Gautam Adani: స్వార్థ ప్రయోజనాల కోసమే ఆ నివేదిక.. హిండెన్‌బర్గ్‌పై అదానీ

Gautam Adani Hindenburg claims: హిండెన్‌బర్గ్‌ నివేదికపై గౌతమ్‌ అదానీ విమర్శలు గుప్పించారు. సంస్థను అప్రతిష్ఠ పాల్జేసేందుకు తప్పుడు ఆరోపణలు చేసిందన్నారు.

Updated : 27 Jun 2023 15:54 IST

దిల్లీ: అదానీ గ్రూప్‌ (Adani group) సంస్థలపై అమెరికాకు చెందిన షార్ట్‌ సెల్లర్‌ సంస్థ హిండెన్‌బర్గ్‌ (Hindenburg) ఐదు నెలల కిందట వెలువరించిన నివేదిక సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మోసపూరిత లావాదేవీలు, స్టాక్‌ ధరల తారుమారు వంటి అవకతవకలకు అదానీ గ్రూప్‌ సంస్థలు పాల్పడ్డాయంటూ అందులో ఆ సంస్థ ఆరోపించింది. దీంతో అదానీ గ్రూప్‌ సంస్థల షేర్లు భారీగా పతనం అవ్వడమే కాకుండా రాజకీయంగానూ దుమారం రేగింది. ఈ నేపథ్యంలో హిండెన్‌బర్గ్‌ నివేదికపై గౌతమ్‌ అదానీ తాజాగా స్పందించారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం సంస్థ ప్రతిష్ఠను దెబ్బతీయడానికి తప్పుడు సమాచారాన్ని హిండెన్‌బర్గ్‌ వండివార్చిందని దుయ్యబట్టారు. ఈ మేరకు వాటాదారులకు ఇచ్చిన సందేశంలో పేర్కొన్నారు.

‘‘దేశంలోనే అతిపెద్ద ఫాలో ఆన్‌ పబ్లిక్‌ (FPO)కు వెళుతున్న వేళ అమెరికాకు చెందిన షార్ట్‌ సెల్లర్‌ సంస్థ నివేదిక వెలువరించింది. సంస్థను అప్రతిష్ఠ పాల్జేసేందుకు తప్పుడు, చౌకబారు ఆరోపణలు చేసింది. ఈ నివేదికతో అదానీ గ్రూప్‌ కంపెనీ స్టాక్‌ ధరలు ప్రభావితం అయ్యాయి. ఎఫ్‌పీఓను అర్ధంతరంగా ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. ఇన్వెస్టర్లకు సొమ్మును తిరిగిచ్చేశాం. షార్ట్‌ సెల్లర్‌ నివేదికతో కంపెనీ అనేక ప్రతికూల పరిణామాలూ ఎదుర్కోవాల్సి వచ్చింది’’ అని వార్షిక నివేదికలో అదానీ పేర్కొన్నారు.

‘‘అయితే, వ్యక్తిగత ప్రయోజనాల కోసం షార్ట్‌ సెల్లర్‌ చేసిన ఆరోపణలను కంపెనీ సమర్థంగా తిప్పికొట్టింది. సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీ సైతం.. గ్రూప్‌ కంపెనీలు ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని తేల్చింది. కమిటీ సమర్పించిన నివేదిక మదుపరుల్లో విశ్వాసం నింపడానికి దోహహదపడింది. కంపెనీ వెల్లడించిన వివరాల్లో గానీ, నియంత్రణ పరమైన లోపాలు గానీ లేవని వెల్లడించింది’’ అని అదానీ పేర్కొన్నారు. మరో నెల రోజుల్లో సెబీ నివేదికను సమర్పించబోతోందని, ఈ విషయంలోనూ పూర్తి విశ్వాసంతో ఉన్నామని పేర్కొన్నారు.

జనవరి 24న హిండెన్‌బర్గ్‌ నివేదిక వెలువడిన తర్వాత అదానీ గ్రూప్‌ కంపెనీలు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత కోలుకున్నప్పటికీ.. మునుపటి మార్కెట్‌ విలువను ఇప్పటికీ అందుకోలేకపోయాయి. తాజాగా అదానీ గ్రూప్‌లో భారీగా పెట్టుబడులు పెట్టిన అమెరికాకు చెందిన సంస్థాగత మదుపుదార్ల నుంచి ఆ దేశ నియంత్రణ సంస్థలు సమాచారాన్ని కోరాయన్న వార్తలతో గతవారం అదానీ గ్రూప్‌ స్టాక్స్‌ మరోసారి నష్టాలు చవిచూశాయి. ఈ విషయం తమ దృష్టికి రాలేదని అదానీ గ్రూప్‌ పేర్కొంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని