Jack Ma: జాక్‌ మాకు మరో షాక్‌‌.. యాంట్‌ గ్రూప్‌పై నియంత్రణా పాయె!

చైనాకు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త జాక్‌ మాకు మరో షాక్‌ తగిలింది. ఆయన స్థాపించిన యాంట్‌ గ్రూప్‌పై ఆయన నియంత్రణ కోల్పోయేలా వాటాదారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. 

Published : 07 Jan 2023 15:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చైనాకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త, అలీబాబా, యాంట్‌ గ్రూప్‌ (Ant Group) వ్యవస్థాపకుడు జాక్‌ మాకు (Jack Ma) మరో షాక్‌ తగిలింది. చైనా ప్రభుత్వ పెద్దలకు కోపం తెప్పించేలా వ్యవహరించిన జాక్‌ మా.. ఫిన్‌టెక్‌ సంస్థ యాంట్‌ గ్రూప్‌పై నియంత్రణను సైతం కోల్పోనున్నారు. ఈ మేరకు ఓటింగ్‌ హక్కులను మారుస్తూ కంపెనీ వాటాదారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కంపెనీ వ్యవస్థాపకుడు, మేనేజ్‌మెంట్‌, ఉద్యోగుల ఓటింగ్‌ హక్కుల్లో మార్పులు చేశారు. ఈ నిర్ణయం వల్ల వాటాదారుల ఆర్థిక ప్రయోజనాలకు ఏమాత్రం ఆటంకం ఏర్పడబోతోందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. తాజా నిర్ణయంతో జాక్‌ మా కంపెనీపై తన పట్టును కోల్పోనున్నారు.

చైనా కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని విమర్శించినప్పటి నుంచీ జాక్‌ మాపై అక్కడి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తూ వస్తోంది. ఇందులో భాగంగానే 37 బిలియన్‌ డాలర్లు విలువచేసే యాంట్‌ గ్రూప్‌ ఐపీఓను సైతం అడ్డుకొంది. చైనా పెద్దల చర్యలతో ఓ దశలో కొన్నాళ్ల పాటు అదృశ్యం అయిన జాక్‌ మా.. చాలా కాలంగా ప్రజలకు పెద్దగా కనిపించడమే మానేశారు. తాజాగా ఓటింగ్‌ హక్కులను తీసుకోవడం ద్వారా జాక్‌ మాను మరింత అణగదొక్కడమే ఉద్దేశంగా కనిపిస్తోంది. ఓటింగ్‌ హక్కుల విషయంలో తీసుకున్న ఈ నిర్ణయంతో యాంట్‌ గ్రూప్‌ ఐపీఓ మరింత ఆలస్యం కానుంది. నియంత్రణ హక్కులు మారాక మూడేళ్ల వరకు స్టాక్‌ మార్కెట్‌లో లిస్ట్‌ కాకూడదన్న నిబంధన చైనాలో ఉంది. అదే హాంకాంగ్‌లో అయితే ఏడాది పాటు ఐపీఓకు వెళ్లేందుకు అనుమతి ఉండదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని