దీపావళికి పసిడి మెరుపులు

బంగారం-వెండి వంటి విలువైన లోహాల కొనుగోళ్లకు మంచిరోజుగా భావించే ధన త్రయోదశికి గిరాకీ బాగుంటుందనే ఆశాభావాన్ని విక్రయ సంస్థలు వ్యక్తం చేస్తున్నాయి. గతేడాది ఇదే సమయంలో విక్రయాలు బాగా జరిగాయి.

Updated : 20 Oct 2022 02:51 IST

ధర గతేడాది స్థాయిలోనే  
గిరాకీ ఆశావహం: విక్రయ సంస్థలు
జీవన వ్యయాలు పెరగడమే ఇబ్బందికరం
23న ధన త్రయోదశి

ముంబయి: బంగారం-వెండి వంటి విలువైన లోహాల కొనుగోళ్లకు మంచిరోజుగా భావించే ధన త్రయోదశికి గిరాకీ బాగుంటుందనే ఆశాభావాన్ని విక్రయ సంస్థలు వ్యక్తం చేస్తున్నాయి. గతేడాది ఇదే సమయంలో విక్రయాలు బాగా జరిగాయి. ధరలో కూడా పెద్ద మార్పు లేనందున, ఈసారి ఆ స్థాయిలోనే అమ్మకాలు జరుగుతాయని భావిస్తున్నారు. అయితే అధిక ద్రవ్యోల్బణం వల్ల జీవన వ్యయాలూ పెరగడం ఒక్కటే అవరోధమని పేర్కొంటున్నారు. 10 గ్రాముల ఆభరణాల పసిడి ధర రూ.47,000-49,000 మధ్య కదలాడుతోందని, వివాహాది శుభకార్యాలు ముందున్నందున, వినియోగదారు సెంటిమెంటు సానుకూలంగానే ఉంటుందని ఆశిస్తున్నారు.

గతేడాది ఎక్కువ అమ్మకాలు ఎందుకంటే..
కరోనా తొలి-రెండు దశల పరిణామాల వల్ల వాయిదా పడిన పెళ్లిళ్లు, 2021లో కార్యరూపం దాల్చడంతో, గతేడాది ధనత్రయోదశికి ఆభరణాల విక్రయాలు జోరుగా సాగాయి. నాటి అమ్మకాలు కరోనా ముందు స్థాయిని సైతం అధిగమించినట్లు అఖిల భారత రత్నాభరణాల దేశీయ మండలి ఛైర్మన్‌ ఆశిష్‌ పీతే పేర్కొన్నారు. ఈ ఏడాది కూడా బంగారం ధర పరంగా మార్పు లేకున్నా, అంతర్జాతీయ కారణాల వల్ల పెరిగిన జీవన వ్యయాలు, అకాల వర్షాలతో వ్యవసాయ కార్యకలాపాలపై ప్రభావం పడడం ఈసారి కొంత ఇబ్బంది కలిగిస్తోందని తెలిపారు.

 ధర తగ్గితే కొంటున్నారు
‘సాధారణంగా దసరా నుంచే ఆభరణాలకు ముందస్తు బుకింగ్‌ జరుగుతుంది. ఈ సారి ధరల్లో హెచ్చుతగ్గుల రీత్యా, ధర తగ్గిన వెంటనే నేరుగా వచ్చి కొనడం పెరిగింది. ఈ పండగల సెంటిమెంట్‌ వల్ల రిటైల్‌ వినియోగదార్లు కొనుగోళ్లకు తప్పనిసరిగా వస్తార’ని అంచనా వేస్తున్నట్లు ప్రపంచ స్వర్ణ మండలి ప్రాంతీయ సీఈఓ(భారత్‌) సోమసుందరమ్‌ పీఆర్‌ పేర్కొన్నారు. రాబోయే వారాల్లో పసిడి ధరలు ఇంకా తగ్గితే.. ద్రవ్యోల్బణానికి హెడ్జింగ్‌గా ఈ లోహాన్ని కొనుగోలు చేసే అవకాశాలున్నాయని వివరించారు. ‘గతేడాదితో పోలిస్తే విక్రయాల్లో వృద్ధి ఒక అంకె లేదా రెండంకెల్లో తక్కువ స్థాయి వృద్ధికి పరిమతం కావొచ్చు. ఒక్కొక్కరు కొనుగోలు చేసే పరిమాణం తక్కువగానే ఉండొచ్చు. కానీ ఎక్కువ మంది కొనుగోళ్లు చేయడం వల్ల ఆ ప్రభావం కనిపించకపోవచ్చు’ అని సోమసుందరమ్‌ అంచనా వేశారు.

వారాంతం కలిసొస్తుంది!
ఈసారి ధన త్రయోదశి వారాంతంలో రావడం వల్ల అమ్మకాలకు కలిసిరావొచ్చని అంటున్నారు. సంపన్నులతో పాటు అధికాదాయాన్ని ఆర్జించే రంగాలు, ఉన్నతోద్యోగులు కూడా కచ్చితంగా కొనుగోళ్లకు వస్తారనే అంచనాను విక్రయ సంస్థలు వ్యక్తం చేస్తున్నాయి.  

అంతర్జాతీయంగా ఇదీ ధోరణి
అమెరికాలో మిడ్‌టర్మ్‌ ఎన్నికలున్నందున.. పసిడి మళ్లీ భద్రమైన పెట్టుబడిగా మారొచ్చొని కామ్‌ట్రెండ్జ్‌ డైరెక్టర్‌ జ్ఞాన శేఖర్‌ త్యాగరాజన్‌ అంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్సు (31.10 గ్రాముల) ధర 1545-1550 డాలర్లకు తగ్గొచ్చని అంచనా వేశారు. దేశీయంగా కమొడిటీ ఎక్స్ఛేంజీ ఎమ్‌సీఎక్స్‌లో 10 గ్రాముల ధర రూ.48,000 వరకు రావొచ్చన్నారు. దీనికి జీఎస్‌టీ ఛార్జీలు కలిపితే, ఆభరణాల విక్రయశాలల ధర వస్తుంది. వినియోగదార్లు పెద్ద దుకాణాలు/సంస్థాగత విక్రేతల వైపు చూస్తున్నందున, ఈ ధనత్రయోదశిలో ఆభరణ విక్రయ కంపెనీలు ప్రయోజనం పొందుతాయని కల్యాణ్‌ జువెలర్స్‌ ఇండియా ఈడీ రమేశ్‌ కల్యాణరామన్‌ అభిప్రాయపడ్డారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 20% మేర వృద్ధి కనిపించొచ్చని పీఎన్‌జీ జువెలర్స్‌ సీఎండీ సౌరభ్‌ గాడ్గిల్‌ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని