Radhika Gupta: 22 ఏళ్లకు ఆత్మహత్యాయత్నం.. 33 ఏళ్లకు కంపెనీ సీఈఓ

‘‘నిన్ను నువ్వు అంగీకరించినప్పుడే నీలో ఆత్మవిశ్వాసం వస్తుంది. నువ్వు ప్రత్యేకం అని గుర్తించు. ఆ తర్వాత నీ సొంత ఆటను ఆడు. అప్పుడే ఓ ఛాంపియన్‌లా మారుతావు’’.. ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ ఎడెల్‌వీస్‌ సీఈఓ

Updated : 07 Jun 2022 16:50 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘‘నువ్వు ఎలా ఉన్నా నిన్ను నువ్వు అంగీకరించినప్పుడే నీలో ఆత్మవిశ్వాసం వస్తుంది. నువ్వు ప్రత్యేకం అని గుర్తించు. ఆ తర్వాత నీ సొంత ఆటను ఆడు. అప్పుడే ఓ ఛాంపియన్‌లా మారుతావు’’.. ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ ఎడెల్‌వీస్‌ సీఈఓ రాధిక గుప్తా నేర్చుకున్న జీవిత పాఠమిది. 33ఏళ్ల వయసుకే ఈ కంపెనీ పగ్గాలు అందుకున్న రాధిక.. దేశంలోనే అత్యంత పిన్న వయస్కులైన సీఈఓల్లో ఒకరిగా అరుదైన గుర్తింపు సాధించారు. కానీ ఆమె ప్రయాణం నల్లేరు మీద నడకేం కాదు. పుట్టుకతో వచ్చిన వైకల్యం ఎన్నో అవమానాలను మిగిల్చింది. జీవితం మీద విరక్తి ఆత్మహత్యాయత్నం వరకు వెళ్లింది. అవన్నీ దాటుకుని నేడు ఎంతో మందికి స్ఫూర్తినిచ్చే స్థాయికి చేరుకున్నారు రాధిక. తన జీవిత ప్రయాణంలో ఎదురైన సవాళ్లను హ్యూమన్స్‌ ఆఫ్‌ బాంబే ఫేస్‌బుక్‌ పేజీతో పంచుకున్నారు. అది ఆమె మాటల్లోనే..

‘‘మా నాన్న విదేశీ వ్యవహారాల శాఖలో పనిచేసేవారు. దీంతో మేం పాకిస్థాన్‌, న్యూయార్క్‌, దిల్లీ, నైజీరియా.. ఇలా అనేక ప్రాంతాల్లో ఉన్నాం. నాకు పుట్టుకతోనే మెడ కాస్త వంకర. అందుకే నేను స్కూల్‌ మారిన ప్రతిసారీ నాకు వేధింపులు తప్పేవి కావు. నేను చదివిన స్కూల్లోనే మా అమ్మ ఉద్యోగం చేసింది. అమ్మ చాలా అందంగా ఉండేది. దీంతో అందరూ నన్ను అమ్మతో పోల్చుతూ అందంగా లేనంటూ ఎగతాళి చేసేవారు. నా ముందే సూటిపోటి మాటలతో వేధించేవారు. అది నా ఆత్మవిశ్వాసంపై గట్టి దెబ్బకొట్టింది. నాలో అభద్రతాభావం మొదలైంది. అప్పుడు నాకు 22ఏళ్లు. చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగ వేట మొదలుపెట్టా. ఆత్మన్యూనతను అధిగమించి ఉద్యోగం చేయాలనుకున్నా. కానీ వరుసగా ఏడు ఇంటర్వ్యూల్లో రిజక్ట్‌ అయ్యాను. అది నన్ను తీవ్ర కుంగుబాటుకు గురిచేసింది. ఇక జీవితంలో ఏదీ సాధించలేమోనని భయమేసింది. కిటికీవైపు చూస్తూ దూకేస్తా అని చెప్పాను. ఆ సమయంలో నా స్నేహితురాలు నన్ను కాపాడింది..!’’

‘‘తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్న నన్ను సైకియాట్రిక్‌ వార్డులో చేర్చారు. అదే సమయంలో మరో ఇంటర్వ్యూకు పిలుపొచ్చింది. ఈ సారి కూడా జాబ్‌ రాదేమో అని అనుకున్నా. చివరి ప్రయత్నం చేద్దామని వెళ్లా. కానీ అదృష్టం నన్ను వరించింది. అమెరికాలోని మెకిన్సేలో నేను ఉద్యోగం సాధించాను. అప్పుడే నా జీవితం సరైన మార్గం దిశగా తిరిగింది. కానీ మూడేళ్ల తర్వాత, ఆర్థిక మాంద్యం, ఇతర కారణాలు నన్ను మళ్లీ కష్టాల్లోకి నెట్టేశాయి. ఇక అక్కడ ఉండలేక భారత్‌కు వచ్చేశా..’’

‘‘ఇక్కడకు వచ్చాక నళిన్‌ మోనిజ్‌తో పరిచయం ఏర్పడింది. మేం ఇద్దరం, మరో స్నేహితుడితో కలిసి సొంతంగా అసెట్‌ మేనేజ్‌మెంట్ సంస్థను ప్రారంభించాం. ఆ తర్వాత నళిన్‌తో నా పరిచయం ప్రేమగా మారి మేం వివాహబంధంలోకి అడుగుపెట్టాం. మా కంపెనీ కొద్ది రోజుల్లోనే మంచి పేరు సంపాదించింది. ఐదేళ్ల తర్వాత మా కంపెనీని ఎడెల్‌వీస్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ కొనుగోలు చేసింది. నేను కూడా అదే సంస్థ కీలక పదవిలో చేరాను..’’

భర్త ప్రోత్సాహంతో..

‘‘ఎడెల్‌వీస్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్ లిమిటెడ్‌ కంపెనీకి కొత్త సీఈఓ కోసం నియామకాలు జరుగుతున్నప్పుడు.. నా భర్త నుంచి ఊహించని ప్రతిపాదన ఎదురైంది. ఆ కంపెనీకి నువ్వే సీఈఓగా ప్రయత్నించవచ్చు కదా.. అని ఆయన నాతో అన్నారు. నేను భయపడుతుంటే.. ఆ పదవికి నువ్వే సరైన వ్యక్తివి అంటూ నన్ను ప్రోత్సహించారు. దీంతో నేను నేరుగా మా బాస్‌ దగ్గరకు వెళ్లి ‘సీఈఓ పదవి కోసం నన్ను కూడా పరిశీలించండి’ అని చెప్పాను. అనుభవం లేకపోయినా.. కంపెనీని నడిపించే ధైర్యం ఉందని చెప్పా. నాలోని ఆత్మవిశ్వాసం వారికి నచ్చింది. కొన్ని నెలల తర్వాత నా 33వ ఏట.. దేశంలోనే అత్యంత పిన్న వయస్కులైన సీఈఓలో ఒకరిగా నిలిచాను..’’

‘‘ఒకప్పుడు నాలోని లోపాన్ని చూసి నేనే కుమిలిపోయేదాన్ని. ఇప్పుడు ఆ ఆత్మన్యూనతను అధిగమించి నాకంటూ ఓ ప్రత్యేకత సాధించుకున్నా.. నాలా అవయవలోపం ఉండి వేధింపులు ఎదుర్కొంటోన్న వారికి స్ఫూర్తి నింపాలన్న ఉద్దేశంతోనే ఓ పుస్తకం కూడా రాశాను. ఇప్పటికీ నా రూపు గురించి ఏమైనా కామెంట్లు వస్తే నేను వారికి ఒకటే చెబుతా.. అవును నాకు మెల్ల కన్ను.. మెడ వంకర.. మీలో ఉన్న ప్రత్యేకత ఏంటి మరీ?’’ అంటూ తన స్ఫూర్తి గాథను పంచుకున్నారు రాధిక గుప్తా. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని