Insurance: బీమా సంస్థ‌పై ఫిర్యాదు ఎలా న‌మోదు చేయాలి?

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏదైనా సంస్థ నుంచి బీమా పాల‌సీ తీసుకుంటే కొనుగోలు ద‌గ్గ‌ర నుంచి క్లెయిమ్ చేసుకునే వరకు చాలా ప్రక్రియ ఉంటుంది. అనేక ర‌కాల సేవ‌ల‌ను బీమా సంస్థ పాల‌సీదారునికి అందిస్తుంది. అయితే సంస్థ స‌రైన విధంగా సేవ‌లు అందించ‌కున్నా, స‌మ‌స్య‌లు త‌లెత్తినా.. పాలసీదారులు స‌ద‌రు సంస్థ‌పై ఫిర్యాదు చేయొచ్చు.

సాధార‌ణంగా త‌లెత్తే స‌మ‌స్య‌లు: క్లెయిమ్ సెటిల్‌మెంట్‌లో జాప్యం, క్లెయిమ్ మొత్తాన్ని పూర్తిగా లేదా పాక్షికంగా తిర‌స్క‌రించ‌డం, చెల్లించిన‌ లేదా చెల్లించాల్సిన ప్రీమియానికి సంబంధించిన వివాదాలు, ప్రీమియం అందిన తర్వాత కూడా పాల‌సీ జారీచేయ‌క‌పోవ‌డం, ప్ర‌తిపాద‌న ఫార‌మ్‌లో ఉన్న విధంగా పాల‌సీ లేక‌పోవ‌డం, పాల‌సీ కాల‌వ్య‌వ‌ధిలో నియ‌మ నిబంధ‌ల్లో మార్పులు చేయ‌డం, మ‌ధ్య‌వ‌ర్తులు లేదా ఏజెంట్ల‌తో త‌లెత్తే స‌మ‌స్య‌లు, చిరునామా మార్చడం, సంప్రదింపుల వివరాలు, నామినీలు, పన్ను ఆదా సర్టిఫికెట్‌ అందించడం, చెల్లింపు పద్ధతిలో మార్పులు.. ఇలా అనేక ర‌కాల స‌మ‌స్య‌ల‌కు ఫిర్యాదులు చేయొచ్చు.

ఫిర్యాదులు ఎలా..?

బీమా సంస్థ గ్రీవెన్స్‌ అధికారిని సంప్ర‌దించాలి: ఫిర్యాదుల ప‌రిష్కారానికి పాల‌సీదారుడు ముందుగా బీమా సంస్థ‌ను సంప్రదించాలి. క‌స్ట‌మ‌ర్ల ఫిర్యాదుల‌ను స్వీక‌రించ‌డం, ప‌రిష్క‌రించ‌డం కోసం ప్రతి బీమా సంస్థ‌కూ సొంత నిర్వ‌హ‌ణ సిస్ట‌మ్, అలాగే గ్రీవెన్స్‌ అధికారి ఉంటారు. వారిని సంప్ర‌దించి అవ‌స‌ర‌మైన ప‌త్రాల‌తో పాటు లిఖిత పూర్వ‌కంగా మీ స‌మ‌స్య లేదా ఫిర్యాదును తెలియ‌జేయాలి. లేదా మీ ద‌గ్గ‌ర‌లోకి సంస్థ శాఖ‌కు వెళ్లి గ్రీవెన్స్‌ అధికారికి మీ ఫిర్యాదులను మెయిల్‌ చేయొచ్చు. బీమా సంస్థ అధికారిక వెబ్‌సైట్‌లో కూడా గ్రీవెన్స్‌ అధికారి సంప్ర‌దింపుల‌ వివ‌రాలు అందుబాటులో ఉంటాయి. బీమా సంస్థ మీ ఫిర్యాదుకు 15 రోజుల్లోపు పరిష్కారం చూపించాలి. ఈ స‌మయంలో ప‌రిష్క‌రించ‌కున్నా, బీమా సంస్థ అందించిన పరిష్కారంతో మీరు సంతృప్తిగా లేక‌పోయినా ఐఆర్‌డీఏఐ వ‌ద్దకు తీసుకెళ్లవచ్చు.

ఐఆర్‌డీఏకు ఎలా ఫిర్యాదు చేయాలి?: ఇందుకోసం మీరు ఐఆర్‌డీఏఐ గ్రీవెన్స్ ప‌రిష్కారం విభాగాన్ని సంప్ర‌దించాల్సి ఉంటుంది. టోల్ ఫ్రీ నంబర్ 155255 (లేదా) 1800-4254-732కి కాల్ చేయడం ద్వారా గానీ, complaints@irdai.gov.in కు ఈ-మెయిల్ ద్వారా గానీ ఫిర్యాదు చేయొచ్చు. అంతే కాకుండా ఇంటిగ్రేటెడ్ గ్రీవెన్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఐజీఎంఎస్), ఆన్‌లైన్ పోర్ట‌ల్ ద్వారా కూడా ఫిర్యాదుల‌ను రిజిస్ట‌ర్ చేయొచ్చు. ఏదేమైనా ముందుగా బీమా సంస్థ‌కు కంప్లైంట్ చేసి.. త‌గిన ప‌రిష్కారం ల‌భించ‌క‌పోతేనే ఐఆర్‌డీఏఐను సంప్ర‌దించాలి. ఏ కార‌ణం చేత‌నైనా బీమా సంస్థ‌ను నేరుగా సంప్ర‌దించ‌లేక‌పోతే ఐజీఎంఎస్ గేట్‌వే ద్వారా బీమా సంస్థ‌ వద్ద ఫిర్యాదు రిజిస్టర్‌ చేయొచ్చు.  

ఐజీఎంఎస్ ఎలా ఉప‌యోగించాలి?: ఐజీఎంఎస్ వెబ్‌సైట్‌ https://igms.irda.gov.in/ను సంద‌ర్శించి పాలసీదారుడు అత‌డు/ఆమె వివరాలు నమోదు చేసి ఫిర్యాదులు చేయొచ్చు. బీమా పాలసీలో ఉన్న వివ‌రాల‌ను మాత్ర‌మే రిజిస్ట్రేష‌న్ కోసం ఇవ్వాలి. ఫిర్యాదు న‌మోదు చేసేట‌ప్పుడు పాలసీ పత్రాలను దగ్గర పెట్టుకుంటే పాలసీ నంబర్‌, పాల‌సీదారుని పేరు, ఫిర్యాదుదారు కాంటాక్ట్ వివరాలను త‌ప్పులు లేకుండా ఇవ్వ‌గ‌లుగుతారు. ఈ వ్యవస్థ ద్వారా ఉచితంగా సేవ‌లు పొందొచ్చు. ఐజీఎంఎస్ ద్వారా రిజిస్ట‌ర్ చేసిన ఫిర్యాదు బీమా సంస్థ ఫిర్యాదుల ప‌రిష్కార వ్య‌వ‌స్థ‌కు, అలాగే ఐఆర్‌డీఏఐ రిపాజిట‌రీకి వెళుతుంది. ఒక‌వేళ 15 రోజుల్లో బీమా సంస్థ‌ పరిష్కరించకుంటే నేరుగా ఐఆర్డీఏఐకు ఫిర్యాదు చేయొచ్చు.

అంబుడ్స్‌మన్‌: ఫిర్యాదుకు బీమా సంస్థ ఇచ్చిన ప‌రిష్కారంతో మీరు సంతృప్తి చెందకపోతే ఇన్సూరెన్స్ అంబుడ్స్‌మన్‌ను సంప్ర‌దించి, ఫిర్యాదు చేయొచ్చు. పాల‌సీదారులు త‌మ ఫిర్యాదులకు కోర్టు బ‌య‌ట ప‌రిష్క‌రం పొందేందుకు కేంద్రం అంబుడ్స్‌మెన్‌ను ఏర్పాటు చేసింది. ప్ర‌స్తుతం దేశవ్యాప్తంగా 17 ఇన్సురెన్స్ అంబుడ్స్‌మెన్ కార్యాల‌యాలు అందుబాటులో ఉన్నాయి. బీమా సంస్థ ఫిర్యాదు చేసిన 30 రోజుల్లోపు స్పందించ‌క‌పోయినా, త‌గిన ప‌రిష్కారం చూపించ‌క‌పోయినా అంబుడ్స్‌మెన్‌ను సంప్ర‌దించొచ్చు.

వినియోగదారుల ఫోరం లేదా సివిల్ కోర్టు: అంబుడ్స్‌మన్‌ వ‌ద్ద కూడా స‌మ‌స్య‌ ప‌రిష్కారం కాకుంటే.. మీరు వినియోగదారుల (కన్జూమర్‌) ఫోరమ్ లేదా సివిల్ కోర్టును ఆశ్రయించ‌వ‌చ్చు.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని