PAN Aadhaar: పాన్‌ ఆధార్‌ అనుసంధానానికి నేడే చివరి రోజు

ఆధార్‌తో శాశ్వత ఖాతా సంఖ్య (పాన్‌)ను అనుసంధానం చేశారా.. లేకపోతే ఆ పని ఈ రోజే పూర్తి చేయండి. ఆదాయపు పన్ను చట్టం -1961 ప్రకారం పాన్‌ పొందిన ప్రతి వ్యక్తీ, తన విశిష్ఠ గుర్తింపు సంఖ్య (ఆధార్‌)తో దాన్ని అనుసంధానాన్ని 2022 మార్చి 31 కల్లా పూర్తి చేయాలి.

Updated : 31 Mar 2022 08:53 IST

రూ.500 జరిమానాతో జూన్‌ 30 వరకు వీలు
తదుపరి రూ.1,000 జరిమానా

ఈనాడు, హైదరాబాద్‌: ఆధార్‌తో శాశ్వత ఖాతా సంఖ్య (పాన్‌)ను అనుసంధానం చేశారా.. లేకపోతే ఆ పని ఈ రోజే పూర్తి చేయండి. ఆదాయపు పన్ను చట్టం -1961 ప్రకారం పాన్‌ పొందిన ప్రతి వ్యక్తీ, తన విశిష్ఠ గుర్తింపు సంఖ్య (ఆధార్‌)తో దాన్ని అనుసంధానాన్ని 2022 మార్చి 31 కల్లా పూర్తి చేయాలి. రూ.500 జరిమానాతో 2022 జూన్‌ 30 వరకు అవకాశం ఇస్తామని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఒక ప్రకటనలో వెల్లడించింది. ఆ తర్వాత 2023 మార్చి 31 వరకు రూ.1,000 జరిమానాతో చేసుకోవచ్చు. తదుపరి మాత్రం ఆధార్‌తో అనుసంధానించని పాన్‌ పనిచేయదు. ఫలితంగా పాన్‌ పేర్కొనాల్సిన లావాదేవీలు చేయడం సాధ్యం కాదు. బ్యాంకు ఖాతా, డీమ్యాట్‌ ఖాతా తెరవడానికి వీలుపడదు. ఇప్పటికే డీమ్యాట్‌ ఖాతా ఉన్నా, షేర్లలో మదుపు చేయడం సాధ్యం కాదు. మ్యూచువల్‌ ఫండ్లలోనూ పెట్టుబడులు పెట్టలేరు. ఒక్కమాటలో చెప్పాలంటే.. పాన్‌ వివరాలు తెలియజేయాల్సిన ఆర్థిక వ్యవహారాలన్నీ నిలిచిపోతాయి. మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్‌) విధించాల్సిన చోట అధిక మొత్తంలో పన్ను చెల్లించాల్సి ఉంటుంది. 2022 జనవరి 24 వరకు 43.34 కోట్ల పాన్‌-ఆధార్‌ వివరాలు జతయ్యాయి.

ఎలా చేసుకోవాలి?: ఆదాయపు పన్ను వెబ్‌సైట్‌ ‌www.incometax.gov.inకి వెళ్లి, అక్కడ లింక్‌ అధార్‌ను క్లిక్‌ చేస్తే.. పాన్‌, ఆధార్‌ సంఖ్య, ఆధార్‌ ప్రకారం పేరు, మొబైల్‌ నెంబరును పేర్కొనడం ద్వారా ఆధార్‌-పాన్‌ అనుసంధానం పూర్తి చేయొచ్చు. ఇంటర్నెట్‌ లేని ఫోన్‌ ద్వారా అయితే,  అని టైప్‌ చేసి, ఆధార్‌ నెంబరు, పాన్‌ నమోదు చేసి, 567678కి సందేశం పంపించాల్సి ఉంటుంది. వీలైనంత వరకు ఆదాయపు పన్ను అధికారిక వెబ్‌సైటులో ఈ ప్రక్రియ పూర్తి చేయడమే మంచిది. ఈ రెండింటి అనుసంధానం పూర్తయ్యిందీ లేనిదీ ఆదాయపు పన్ను వెబ్‌సైటులోనే ‘లింక్‌ ఆధార్‌ స్టేటస్‌’ను క్లిక్‌ చేసి, పాన్‌, ఆధార్‌ సంఖ్యను పేర్కొనడం ద్వారా తెలుసుకునే వీలుంటుంది.

రెండు పాన్‌లు ఉంటే..: కొంతమంది ఏదేని కారణంతో రెండు పాన్‌ కార్డులు తీసుకుంటే.. అందులో ఒకటి మాత్రమే ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలి. కాబట్టి, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు ఇప్పటికే బ్యాంకు ఖాతా, డీమ్యాట్‌ ఖాతా, ఇతర లావాదేవీలకు ఉపయోగించిన పాన్‌నే ఆధార్‌కు జత చేయాలి.

కుదరకపోతే..: ఆధార్‌, పాన్‌ కార్డుల్లో వివరాలు ఒకే విధంగా లేకపోతే.. ఈ రెండింటినీ జత చేయడం కుదరదు. ఇలాంటప్పుడు ఆధార్‌లో తప్పు దొర్లిందా, పాన్‌లో తప్పుందా చూసుకోండి. ఎక్కువగా పేరు, పుట్టిన తేదీ వివరాల్లో ఈ పొరపాట్లు ఉంటాయి. కాబట్టి, వీటిని సరిచేసుకున్నాకే అనుసంధానం పూర్తవుతుంది.

రిటర్నుల దాఖలుకూ..
గత ఆర్థిక సంవత్సరం 2020-21కి సంబంధించి (అసెస్‌మెంట్‌ ఇయర్‌ 2021-22) రిటర్నులు దాఖలు చేయడానికి అపరాధ రుసుముతో ఈ రోజే చివరి అవకాశం. ఇప్పటికే రిటర్నులు దాఖలు చేసిన వారు.. ‘రివైజ్డ్‌’ రిటర్నులు వేసేందుకూ నేటితో గడువు ముగియనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని