర్చింది. ఈ కొత్త ఫోన్‌ గూగుల్‌ టెన్సార్‌ జీ3 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. పిక్సెల్‌ 8, పిక్సెల్‌ 8ప్రో తరహాలోనే జెమిని, బెస్ట్ టేక్‌, ఆడియో మ్యాజిక్‌ ఎరేజర్‌ వంటి అత్యాధునిక ఏఐ ఫీచర్లు ఉన్నాయి.

గూగుల్‌ పిక్సెల్‌ 8ఏ ధర..

గూగుల్‌ పిక్సెల్‌ 8ఏ (Google Pixel 8a)ను ఫ్లిప్‌కార్ట్‌లో ముందస్తుగా ఆర్డర్‌ చేయొచ్చు. మే 14 నుంచి విక్రయాలు అందుబాటులోకి వస్తాయి. 128జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ.52,999. 256జీబీ ఫోన్‌ ధర రూ.59,999. లాంఛ్‌ ఆఫర్లలో భాగంగా ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై రూ.4000 వరకు క్యాష్‌ బ్యాక్‌ లభిస్తుంది. కొన్ని స్మార్ట్‌ఫోన్‌ మోడల్స్‌పై రూ.9,000 ఎక్స్ఛేంజ్‌ బోనస్‌ కూడా పొందొచ్చు. ముందుగా ఆర్డర్‌ చేసుకున్నవారు రూ.999కే పిక్సెల్‌ ఏ-సిరీస్‌ బడ్స్‌ను సొంతం చేసుకోవచ్చు. ఎప్పటిలాగే అబ్సీడియన్‌, పోర్సిలిన్‌తో పాటు ఈసారి కొత్తగా అలో, బే రంగుల్లోనూ ఈ ఫోన్‌ అందుబాటులో ఉంది.

గూగుల్‌ పిక్సెల్‌ 8ఏ ఫీచర్లు..

పిక్సెల్‌ 8, పిక్సెల్‌ 8ప్రో తరహాలోనే చాలా ఏఐ ఫీచర్లను పిక్సెల్‌ 8ఏ (Google Pixel 8a)లోనూ గూగుల్‌ కొనసాగించింది. వెనక 64MP ప్రధాన లెన్స్‌తో పాటు 13MP అల్ట్రావైడ్‌ లెన్స్‌తో కెమెరాను ఇచ్చారు. సెల్పీలు, వీడియో కాల్స్‌ కోసం ముందు భాగంలో 13MP కెమెరాను పొందుపర్చారు. వీడియోలు రికార్డ్‌ చేసేటప్పుడు అనవసర శబ్దాలను తొలగించేలా ఆడియో మ్యాజిక్‌ ఎరేజర్‌ కూడా ఉంది. 120Hz రీఫ్రెష్‌ రేటు, 2,000nits గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో 6.1 అంగుళాల తెరను పొందుపర్చారు. దీనిపై కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ రక్షణనిచ్చారు. ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 4,404mAh బ్యాటరీని ఇచ్చారు. 8జీబీ ర్యామ్‌తో 128జీబీ/256జీబీ స్టోరేజ్‌ వేరియంట్లు ఉన్నాయి. ఏడేళ్ల పాటు ఓఎస్‌, సెక్యూరిటీ, ఫీచర్‌ డ్రాప్‌ అప్‌డేట్లు ఇవ్వనున్నారు. ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పనిచేస్తుంది. వైఫై 6, బ్లూటూత్‌ 5.3, ఎన్‌ఎఫ్‌సీ వంటి కనెక్టివిటీ ఫీచర్లున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని