గృహ, వాహన రుణాలు మరింత ప్రియం

రుణాలపై వడ్డీరేట్లు పెరగనున్నాయి. ఫలితంగా ఇల్లు, వాహన కొనుగోలు కోసం కొత్తగా రుణాలు తీసుకునే వారితో పాటు, ఇప్పటికే తీసుకున్న వారు కూడా నెలవారీ వాయిదా కింద ప్రస్తుతం కంటే ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వస్తుంది.

Updated : 09 Feb 2023 07:27 IST

నెలవారీ వాయిదాలు భారం
రెపోరేటు 0.25% పెంచిన ఆర్‌బీఐ
మరిన్ని పెంపులుంటాయని సంకేతాలు
వచ్చే ఏడాది జీడీపీ అంచనా 6.4%
విదేశీయులకూ యూపీఐ అందుబాటులోకి

రిటైల్‌ ద్రవ్యోల్బణాన్ని  తగ్గించేందుకే గట్టిగా కట్టుబడి ఉన్నాం. కరోనాకు ముందుతో పోలిస్తే విధాన రేట్లు ఇంకా తక్కువగానే ఉన్నాయి. వ్యవస్థలో ద్రవ్యలభ్యతకు ఇబ్బంది లేదు. అంతర్జాతీయ కమొడిటీ ధరల్లో అనిశ్చితులు కనిపిస్తున్నా.. భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది. రబీ సీజనులో భారీ దిగుబడుల వల్ల ఆహార ధరలు తగ్గే అవకాశం ఉంది.

ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌

ముంబయి: రుణాలపై వడ్డీరేట్లు పెరగనున్నాయి. ఫలితంగా ఇల్లు, వాహన కొనుగోలు కోసం కొత్తగా రుణాలు తీసుకునే వారితో పాటు, ఇప్పటికే తీసుకున్న వారు కూడా నెలవారీ వాయిదా కింద ప్రస్తుతం కంటే ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వస్తుంది. తాజా సమీక్షలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) రెపోరేటును మరో 0.25% పెంచడం ఇందుకు నేపథ్యం. 2022 మే నుంచి ఇప్పటిదాకా రెపోరేటును 6 విడతలలో 2.5 శాతం (250 బేసిస్‌ పాయింట్లు) పెంచినట్లయ్యింది. బుధవారం ముగిసిన పరపతి విధాన కమిటీ (ఎమ్‌పీసీ) సమావేశంలో, రెపో రేటు (బ్యాంకులకు ఇచ్చే నిధులకు ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీ రేటు)ను 6.25 శాతం నుంచి 6.5 శాతానికి చేర్చాలని 4-2 ఓటింగ్‌తో నిర్ణయం తీసుకున్నారు. ద్రవ్యోల్బణం ఇంకా అధికంగానే ఉన్నందున, భవిష్యత్తులోనూ రేట్ల పెంపులు ఉంటాయన్న సంకేతాలను ఆర్‌బీఐ ఇచ్చింది.

వృద్ధి రేటు-ద్రవ్యోల్బణ అంచనాలివీ..: ఏప్రిల్‌ 1 నుంచి మొదలయ్యే వచ్చే ఆర్థిక సంవత్సరం (2023-24)లో జీడీపీ వృద్ధి 6.4 శాతంగా నమోదుకావొచ్చని ఆర్‌బీఐ అంచనా వేసింది. (ఆర్థిక సర్వే అంచనా 6.5% కావడం గమనార్హం.)  ప్రస్తుత ఆర్థిక సంవత్సర వృద్ధిరేటు అంచనా 7 శాతంతో పోలిస్తే ఇది తక్కువే. అంతర్జాతీయ వృద్ధి వాతావరణం కాస్తంతే మెరుగైందని ఆర్‌బీఐ అభిప్రాయపడింది. ‘కొద్ది నెలల కిందటితో పోలిస్తే ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో వృద్ధి అంచనాలు మెరుగైనా, ద్రవ్యోల్బణం ఇంకా అధిక స్థాయుల్లోనే ఉంద’ని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వినియోగదారు ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణ అంచనాలను  6.8% నుంచి 6.5 శాతానికి ఆర్‌బీఐ తగ్గించింది. రిటైల్‌ ద్రవ్యోల్బణం వచ్చే ఆర్థిక సంవత్సరంలో 5.3 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది.

ప్రభుత్వ సెక్యూరిటీలపై కీలక నిర్ణయం: ప్రభుత్వ సెక్యూరిటీలను అప్పుగా ఇవ్వడానికి, తీసుకోవడానికి (లెండింగ్‌/బారోయింగ్‌) అనుమతి ఇచ్చింది. తద్వారా పెట్టుబడిదార్లు తమ వద్ద ఉన్న సెక్యూరిటీలపై ప్రతిఫలాలను పెంచుకోవచ్చని పేర్కొంది. ‘ఈ చర్యల వల్ల ప్రభుత్వ బాండ్ల మార్కెట్‌ విస్తృతి, ద్రవ్యలభ్యత పెరుగుతుంది. ధరలకు మద్దతు లభిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్కెట్‌ రుణ పథకాలు సులువుగా పూర్తి కాగలవ’ని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ పేర్కొన్నారు. ప్రభుత్వ సెక్యూరిటీల మార్కెట్‌ సమయాన్ని కరోనాకు ముందున్నట్లుగా, ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సవరించింది.

మన రూపాయి.. బలంగానే..: ఆసియాలోనే అతి తక్కువ ఊగిసలాటలున్న కరెన్సీగా రూపాయి కొనసాగుతోందని దాస్‌ అన్నారు. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం, ఇతరత్రా సంక్షోభాల సమయంలోని హెచ్చుతగ్గులతో పోలిస్తే ప్రస్తుత  ఊగిసలాటలు చాలా తక్కువేనన్నారు.

ఎన్‌బీఎఫ్‌సీలతో కలిసి పనిచేస్తున్న యాప్‌ల జాబితాను ప్రభుత్వానికి ఇచ్చామని.. దీని ఆధారంగా ప్రభుత్వం ఇతర యాప్‌లపై నిషేధం విధించిందని దాస్‌ తెలిపారు.

డిజిటల్‌ రూపాయి: ఇటీవల ఆవిష్కరించిన ఇ-రూపాయి (సీబీడీసీ) పైలట్‌ ప్రాజెక్టును 50,000 మంది వినియోగదార్లు, 5,000 మంది వ్యాపారులు వినియోగిస్తున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. రిటైల్‌ వినియోగదార్ల కోసం  ఇ-రూపాయి జారీకి మరో 5 బ్యాంకులు, ఇంకో 9 నగరాల్లో జత చేరాయి.

దేశీయ మ్యూచువల్‌ ఫండ్‌లలో విదేశీ పెట్టుబడుల పరిమితిని పెంచే ప్రతిపాదనేదీ లేదని స్పష్టం చేశారు.

సూక్ష్మ, చిన్న, మధ్య కంపెనీ(ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ)లకు మరిన్ని రుణాలిచ్చే దిశగా చర్యలు తీసుకోనున్నారు.

తగిన సమయంలో నెలవారీ వాయిదాలను చెల్లించకపోతే విధించే అపరాధ రుసుములపై ముసాయిదా మార్గదర్శకాలను ఆర్‌బీఐ త్వరలోనే జారీ చేయనుంది. హరిత డిపాజిట్లను అంగీకరించడంపైనా మార్గదర్శకాలను జారీ చేయనుంది. 

2023-24లో తొలి పరపతి విధాన సమావేశం ఏప్రిల్‌ 3-6 తేదీల్లో జరగనుంది.


బ్యాంకులు పెంచేశాయ్‌

ర్‌బీఐ ప్రకటన వెంటనే, రెపో ఆధారిత రుణ వడ్డీ రేట్లను (ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌) పెంచుతున్నట్లు పలు బ్యాంకులు బుధవారమే వెల్లడించాయి.

బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వడ్డీరేటును 9.35 శాతానికి పెంచాయి.

ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ వడ్డీ రేటు 11.60 శాతానికి చేరింది. నీ ఇండియన్‌ బ్యాంక్‌ ప్రామాణిక రెపో రేటును 6.25 శాతం నుంచి 6.50 శాతానికి పెంచింది. నీ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ రెపో ఆధారిత వడ్డీ రేటును 9.00 శాతానికి చేర్చింది.


క్యూఆర్‌ కోడ్‌ ఆధారిత నాణేల వెండింగ్‌ మెషీన్‌లు

ముంబయి: చిల్లర నాణేలకు అధికంగా డిమాండు ఉండే కూరగాయల మార్కెట్ల సమీపంలో నాణేల వెండింగ్‌ మెషీన్‌లను ఆర్‌బీఐ ఏర్పాటు చేస్తోంది. అయితే నాణేల కోసం జమచేస్తున్న వాటిలో నకిలీ నోట్లు ఉంటున్నందున, ప్రత్యామ్నాయంగా యూపీఐ ఆధారిత వెండింగ్‌ మెషీన్‌లను ఏర్పాటు చేయనున్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా డిప్యూటీ గవర్నరు టి.రవి శంకర్‌ తెలిపారు. కరెన్సీ నోట్లకు బదులుగా యూపీఐకి అనుసంధానమైన క్యూఆర్‌ కోడ్‌ ఉపయోగించి నాణేలను పొందాల్సి ఉంటుంది. నేరుగా వినియోగదారుడి బ్యాంక్‌ ఖాతా నుంచి నగదు విత్‌డ్రా అయి, అతనికి నాణేలు అందుతాయి. ఇప్పటికే ప్రయోగాత్మక ప్రాజెక్టును ప్రారంభించామని వెల్లడించారు. ప్రజలు తమకు కావాల్సిన సంఖ్యలో, డినామినేషన్‌లో నాణేలను ఈ మెషీన్‌ ద్వారా తీసుకోవచ్చ’ని ఆర్‌బీఐ గవర్నర్‌ తెలిపారు. తొలుత దేశవ్యాప్తంగా 12 నగరాల్లో రైల్వే స్టేషన్లు, షాపింగ్‌ మాల్‌లు, మార్కెట్ల సమీపంలో 19 ప్రాంతాల్లో క్యూఆర్‌ కోడ్‌ ఆధారిత వెండింగ్‌ మెషీన్‌లను ప్రయోగాత్మక పద్ధతిలో ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వివరించారు.


‘అదానీ గ్రూప్‌ రుణాల ప్రభావం బ్యాంకులపై ఉండదు’

దానీ గ్రూప్‌నకు దేశీయ బ్యాంకులు ఇచ్చిన రుణాలు ‘మరీ ఎక్కువగా లేవ’ని ఆర్‌బీఐ పేర్కొంది. మన బ్యాంకింగ్‌ వ్యవస్థ చాలా బలంగా, భారీగా ఉందని.. అది కేవలం ‘ఒక సందర్భం’ వల్ల ప్రభావితం కాజాలదని పేర్కొంది. ఆయా కార్పొరేట్ల ఆస్తులు, నగదు, ప్రాజెక్టుల ఆధారంగానే దేశీయ బ్యాంకులు రుణాలిస్తున్నాయి కానీ, వాటి మార్కెట్‌ విలువ పరంగా కాదని డిప్యూటీ గవర్నర్‌ ఎమ్‌.కె. జైన్‌ పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు