Petrol Price: 10 ఏళ్ల గరిష్ఠానికి క్రూడాయిల్‌ ధర.. అయినా పెట్రో రేట్లు ఎందుకు పెరగడం లేదు?

భారత్‌ బాస్కెట్‌ ముడి చమురు బ్యారెల్‌ ధర దశాబ్దకాలంలోనే 121 డాలర్ల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. పెట్రోలియం, సహజవాయు శాఖకు చెందిన పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్(పీపీఏసీ) గణాంకాల ప్రకారం.. జూన్ 9న ఇది 121.28...

Published : 10 Jun 2022 20:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌ దిగుమతి చేసుకుంటున్న ముడి చమురు బ్యారెల్‌ ధర పదేళ్ల గరిష్ఠానికి చేరింది. ఈ నెల 9న బ్యారెల్‌ చమురు ధర 121 డాలర్లకు చేరుకుంది. 2012 తర్వాత ఈ స్థాయికి క్రూడాయిల్‌ ధర చేరుకోవడం ఇదే తొలిసారి. పెట్రోలియం, సహజవాయు శాఖకు చెందిన పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్(పీపీఏసీ) గణాంకాల ప్రకారం.. గతంలో 2012 ఫిబ్రవరి- మార్చి సమయంలో ఈ స్థాయి ధరలు నమోదయ్యాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు ఈ స్థాయికి చేరినప్పటికీ దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ రిటైల్‌ విక్రయ ధరల్లో ఎటువంటి మార్పులూ లేకపోవడం గమనార్హం. కారణమేంటంటే?

భారత్‌ తన చమురు అవసరాల్లో 85 శాతం.. దిగుమతులపైనే ఆధారపడి ఉంది. దేశంలో కేంద్ర ప్రభుత్వ యాజమాన్యంలోని ఇంధన రిటైలర్లు.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL).. అంతర్జాతీయ మార్కెట్‌ ధరలకు అనుగుణంగా స్థానికంగా రోజూ పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తాయి. గతంలో ఏరోజుకారోజు పెట్రోల్‌ ధరలు పెంచుతూ వచ్చిన సంస్థలు ప్రస్తుతం ధరల్లో ఎలాంటి మార్పూ చేేయడం లేదు. బ్యారెల్ ముడి చమురు ధరను అవి 85 డాలర్ల వద్ద ఉన్న రేటుకే విక్రయిస్తున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

ద్రవ్యోల్బణం కట్టడికి ఓ వైపు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంలో చమురు సంస్థలు సైతం పాలుపంచుకుంటున్నాయని, అందుకే ధరలను మార్చడం లేదని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ద్రవ్యోల్బణం ఇప్పటికే దాదాపు ఎనిమిదేళ్ల గరిష్ఠ స్థాయి (7.8 శాతానికి) చేరుకున్న విషయం తెలిసిందే. ఇంధన ధరలు.. ముఖ్యంగా డీజిల్‌ ధరలు ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపుతాయి. డీజిల్‌ ధరలు పెరిగితే రవాణా ఖర్చులపై ప్రభావం పడుతుంది. ఫలితంగా కూరగాయలు, నిత్యవసరాలు సహా అన్నింటి ధరలు పెరుగుతాయి. ఈ కారణంగానే మార్కెట్‌లో ధరలు పెరుగుతున్నప్పటికీ ధరలను సవరించడం లేదని చెబుతున్నారు. పెట్రోల్‌, డీజిల్‌పై లీటరుకు రూ.18, రూ.21 చొప్పున నష్టాన్ని భరిస్తూ విక్రయిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను చివరిసారిగా ఏప్రిల్ 6న సవరించారు. అప్పటి నుంచి దాదాపు 65 రోజులుగా ఎటువంటి మార్పూ లేదు. ఈ క్రమంలోనే మే 21న కేంద్రం పెట్రోల్‌పై లీటరుకు రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. అంతకుముందు ఉత్తర్‌ప్రదేశ్‌ సహా అయిదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో గతేడాది నవంబర్‌ నుంచి రికార్డు స్థాయిలో 137 రోజులపాటు పెట్రోల్‌, డీజిల్ రేట్లను స్తంభింపజేసిన విషయం తెలిసిందే. మరోవైపు ప్రభుత్వ అధీనంలోని చమురు మార్కెటింగ్ కంపెనీలు నష్టాలు వస్తున్నప్పటికీ రిటైల్ కార్యకలాపాలు నిర్వహిస్తుండగా.. రిలయన్స్-బీపీ, నయారా ఎనర్జీ వంటి ప్రైవేట్ రంగ రిటైలర్లు నష్టాలను తగ్గించుకోవడానికి తమ కార్యకలాపాలపై కత్తెర వేస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని