కొవిడ్‌ కల్లోలం

శుక్రవారం మదుపర్లకు శోకవారమే అయ్యింది. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా వైరస్‌ కొత్త వేరియంట్‌ భయాలు మదుపర్ల వెన్నులో వణుకు పుట్టించాయి. అంతర్జాతీయ మార్కెట్లతో పాటు దేశీయ సూచీలనూ కకావికలం చేశాయి....

Updated : 27 Nov 2021 04:56 IST

కొత్త వేరియంట్‌ భయాలతో మార్కెట్‌ పతనం

సెన్సెక్స్‌కు 1688 పాయింట్ల నష్టం

510 పాయింట్లు క్షీణించిన నిఫ్టీ

రూ.7.35 లక్షల కోట్ల మేర మదుపర్ల సంపద ఆవిరి

శుక్రవారం మదుపర్లకు శోకవారమే అయ్యింది. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా వైరస్‌ కొత్త వేరియంట్‌ భయాలు మదుపర్ల వెన్నులో వణుకు పుట్టించాయి. అంతర్జాతీయ మార్కెట్లతో పాటు దేశీయ సూచీలనూ కకావికలం చేశాయి. కొత్త వేరియంట్‌ ప్రస్తుత వ్యాక్సిన్‌లకు లొంగకపోవచ్చన్న వార్తలు, బ్రిటన్‌, జపాన్‌ వంటి దేశాల్లో ప్రయాణాలపై తాజా ఆంక్షలు సెంటిమెంటును కుంగదీశాయి. విదేశీ మదుపర్ల అమ్మకాలు కొనసాగడమూ దెబ్బతీసింది. కరెన్సీ మార్కెట్‌ కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. డాలర్‌తో పోలిస్తే రూపాయి 37 పైసలు కోల్పోయి 74.15 వద్ద ముగిసింది.

నష్టాల ట్రేడింగ్‌ సాగిందిలా..
సెన్సెక్స్‌ ఉదయం 58254.79 పాయింట్ల వద్ద నష్టాల్లోనే ప్రారంభమై, అదేబాటలో సాగింది. మధ్యాహ్నం తర్వాత అమ్మకాల సెగ మరింత తీవ్రమవ్వడంతో 56,993.89 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని తాకిన సూచీ, చివరకు 1687.94 పాయింట్లు కుప్పకూలి 57,107.15 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 509.80 పాయింట్లు పతనమై 17,026.45 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 16,985.70 దగ్గర కనిష్ఠాన్ని నమోదుచేసింది. వారం ప్రాతిపదికన చూస్తే.. సెన్సెక్స్‌ 2528.86 పాయింట్లు, నిఫ్టీ 738.35 పాయింట్లు చొప్పున నష్టపోయాయి.

ఏ షేర్లు ఎలా పడ్డాయంటే..
సెన్సెక్స్‌ 30 షేర్లలో 4 కంపెనీల షేర్లు మినహా మిగిలినవన్నీ నష్టాలను చవిచూశాయి. అత్యధికంగా ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 6.01 శాతం వరకు పతనమైంది. మారుతీ, టాటా స్టీల్‌, ఎన్‌టీపీసీ, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, టైటన్‌, ఎం అండ్‌ ఎం, ఎస్‌బీఐ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఎల్‌ అండ్‌ టీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, కోటక్‌ బ్యాంక్‌, రిలయన్స్‌, ఐటీసీ 5- 3 శాతం వరకు క్షీణించాయి.

* డాక్టర్‌ రెడ్డీస్‌, నెస్లే, ఏషియన్‌ పెయింట్స్‌, టీసీఎస్‌ షేర్లు మాత్రం లాభాల్లో ముగిశాయి.

* రంగాల వారీగా చూస్తే స్థిరాస్తి సూచీ అత్యధికంగా 6.42 శాతం కుదేలైంది. లోహ, వాహన, పరిశ్రమలు అదే బాటలో నడవగా, ఆరోగ్య సంరక్షణ రాణించింది.

* బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు 3.23 శాతం వరకు పడ్డాయి.

* బీఎస్‌ఈలో 2290 షేర్లు నష్టపోగా, 1023 లాభపడ్డాయి. 102 షేర్లలో మార్పులేదు.

నెలరోజుల్లో రూ.16 లక్షల కోట్లు కరిగిపోయాయ్‌
సూచీల క్షీణత నేపథ్యంలో మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ శుక్రవారం రూ.7.35 లక్షల కోట్లు ఆవిరై రూ.258.31 లక్షల కోట్లకు పడిపోయింది. అక్టోబరు 19న ఈ విలువ జీవనకాల గరిష్ఠమైన రూ.274.69 లక్షల కోట్లుగా ఉంది. అనంతరం రికార్డు గరిష్ఠాల నుంచి సెన్సెక్స్‌, నిఫ్టీ 8 శాతం చొప్పున క్షీణించగా.. మదుపర్ల సంపద ఏకంగా రూ.16 లక్షల కోట్ల మేర కరిగిపోయింది.


మదుపర్ల అమ్మకాలకు కారణాలు

* దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కొవిడ్‌ కొత్త వేరియంట్‌ అత్యంత వేగంగా విస్తరిస్తోందని, ప్రస్తుత వ్యాక్సిన్లు దీనిపై పనిచేయడం లేదనే వార్తలు తీవ్ర ఆందోళన కలిగించాయి. ఐరోపా దేశాల్లో కొవిడ్‌ కేసులు విజృంభించడం భయాలకు కారణమైంది.

* ఆసియా మార్కెట్లలో జపాన్‌ నిక్కీ 747 పాయింట్లు, హాంకాంగ్‌ 659 పాయింట్లు, కోస్పి 44 పాయింట్లు, షాంఘై 20 పాయింట్ల చొప్పున పడ్డాయి.

* గిరాకీ తగ్గుతుందనే అంచనాలతో చమురు ధరలు తగ్గాయి. 80 డాలర్లకు దిగువకు చేరిన బ్యారెల్‌ ముడిచమురు.. ప్రస్తుతం 77 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

* దేశీయంగా చూస్తే నిఫ్టీలో అత్యధిక వెయిటేజీ ఉన్న ఫైనాన్స్‌ షేర్లకు అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. లోహ షేర్లు సైతం కుదేలయ్యాయి.

* కొవిడ్‌ భయాలు, డాలర్‌ బలోపేతం కావడంతో విదేశీ మదుపర్ల అమ్మకాలు కొనసాగాయి. ఈ నెలలో ఇప్పటి వరకు రూ.25,000 కోట్ల పైగా పెట్టుబడులు వెనక్కి మళ్లాయి. గత నాలుగు సెషన్లలోనే రూ.15000 కోట్ల అమ్మకాలు జరిగాయి.


మెరిసిన టార్సన్స్‌ ప్రోడక్ట్స్‌

లైఫ్‌ సెన్సెస్‌ కంపెనీ టార్సన్స్‌ ప్రోడక్ట్స్‌ షేర్లు మాత్రం శుభారంభం చేశాయి. ఇష్యూ ధర రూ.662తో పోలిస్తే బీఎస్‌ఈలో 5.74 శాతం లాభంతో రూ.700 వద్ద షేరు నమోదైంది. చివరకు 26.88 శాతం పరుగులు తీసి రూ.840 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.4469.33 కోట్లుగా నమోదైంది.


ఈ ఏడాదిలో 3వ అతిపెద్ద పతనం

2021లో సెన్సెక్స్‌కు ఏర్పడిన ఒక రోజు నష్టాల్లో శుక్రవారం నాటిది మూడో అతిపెద్దది. ఫిబ్రవరి 26న 1939.32 పాయింట్లు, ఏప్రిల్‌ 12న  1707.98 పాయింట్ల చొప్పున సెన్సెక్స్‌ పతనమైంది. ఈ ఏడాది అక్టోబరు 19న సెన్సెక్స్‌ 62,245 పాయింట్లు, నిఫ్టీ 18,604 పాయింట్ల వద్ద జీవనకాల గరిష్ఠాలను చేరాయి. అక్కడ నుంచి పలు అంతర్జాతీయ కారణాలు, మదుపర్ల లాభాల స్వీకరణతో దిద్దుబాటుకు గురవుతున్నాయి. కొవిడ్‌ కొత్త వేరియంట్‌ తాజా పతనానికి కారణమైంది.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని