Adani Group: అదానీ గ్రూప్‌లోకి జీక్యూజీ డబ్బుల వరద.. మరోసారి భారీ పెట్టుబడి

అదానీ గ్రూప్‌లో జీక్యూజీ తన వాటాలను పెంచుకుంటోంది. తాజాగా దాదాపు 1 బిలియన్‌ డాలర్ల విలువైన షేర్లను కొనుగోలు చేసింది. బ్లాక్‌డీల్‌ ద్వారా ఈ షేర్లు చేతులు మారాయి.

Updated : 28 Jun 2023 16:25 IST

దిల్లీ: ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్‌ అదానీకి చెందిన అదానీ గ్రూప్‌ (Adani group)లో అమెరికా ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ జీక్యూజీ పార్టనర్స్‌ (GQG Partners) తన వాటాను మరింత పెంచుకుంటోంది. గతంలో హిండెన్‌బర్గ్‌ నివేదిక వెలువడిన అనంతరం అదానీ గ్రూప్‌లో వాటాలు కొనుగోలు చేసిన జీక్యూజీ.. మరోమారు అదానీ గ్రూప్‌లో భారీగా పెట్టుబడి పెట్టింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌, అదానీ గ్రీన్‌ ఎనర్జీలో దాదాపు 1 బిలియన్‌ డాలర్ల విలువైన షేర్లను జీక్యూజీ పార్టనర్స్‌తో పాటు, ఇతర ఇన్వెస్టర్లు కొనుగోలు చేశారు. అదానీ కుటుంబం నుంచి ఈ వాటాలను ఇన్వెస్టర్లు కొనుగోలు చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌కు చెందిన 1.8 కోట్ల షేర్లు బుధవారం బ్లాక్‌డీల్‌ ద్వారా చేతులు మారినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అదానీ గ్రీన్‌ ఎనర్జీకి చెందిన 3.52 కోట్ల షేర్లు సైతం ఇన్వెస్టర్లు కొనుగోలు చేసినట్లు పేర్కొన్నాయి. అదానీ ఎటర్‌ప్రైజెస్‌ షేర్లను విలువ రూ.2,300 వద్ద, అదానీ గ్రీన్‌ ఎనర్జీ షేర్లను రూ.920 వద్ద అదానీ గ్రూప్‌ విక్రయించినట్లు తెలిసింది. అదానీ గ్రూప్‌ షేర్లలో వాటాల కొనుగోలు నేపథ్యంలో అదానీ గ్రూప్‌ స్టాక్స్‌ బుధవారం లాభాల్లో కొనసాగుతున్నాయి.

జీక్యూజీ పార్ట్‌నర్స్‌ను భారత సంతతికి చెందిన రాజీవ్‌ జైన్‌ 2016 జూన్‌లో స్థాపించారు. ప్రస్తుతం ఆయన ఈ కంపెనీకి ఛైర్మన్‌, చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్నారు. గతంలో హిండెన్‌బర్గ్‌ నివేదిక వెలువడిన అనంతరం రుణాల తిరిగి చెల్లింపుల కోసం జీక్యూజీ.. వాటాల కొనుగోలు చేసి ఓ విధంగా అదానీ గ్రూప్‌ సంస్థను ఆదుకుంది. ఈ ఏడాది మార్చిలో మరోమారు రూ.15,446 కోట్లకు సెకండరీ మార్కెట్‌ బ్లాక్‌ లావాదేవీల ద్వారా అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ పోర్ట్స్‌, అదానీ గ్రీన్‌ ఎనర్జీ, అదానీ ట్రాన్స్‌మిషన్‌ కంపెనీల్లో జీక్యూజీ వాటాలను పొందింది. భవిష్యత్‌లోనూ అదానీ గ్రూప్‌లో వాటాలు కొనుగోలు చేస్తామని ఆ సంస్థ అధినేత రాజీవ్‌ జైన్‌ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ నేపథ్యంలోనే అదానీ గ్రూప్‌లోకి పెట్టుబడులను కొనసాగిస్తుండడం గమనార్హం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని