Stock Market Update: ఎట్టకేలకు మార్కెట్లకు లాభాలు..6 రోజుల వరుస నష్టాలకు బ్రేక్‌

ఆద్యంతం ఊగిసలాట మధ్య చలించిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఎట్టకేలకు లాభాలతో ముగిశాయి....

Updated : 20 Jun 2022 16:11 IST

ముంబయి: ఆద్యంతం ఊగిసలాట మధ్య చలించిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం ఎట్టకేలకు లాభాలతో ముగిశాయి. దీంతో వరుస ఆరు సెషన్ల భారీ నష్టాలకు బ్రేక్‌ పడినట్లయింది. ఉదయం ఊగిసలాట మధ్య ట్రేడింగ్‌ ప్రారంభించిన సూచీలు రోజంతా అదే బాటలో పయనించాయి. చివరి అరగంటలో కొనుగోళ్ల మద్దతుతో స్పష్టమైన లాభాల్లో ముగిశాయి. గతవారపు భారీ నష్టాల నేపథ్యంలో కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. మరోవైపు ఐరోపా మార్కెట్ల సానుకూల కదలికలు మార్కెట్లకు కలిసొచ్చాయి. ఆసియా సూచీలు కూడా నేడు కొంత సానుకూలంగా ముగిశాయి.

ఉదయం సెన్సెక్స్‌ 51,470.03 వద్ద లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 51,714.61 - 51,062.93 మధ్య కదలాడింది. చివరకు 237.42 పాయింట్ల లాభంతో 51,597.84 వద్ద ముగిసింది. 15,334.50 వద్ద సానుకూలంగా ప్రారంభమైన నిఫ్టీ చివరకు 56.65 పాయింట్లు లాభపడి 15,350.15 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 15,382.50 - 15,191.10 మధ్య చలించింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ మార్కెట్లు ముగిసే సమయానికి రూ.77.95 వద్ద ట్రేడవుతోంది.

సెన్సెక్స్‌ 30 సూచీలో హెచ్‌యూఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, విప్రో, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా, సన్‌ఫార్మా, టైటన్‌, టీసీఎస్‌, నెస్లే ఇండియా, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు లాభాల్లో ముగిశాయి. టాటా స్టీల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, రిలయన్స్‌, ఎంఅండ్‌ఎం, ఎన్‌టీపీసీ, ఎస్‌బీఐ, ఎల్‌అండ్‌టీ, పవర్‌గ్రిడ్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, మారుతీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ షేర్లు అత్యధికంగా నష్టపోయిన వాటిలో ఉన్నాయి.

మార్కెట్‌లోని ఇతర సంగతులు..

* గత వరుస 15 సెషన్లలో 12 సెషన్లు నష్టపోయిన ఎల్‌ఐసీ షేరు ఈరోజు 1.53 శాతం లాభంతో ముగిసింది. ఇష్యూ ధరతో పోలిస్తే కంపెనీ షేర్లు 31 శాతం దిగువన ట్రేడవుతున్నాయి.

* పంచదార ఎగుమతులపై పరిమితులు విధించే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో నేడు ఆ రంగంలోని కంపెనీ షేర్లు భారీగా నష్టపోయాయి. శ్రీ రేణుకా షుగర్స్‌ షేర్లు అత్యధికంగా 11.58 శాతం మేర కుంగాయి.

* నాల్కో షేర్లు ఈరోజు 6.67 శాతం నష్టపోయాయి. గత ఏడు నెలల్లో ఇదే ఒకరోజు అత్యధిక నష్టం కావడం గమనార్హం.

* డెల్టా కార్ప్‌ షేర్లు చివరకు 4.94 శాతం కుంగాయి. ఇంట్రాడేలో ఈ షేరు 9.5 శాతం వరకు నష్టపోయింది. రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా కంపెనీలో 5.7 మిలియన్‌ షేర్లు విక్రయించడమే ఇందుకు కారణం.

* అదానీ విల్మర్‌ వంటనూనెల ధరలను రూ.10 మేర తగ్గించింది. దీంతో కంపెనీ షేర్లు ఈరోజు 5 శాతం కుంగి రూ.553.30 వద్ద స్థిరపడ్డాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు