సంక్షిప్త వార్తలు
పీఎల్‌ఐ పథకంతో జీడీపీకి 4% జత
ఎమ్‌కే ఇన్వెస్ట్‌మెంట్స్ నివేదిక
ముంబయి: ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహకాల(పీఎల్‌ఐ) పథకం వల్ల ఏటా జీడీపీకి 4 శాతం జత చేయగలదని ఎమ్‌కే ఇన్వెస్ట్‌మెంట్స్ మేనేజర్స్ తన నివేదికలో పేర్కొంది. వచ్చే అయిదేళ్లలో కీలక రంగాల్లో తయారీకి ఊతమిచ్చేందుకు రూ.2.4 లక్షల కోట్ల మేర ప్రోత్సాహకాలను పీఎల్‌ఐ ద్వారా అందించనున్న సంగతి తెలిసిందే. ఈ పథకం కింద ఎలక్ట్రానిక్స్, వాహన విడిభాగాలు, ఔషధ రంగాల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ‘భారీ ప్రతిఫలాలు లభిస్తాయి కనుకే, తయారీ కంపెనీలు తమ సామర్థ్యాలను పెంచుకుంటూ వెళుతున్నాయి. కొత్తగా నమోదవుతున్న తయారీ కంపెనీల సంఖ్యను చూస్తుంటే ఈ పథకం ఎంత ఆకర్షణీయమో అర్థమవుతుంది. గత ఏడేళ్లలోనే అత్యధిక స్థాయిలో తయారీ కంపెనీల రిజిస్ట్రేషన్ నమోదైంది. 2021-22లో నమోదైన పర్యావరణ అనుమతులు కూడా అత్యధికమే. 2014-15తో పోలిస్తే ఇవి 10 రెట్లు పెరిగాయి. 2018-21లో చేపట్టిన నిర్మాణాత్మక మార్పులే ఇందుకు కారణంగా నిలిచాయ’ని ఆ నివేదిక వివరించింది.
75 ప్రాంతాల్లో బజాజ్ విద్యుత్ చేతక్ విక్రయాలు
దిల్లీ: విద్యుత్ స్కూటర్ చేతక్ విక్రయశాలలను పెంచడానికి బజాజ్ ఆటో సన్నాహాలు చేస్తోంది. 2021-22లో 20 ప్రాంతాల్లో చేతక్ స్కూటర్ విక్రయాలు చేపట్టగా.. వినియోగదార్ల నుంచి వస్తున్న స్పందన మేరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 75 ప్రాంతాల్లో విక్రయాలు జరపడానికి చూస్తున్నట్లు వార్షిక నివేదికలో సంస్థ పేర్కొంది. 2019 అక్టోబరులో దిగ్గజ స్కూటర్ చేతక్‌లో విద్యుత్ మోడల్‌ను కంపెనీ తీసుకొచ్చింది. ప్రారంభంలో పుణె, బెంగళూరుల్లోనే చేతక్‌ను బజాజ్ విక్రయించింది. 2020 ప్రారంభంలో బుకింగ్‌లు ప్రారంభించినా, కొవిడ్ వల్ల నిలిపివేసింది. తిరిగి 2021 ఏప్రిల్‌లో బుకింగ్‌లను మళ్లీ ప్రారంభించగా.. అధిక స్పందన రావడంతో 48 గంటల్లోనే ఆపేసింది. గత ఆర్థిక సంవత్సరంలో బజాజ్ విద్యుత్ చేతక్ విక్రయాలు 8,187గా నమోదయ్యాయి.
2022-23లో 12 కొత్త స్టోర్లు: షాపర్స్ స్టాప్
దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో కొత్తగా 12 స్టోర్లు ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు షాపర్స్ స్టాప్ వెల్లడించింది. ముఖ్యంగా వీటిని ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఏర్పాటు చేయనుంది. స్టోర్‌ల నవీకరణపై పెట్టుబడులు కొనసాగించనున్నట్లు వార్షిక నివేదికలో సంస్థ తెలిపింది. ఈ ఆర్థికంలో కొత్త, రీఫర్బిష్డ్ స్టోర్‌ల వాటాను 50 శాతానికి పైగా పెంచనున్నట్లు వివరించింది. ప్రముఖుల ప్రకటనలతో పాటు ప్రైవేట్ లేబుళ్లపై పెట్టుబడులను కూడా కొనసాగించనుంది. వినియోగదారుల ధోరణులను అర్థం చేసుకునేందుకు డేటా అనలిటిక్స్ ప్రాజెక్ట్ జార్విస్, కొత్త టెక్నాలజీలపై పెట్టుబడులు పెట్టనుంది.
ఈడీ విచారణకు ముంబయి మాజీ పోలీస్ కమిషనర్
కో లొకేషన్ కేసు
దిల్లీ: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ) కో-లొకేషన్ కుంభకోణంతో సంబంధం ఉన్న మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట ముంబయి మాజీ పోలీస్ కమిషనర్ సంజయ్ పాండే మంగళవారం హాజరయ్యారు. పలు కోణాల్లో ఆయన్ను ప్రశ్నించిన ఈడీ అధికారులు స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. 1986 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి సంజయ్. ఈయన జూన్ 30న పదవీ విరమణ పొందారు. దీనికి ముందు 4 నెలలపాటు మహారాష్ట్ర తాత్కాలిక డీజీపీగా ఆయన అదనపు బాధ్యతలు నిర్వర్తించారు.
* ఐసెక్ సెక్యూరిటీస్ ప్రై.లి., అనే సంస్థ ఎన్‌ఎస్‌ఈ కో-లొకేషన్ అక్రమాలు జరిగిన సమయంలో ఎన్‌ఎస్‌ఈ సెక్యూరిటీ ఆడిట్ నిర్వహించింది. ఈ కంపెనీని 2001 మార్చిలో సంజయ్ పాండే ఏర్పాటు చేశారు. 2006 మేలో డైరెక్టర్ హోదాలో కంపెనీ నుంచి బయటకొచ్చారు. ఆయన కుమారుడు, తల్లి ఆ తర్వాత కంపెనీ బాధ్యతలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు ఆయన్ను విచారణకు పిలిపించినట్లు తెలుస్తోంది. ఎన్‌ఎస్‌ఈ కో-లొకేషన్ కుంభకోణం సమయంలో కంపెనీ కార్యకలాపాలు, సాధించిన ఫలితాలను తెలుసుకునేందుకు ఈడీ సంజయ్‌ను విచారించినట్లు సమాచారం.
* ఐఐటీ-కాన్పూర్, హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్న పాండే పోలీసు అధికారిగా చేరినా, తర్వాత రాజీనామా చేశారు. ఆ సమయంలోనే ఐసెక్ సెక్యూరిటీస్‌ను స్థాపించారు. అయితే ఆయన రాజీనామాను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించకపోవడంతో ఆయన తిరిగి పోలీసు శాఖలో చేరారు. అయితే వెంటనే ఆయనకు పోస్టింగ్ మాత్రం ఇవ్వలేదు.
* ఎన్‌ఎస్‌ఈ కో-లొకేషన్ కేసులో ఇప్పటికే ఎన్‌ఎస్‌ఈ మాజీ ఎండీ, సీఈఓ చిత్రా రామకృష్ణను ఈడీ విచారించింది. ఆమె ప్రస్తుతం తిహాడ్ జైలులో ఉన్నారు. ఆమెతోపాటు ఎన్‌ఎస్‌ఈ మాజీ గ్రూప్ ఆపరేటింగ్ అధికారి ఆనంద్ సుబ్రమణియన్‌లను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) మార్చిలో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆదాయపు పన్ను (ఐటీ) విభాగం కూడా ఎన్‌ఎస్‌ఈ కో-లొకేషన్ కేసును విచారిస్తోంది.
విద్యుత్, పెట్రో ఉత్పత్తులను జీఎస్‌టీ పరిధిలోకి తేవాలి
సీఐఐ ప్రెసిడెంట్ సంజీవ్ బజాజ్
జీఎస్‌టీ పన్నుల విధానాన్ని సరళీకరించాల్సిన అవసరం ఉందని సీఐఐ (భారత పరిశ్రమల సమాఖ్య) అధ్యక్షుడు సంజీవ్ బజాజ్ అన్నారు. విద్యుత్, ఇంధన ఉత్పత్తులను జీఎస్‌టీ పరిధిలోకి తెస్తే, ఈ రంగాల్లో మరింత పోటీతత్వం వస్తుందని సూచించారు. జీఎస్‌టీలో పన్నురేట్ల శ్లాబ్‌ల సంఖ్యను తగ్గించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. విలాసవంత వస్తువులు, హానికారక ఉత్పత్తులను అత్యధిక జీఎస్‌టీ రేటు శ్లాబులో ఉంచడం సమర్థనీయమేనని అన్నారు. రూపాయి ఒడుదొడుకులను తగ్గించేందుకు ఆర్‌బీఐ జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. అధిక ద్రవ్యోల్బణానికి ఇంధనం, ఆహార పదార్థాలే కారణమని అన్నారు. ఈసారి సానుకూల వర్షపాత పరిస్థితులు ఉండొచ్చని భావిస్తున్నామని, ఇదే జరిగితే కనీసం ఆహార పదార్థాల ధరలైనా దిగివచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు. ఇంధన ధరలు ఎలా కదలాడతాయో చెప్పలేమని, అయితే ఇతర కమొడిటీల ధరలు దిగిరావడం మొదలైందని అన్నారు. పరిశ్రమల సామర్థ్య వినియోగం 74-75 శాతానికి చేరిందని బజాజ్ చెప్పారు. లాజిస్టిక్స్, రసాయనాలు, కమొడిటీలు, నిర్మాణం లాంటి రంగాల్లో మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని వివరించారు. చాలా ఇతర దేశాలతో పోలిస్తే భారత్ మెరుగైన స్థితిలో ఉందని, ఇందుకు గత రెండేళ్లలో ప్రభుత్వం చేపట్టిన చర్యలేనని తెలిపారు. బలమైన వృద్ధి స్థాయికి భారత్ క్రమక్రమంగా చేరుకుంటుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
కీవే కె-లైట్ 250వీ ఎట్ రూ.2.89 లక్షలు
దిల్లీ: హంగేరీకి చెందిన ద్విచక్ర వాహన తయారీ సంస్థ కీవే భారత్‌లో కె-లైట్ 250వీ పేరిట కొత్త బైక్‌ను విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.2.89 లక్షలు (ఎక్స్-షోరూమ్). 249 సీసీ ఇంజిన్ అమర్చిన ఈ వాహన డెలివరీలు ఈ నెల మూడో వారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ బైక్‌లు 3 రంగుల్లో లభ్యమవుతాయి. రంగు బట్టి ధర మారుతుంది. మ్యాటే బ్లూ బైక్ ధర రూ.2.89 లక్షలు కాగా, మ్యాటే డార్క్ గ్రే రూ.2.99 లక్షలు, మ్యాటే బ్లాక్ రూ.3.09 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్, భారత్) ఉన్నాయి. రిమోట్ ఇంజిన్ కటాఫ్, జియో ఫెన్స్, రైడ్ రికార్డుల నిర్వహణ, వేగంపై పరిమితి వంటి ఫంక్షన్లతో కూడిన కీవే కనెక్ట్ ఫీచర్‌ను అందిస్తున్నారు. ఈ ఏడాది ఆఖరుకు మరో 5 మోడల్ వాహనాలను తీసుకురానున్నట్లు కంపెనీ ఎండీ వికాస్ ఝబాక్ తెలిపారు. వ్యాపార విస్తరణకు అనుగుణంగా విక్రయశాలల నెట్‌వర్క్‌ను విస్తరించనున్నట్లు వెల్లడించారు. 2023 నాటికి 100 మంది డీలర్లను జత చేయనున్నట్లు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
India News
Beating Retreat: అటారీ-వాఘా సరిహద్దులో బీటింగ్ రీట్రీట్ వేడుకలు
-
General News
Telangana News: దేవేంద్రసింగ్, మహేశ్ భగవత్‌కు రాష్ట్రపతి పోలీస్ మెడల్స్
-
Technology News
Meta: వాట్సాప్, యూట్యూబ్ యూజర్లకు ‘ఫేస్బుక్’ కీలక సూచన..!
-
India News
President of India: దేశం ఆశలన్నీ వారిపైనే.. జాతినుద్దేశించి ప్రసంగంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
-
General News
TTD: అంతకంతకూ పెరుగుతున్న రద్దీ.. శ్రీవారి దర్శనానికి 40గంటలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- weekly horoscope :రాశిఫలం ( ఆగస్టు 14 - ఆగస్టు 20)
- Rakesh Jhunjhunwala: ప్రముఖ వ్యాపారవేత్త రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా హఠాన్మరణం
- Hyderabad News: ఇంజినీరింగ్ విద్యార్థినికి భారీ ప్యాకేజీతో ఉద్యోగం
- Rakesh Jhunjhunwala: ఆయన జీవితమే ఓ ఆర్థిక మంత్రం..!
- RRR: ఆస్కార్‌లోనూ ‘ఆర్ఆర్ఆర్’ హవా కొనసాగుతుంది..
- MK Stallin: ఆ నదిపై నిర్మాణాలొద్దు.. జగన్‌కు తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ
- Viral Video: క్షణం ఆలస్యమైనా పాము కాటేసేదే..! అంతలో ఏం జరిగిందంటే
- Vijay Deverakonda: డేటింగ్ లైఫ్.. ఆమెకు ఇలాంటివి నచ్చవు: విజయ్ దేవరకొండ
- Tunnel: బ్యాంకు లూటీకి ఏకంగా సొరంగం తవ్వకం.. ఆపై ఊహించని ఘటన!
- Rakesh Jhunjhunwala: ఝున్‌ఝున్‌వాలాను నిలబెట్టిన స్టాక్స్ ఇవే..