ప్రపంచంలోనే తొలి ఫ్లెక్స్‌ఫ్యూయల్‌ కారు.. ఆవిష్కరించిన కేంద్రమంత్రి గడ్కరీ

దేశంలో ఇథనాల్‌కు గిరాకీ పెరుగుతుందని, ఈ పరిణామం వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలో మార్పునకు దోహదం చేస్తుందని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు.

Updated : 30 Aug 2023 08:21 IST

ఇథనాల్‌ గిరాకీతో ఇంధనదాతగా రైతన్నలు!

దిల్లీ: దేశంలో ఇథనాల్‌కు గిరాకీ పెరుగుతుందని, ఈ పరిణామం వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలో మార్పునకు దోహదం చేస్తుందని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. తద్వారా మన రైతులు కేవలం ‘అన్నదాత’గానే కాదు ‘ఇంధనదాత’గానూ అవుతారని పేర్కొన్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటి బీఎస్‌-6 (స్టేజ్‌ 2) ఎలక్ట్రిఫైడ్‌ ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ ఆధారిత కారును మంగళవారం ఆయన ఆవిష్కరించారు. పెట్రోల్‌లో ఇథనాల్‌ను కలపడాన్ని ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ సాంకేతికతగా వ్యవహరిస్తారు. ఎలక్ట్రిఫైడ్‌ ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ వాహన నమూనాను ఇన్నోవా హైక్రాస్‌ మోడల్‌పై టయోటా కిర్లోస్కర్‌ అభివృద్ధి చేసింది. భారత్‌లోని అత్యుత్తమ ఉద్గార ప్రమాణాలకు తగ్గట్లుగా దీనిని రూపొందించింది. 20 శాతానికి మించి కలిపిన ఇథనాల్‌తోనూ ఈ కారు నడవగలదు. ‘ఈ సాంకేతికతను అభివృద్ధి చేసినందుకు గాను టయోటా కిర్లోస్కర్‌ యాజమాన్యానికి ధన్యవాదాలు. దేశంలో కాలుష్యం తగ్గేందుకు కాదు.. వ్యవసాయ రంగంలో ఉద్యోగావకాశాల సృష్టికి ఇది దోహదం చేస్తుంది. ఫ్లెక్స్‌ ఇంజిన్‌లపై మరిన్ని మోడళ్లను తయారు చేయాలని కోరుతున్నాం. మోటార్‌ సైకిళ్లు, ఆటోలు, ఇ-రిక్షాలు, కార్లు 100% ఇథనాల్‌ వాహనాలుగా మారాలని నేను కోరుకుంటున్నాన’ని గడ్కరీ తెలిపారు. ఇథనాల్‌కు గిరాకీ పెరిగితే.. జీడీపీలో వ్యవసాయ రంగ వాటా 20 శాతానికి పెరుగుతుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని