దీర్ఘ‌కాలిక‌ పెట్టుబ‌డుల‌కు ఐదు మార్గాలు

దీర్ఘ‌కాలిక‌ పెట్టుబ‌డుల‌పై లాభాల‌ను పొందేందుకు కొన్ని సూచ‌న‌లు పాటించ‌డం మంచిది....

Updated : 01 Jan 2021 20:04 IST

దీర్ఘ‌కాలిక‌ పెట్టుబ‌డుల‌పై లాభాల‌ను పొందేందుకు కొన్ని సూచ‌న‌లు పాటించ‌డం మంచిది

పెట్టుబ‌డులు త్వ‌ర‌గా ప్రారంభించండి:

పెట్టుబడులు ఎంత త్వ‌ర‌గా ప్రారంభిస్తే చ‌క్ర‌వ‌డ్డీతో కలిపి అంత లాభం సంపాదిస్తారు. దీంతో పెట్టుబ‌డుల‌ను తెలివిగా నిర్వ‌హించ‌డం కూడా ముఖ్య‌మే. దీర్ఘ‌కాలంలో అధిక రాబ‌డిని పొందేందుకు వీలైనంత త్వ‌రగా పెట్టుబ‌డుల‌ను ప్రారంభించాలి. ఎంత ఆల‌స్య‌మైతే అంత త‌క్కువ లాభాలు వ‌స్తాయి.

ల‌క్ష్యాల‌ను సిద్ధం చేసుకోండి:

మీరు ఎందుకోసం పెట్టుబ‌డులు పెడుతున్నారో స్ప‌ష్ట‌త ఉండాలి. ఒక ఆర్థిక లక్ష్యం చేరుకునేందుకు ఎంత డ‌బ్బు అవ‌స‌ర‌మ‌వుతుంది, ఎంత కాలం ప‌డుతుంది, ఎంత మేర‌కు పెట్టుబ‌డులు చేయాల‌నేది తెలుసుకోవాలి. ఎలాంటి ల‌క్ష్యం లేకుండా పెట్టుబ‌డులు పెడితే నిర్ల‌క్ష్యం చేసే అవ‌కాశం ఉంటుంది. ఉదాహ‌ర‌ణ‌కు, ప‌ద‌వీ విర‌మ‌ణ కోసం నిధిని స‌మ‌కూర్చుకునేందుకు 25 ఏళ్ల వ‌య‌సు వారికి 30 నుంచి 35 ఏళ్ల వ‌ర‌కు స‌మ‌యం ఉంటుంది. పిల్ల‌ల ఉన్న‌త విద్య కోసం 10-15 సంవ‌త్స‌రాలు ఉంటుంది. మీ పెట్టుబ‌డులు ఎప్పుడు, ఎక్క‌డ చేయాల‌నేది నిర్ణ‌యించుకోవ‌డం కూడా చాలా ముఖ్యం. ఆర్థిక ల‌క్ష్యాల ఆధారంగా పెట్టుబ‌డి సాధ‌నాల‌ను ఎంచుకోవాలి.

వ్యూహాత్మ‌క పెట్టుబ‌డులు:

పెట్టుబ‌డుల‌ను కేటాయించ‌డం కూడా ఒక తెలివైన నిర్ణ‌యం. ఏ ఫండ్‌లో ఎంత పెట్టుబ‌డుల‌ను పెట్టాలి అనేది ప్ర‌ణాళిక వేసుకోవాలి. డెట్‌, ఈక్విటీ, గోల్డ్, స్థిరాస్తి వంటి వాటిని ఎంచుకోవాలి. దీర్ఘ‌కాలిక‌ పెట్టుబ‌డుల‌కు సాధనాల‌ను ఎంచుకోవ‌డం చాలా ముఖ్యం. మీ పోర్ట్‌ఫోలియోలో అత్య‌వ‌స‌ర నిధికి, స్వ‌ల్ప‌కాలిక‌ ల‌క్ష్యాల‌కు కూడా కేటాయించాలి. మొత్తానికి పెట్టుబ‌డులు రిస్క్‌, రాబ‌డి, ఆర్థిక ల‌క్ష్యాల‌ను దృష్టిలో పెట్టుకొని ప్రారంభించాలి.

సిప్ పెట్టుబ‌డులు:

ఈక్విటీ పెట్టుబ‌డుల్లో ఐదేళ్ల కంటే ఎక్కువ పెట్టుబ‌డులు పెడితే అన్ని ఇత‌ర వాటికంటే మంచి లాభాల‌నిస్తాయ‌ని చెప్ప‌వ‌చ్చు. ఇందులో ఈఎల్ఎస్ఎస్‌లో పెట్టుబ‌డుల‌కు ప‌న్ను మిన‌హాయింపులు కూడా ల‌భిస్తాయి. మీరు కొత్త‌గా పెట్టుబ‌డులు ప్రారంభిస్తున్నా లేదా ఇదివ‌ర‌కే పెట్టుబ‌డులు పెట్టినా మార్కెట్ ప‌రిస్థితుల‌ను బ‌ట్టి రిస్క్ నుంచి త‌ప్పించుకునేందుకు సిప్ ప‌ద్ధితిలో ఈక్విటీల‌లో పెట్టుబ‌డులు చేయ‌డం తెలివైన ప‌ని. దీని ద్వారా పెట్టుబ‌డుల క్ర‌మ‌శిక్ష‌ణ అల‌వాటు కావ‌డంతో పాటు సంప‌ద‌ను సృష్టించుకోవ‌చ్చు.

అత్య‌వ‌స‌ర నిధి:

దీర్ఘ‌కాలిక‌ పెట్టుబ‌డుల‌తో ల‌క్ష్యాల కోసం పెట్టుబ‌డుల‌తో పాటు అత్య‌వ‌స‌ర నిధిని ఏర్ప‌రుచుకోవ‌డం కూడా చాలా ముఖ్యం. ఇవి నెల‌వారి ఖ‌ర్చులు ఆరు నెల‌ల‌కు స‌రిపోయేలా ఉండాలి. పెట్టుబ‌డులు, పోర్ట్‌ఫోలియోను స‌వరించేట‌ప్పుడు అత్య‌వ‌స‌ర నిధిని తీసుకోకూడదు. దీర్ఘ‌కాలిక‌ పెట్టుబ‌డుల‌కు తొంద‌ర‌పాటు ఉండ‌కూడ‌దు. మార్కెట్ ఒడుదొడుకులు, స్వ‌ల్ప‌కాలిక‌ ప‌రిణామాలు మీ పెట్టుబ‌డుల‌పై ఎలాంటి ప్ర‌భావం చూపించ‌వు. మార్కెట్లు న‌ష్ట‌పోగానే తొంద‌ర‌ప‌డి పెట్టుబ‌డులను ఉప‌సంహరించ‌కోవ‌డం చేయ‌కూడ‌దు. మీ పెట్టుబ‌డుల‌ను స‌మీక్షిస్తూ, ఫండ్ల తీరును గ‌మ‌నిస్తుండాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని