Updated : 08 Jun 2022 20:22 IST

Real estate: ఆర్‌బీఐ నిర్ణయంతో రియల్‌ ఎస్టేట్‌పై ప్రభావమెంత? బిల్డర్లు ఏమంటున్నారు?

దిల్లీ: గృహ రుణాలపై వడ్డీ రేటు తక్కువగా ఉండడంతో సొంతింటి కల (Home loans) నెర్చుకునేందుకు మొన్నటి వరకు జనం ఎగబడ్డారు. ఎన్నడూ లేని రీతిలో ఇళ్ల కొనుగోళ్లకు ముందుకొచ్చారు. జనవరి- మార్చి త్రైమాసికంలో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఇళ్ల కొనుగోళ్లు 71 శాతం మేర పెరిగాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 2015 తర్వాత ఓ త్రైమాసికంలో గృహ విక్రయాలు ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారని అన్‌రాక్‌ ప్రాపర్టీ కన్సల్టెంట్‌ పేర్కొంది. అయితే, ద్రవ్యోల్బణం కట్టడిలో భాగంగా తాజాగా ఆర్‌బీఐ తీసుకున్న రేట్ల పెంపు (RBI Rate hike) నిర్ణయం రియల్‌ ఎస్టేట్‌ రంగం నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. రెపో రేటు పెంపుతో హోమ్‌లోన్‌ భారంగా మారే అవకాశం ఉందని, దీనివల్ల గృహ కొనుగోళ్లు తగ్గే అవకాశం ఉందని బిల్డర్ల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. దీని వల్ల తాము తీసుకునే వడ్డీ రేట్లు కూడా పెరగడం వల్ల తమ మార్జిన్లు కూడా తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. అదే సమయంలో ద్రవ్యోల్బణం తగ్గితే ఉక్కు, సిమెంట్‌ ధరలు దిగి వస్తాయని ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. అదే విధంగా గృహ రుణాల విషయంలో అర్బన్‌, రూరల్‌ కోపరేటివ్‌ బ్యాంకులకు ఉన్న రుణ పరిమితిని నూరు శాతం పెంచడాన్ని బిల్డర్లు స్వాగతిస్తున్నారు.

ఆర్‌బీఐ నిర్ణయంపై క్రెడాయ్‌ జాతీయ అధ్యక్షుడు హర్షవర్దన్‌ పటోడియా మాట్లాడుతూ.. వినియోగరుణాలు, హోమ్‌ లోన్స్‌ ప్రియం అవ్వడం వల్ల గృహ కొనుగోళ్లకు డిమాండ్‌ తగ్గుతుందని చెప్పారు. అయితే, ఇది స్వల్పకాలం మాత్రమేనన్నారు. కోపరేటివ్‌ బ్యాంకుల్లో వ్యక్తిగత రుణ పరిమితి పెంచడం స్వాగతించదగ్గ పరిణామమని తెలిపారు. రెపో రేటు పెంపు రెసిడెన్షియల్‌ హౌసింగ్‌ సెగ్మెంట్‌లో కొనుగోళ్లపై స్వల్పకాలం పాటు ఉంటుందని రియల్టర్స్‌ సంఘం NAREDCO అధ్యక్షుడు రాజన్‌ బండేల్కర్‌ అన్నారు. ఈఎంఐ పెరగడం వల్ల గృహ కొనుగోళ్లలో వేగం తగ్గుతుందని హిరాందానీ గ్రూప్‌ ఎండీ నిరజన్‌ హిరందానీ అన్నారు. కోపరేటివ్‌ బ్యాంకుల్లో రుణ పరిమితి పెంచడాన్ని టాటా రియల్టీ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఎండీ, సీఈఓ సంజయ్‌ దత్‌ స్వాగతించారు. టైర్‌-1, టైర్‌-2యేతర నగరాల్లో గృహ నిర్మాణాలు ఊపందుకుంటాయని ఆశాభావం వ్యక్తంచేశారు.

ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడం వల్ల రియల్ ఎస్టేట్ రంగానికి మేలు చేస్తుందని గౌర్స్‌ గ్రూప్‌ సీఎండీ మనోజ్‌ గౌర్‌ పేర్కొన్నారు. దీనివల్ల ముడిసరకు ధరలు తగ్గుతాయని చెప్పారు. ఆర్‌బీఐ నిర్ణయం వల్ల గృహ కొనుగోలుదారుల సెంటిమెంట్‌పై ప్రభావం పడొచ్చని క్రెడాయ్‌ పశ్చిమ యూపీ అధ్యక్షుడు అమిత్‌ మోదీ తెలిపారు. మొదటిసారి ఇంటిని కొనుగోలు చేసేవారిపై ఎక్కువ ప్రభావం ఉంటుందని చెప్పారు. ఆర్‌బీఐ గత నెల తీసుకున్న రెపో రేటు నిర్ణయం వల్ల ఉక్కు వంటి కమొడెటీల ధరలు తగ్గుముఖం పట్టాయని ఏఐపీఎల్‌ గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పంకజ్‌ పాల్‌ పేర్కొన్నారు. తాజా నిర్ణయం వల్ల కూడా రేట్లు తగ్గి అటు రియల్‌ ఎస్టేట్‌, ఇటు అంతిమ వినియోగదారులకు మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. ఆర్‌బీఐ నిర్ణయ ప్రభావం స్వల్పకాలమేనని మరికొందరు అభిప్రాయపడ్డారు.

 

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని