50 మంది ఎగవేతలే రూ.87,295 కోట్లు

గీతాంజలి జెమ్స్‌, ఎరా ఇన్‌ఫ్రా ఇంజినీరింగ్‌, ఆర్‌ఈఐ గ్రో, ఏబీజీ షిప్‌యార్డ్‌ తదితర అగ్రగామి 50 మంది ఉద్దేశపూర్వక ఎగవేతదార్లు.. బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు రూ.87,295 కోట్లు కట్టాల్సి ఉందని రాజ్యసభకు ఆర్థిక సహాయ మంత్రి భగవత్‌ కరాడ్‌ రాతపూర్వకంగా తెలిపారు.

Published : 02 Aug 2023 04:57 IST

తొలి 10 సంస్థలవి రూ.40,825 కోట్లు
అయిదేళ్లలో రూ.10 లక్షల కోట్ల రైటాఫ్‌లు
రాజ్యసభలో ఆర్థికశాఖ సహాయ మంత్రి

దిల్లీ: గీతాంజలి జెమ్స్‌, ఎరా ఇన్‌ఫ్రా ఇంజినీరింగ్‌, ఆర్‌ఈఐ గ్రో, ఏబీజీ షిప్‌యార్డ్‌ తదితర అగ్రగామి 50 మంది ఉద్దేశపూర్వక ఎగవేతదార్లు.. బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు రూ.87,295 కోట్లు కట్టాల్సి ఉందని రాజ్యసభకు ఆర్థిక సహాయ మంత్రి భగవత్‌ కరాడ్‌ రాతపూర్వకంగా తెలిపారు. ఇందులో అగ్రగామి 10 సంస్థలవే రూ.40,825 కోట్లు కావడం గమనార్హం. గత అయిదేళ్లలో షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ బ్యాంకు(ఎస్‌సీబీ)లు రూ.10,57,326 కోట్ల మేర రైటాఫ్‌ చేశాయని ఆయన తెలిపారు. మెహుల్‌ చోక్సికి చెందిన గీతాంజలి జెమ్స్‌ అత్యధికంగా రూ.8,738 కోట్ల రుణాలను బ్యాంకులకు ఎగవేసింది. బ్యాంకులు తమ విచక్షణ ఉపయోగించి సెటిల్‌మెంట్‌లు చేసుకోవడానికి వీలుంటుందని.. అయితే అది రుణస్వీకర్త హక్కు మాత్రం కాదని ఆయన అన్నారు.

  • 2023 మార్చి చివరకు కేంద్ర ప్రభుత్వ రుణాలు రూ.155.6 లక్షల కోట్లుగా నిలిచాయి. జీడీలో ఇవి 57.1 శాతానికి సమానం. 2020-21న జీడీపీలో 61.5 శాతంగా రుణాలు ఉండేవని ఆర్థిక సహాయ మంత్రి పంకజ్‌ చౌధరి రాజ్యసభకిచ్చిన రాతపూర్వక సమాధానంలో వెల్లడించారు. 2022-23 చివరకు రాష్ట్ర ప్రభుత్వాల రుణాలు జీడీపీలో 28 శాతంగా ఉన్నాయి.
  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జులై 31 నాటికి ప్రభుత్వం డేటెడ్‌ సెక్యూరిటీలను జారీ చేయడం ద్వారా రూ.5.77 లక్షల కోట్ల రుణాలను సమీకరించిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్‌ రాజ్యసభకు తెలిపారు. 2023-24లో వివిధ వనరుల ద్వారా రూ.17.99 లక్షల కోట్లను సమీకరించాలని అనుకుంటున్నట్లు తెలిపారు. ఇది కేంద్ర బడ్జెట్‌(2023-24) రూ.45.03 లక్షల కోట్లలో 40 శాతానికి సమానం.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని