ఫండ్‌ మేనేజర్‌ వీరేశ్‌ జోషీకి యాక్సిస్‌ ఏఎంసీ ఉద్వాసన

యాక్సిస్‌ బ్యాంక్‌ మ్యూచువల్‌ ఫండ్‌ విభాగమైన యాక్సిస్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ, తన ఫండ్‌ మేనేజర్, చీఫ్‌ ట్రేడర్‌ వీరేశ్‌ జోషీని తొలగించింది. ఫ్రంట్‌ రన్నింగ్‌ ఆరోపణలపై విచారణ జరిపి

Published : 20 May 2022 02:48 IST

దిల్లీ: యాక్సిస్‌ బ్యాంక్‌ మ్యూచువల్‌ ఫండ్‌ విభాగమైన యాక్సిస్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ, తన ఫండ్‌ మేనేజర్, చీఫ్‌ ట్రేడర్‌ వీరేశ్‌ జోషీని తొలగించింది. ఫ్రంట్‌ రన్నింగ్‌ ఆరోపణలపై విచారణ జరిపి ఈ నిర్ణయం తీసుకుంది. ఒక బ్రోకరు లేదా అనలిస్ట్‌ నుంచి అంతర్గత సమాచారాన్ని పొంది, ఖాతాదార్ల కంటే ముందే స్టాక్‌ మార్కెట్లో ట్రేడ్‌ చేయడం వంటి తప్పుడు కార్యకలాపాలకు పాల్పడటాన్ని ఫ్రంట్‌ రన్నింగ్‌గా వ్యవహరిస్తారు. ఈ నెల ప్రారంభంలోనే జోషి సహా ఇద్దరు ఫండ్‌ మేనేజర్లను యాక్సిస్‌ ఏఎంసీ సస్పెండ్‌ చేసింది. ‘2022 ఫిబ్రవరి నుంచి యాక్సిస్‌ ఏఎంసీ సుమోటోగా అంతర్గత దర్యాప్తు నిర్వహిస్తోంది. ఈ దర్యాప్తులో సహకారం కోసం బయటి సలహాదారులను ఉపయోగించుకుంటున్నాం. దర్యాప్తును అనుసరించి  2022 మే 17 నుంచి వీరేశ్‌ జోషీకి ఉద్వాసన పలికామ’ని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. దీని ప్రకారం యాక్సిస్‌ ఏఎంసీకి ఆయన ఇకపై కీలక వ్యక్తిగా ఉండబోరని ఏర్కొంది. ఆయన తొలగింపునకు దారితీసిన ఉల్లంఘనలకు సంబంధించి పూర్తి వివరాలను ఏఎంసీ వెల్లడించలేదు. దేశంలోని ప్రముఖ మ్యూచువల్‌ ఫండ్‌ కంపెనీల్లో ఒకటైన యాక్సిస్‌ ఏఎంసీ నిర్వహణలో రూ.2.59 లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సంస్థ ఫ్రంట్‌ లైన్‌ ఆరోపణలను ఎదుర్కొంటుండగా, నియంత్రణ సంస్థ కూడా దర్యాప్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని