Rakesh Jhunjhunwala: ఒక్కరోజులో రూ.426 కోట్లు నష్టపోయిన రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా..!

అమెరికా ద్రవ్యోల్బణ భయాలు దేశీయ స్టాక్‌ మార్కెట్లను శుక్రవారం ముంచేశాయి. ఫలితంగా ఒక్క రోజే లక్షల కోట్ల మేర మదుపర్ల సంపద ఆవిరైంది. షేర్‌ మార్కెట్‌

Published : 12 Feb 2022 12:41 IST

ముంబయి: అమెరికా ద్రవ్యోల్బణ భయాలు దేశీయ స్టాక్‌ మార్కెట్లను శుక్రవారం ముంచేశాయి. ఫలితంగా ఒక్క రోజే లక్షల కోట్ల మేర మదుపర్ల సంపద ఆవిరైంది. షేర్‌ మార్కెట్‌ బిగ్‌ బుల్‌గా పేరొందిన ప్రముఖ మదుపరి రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా సైతం నిన్నటి మార్కెట్ల పతనానికి భారీ నష్టాన్ని చవిచూశారు. రెండు కంపెనీల్లో ఆయన షేర్ల విలువ గణనీయంగా తగ్గడంతో ఒక్కరోజే రూ.426కోట్లు నష్టపోయారు. 

రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా ఫేవరెట్‌ అయిన టైటాన్‌ కంపెనీతో పాటు స్టార్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఈ భారీ నష్టాన్ని తెచ్చిపెట్టాయి. టైటాన్‌ కంపెనీలో రాకేశ్‌, ఆయన సతీమణి రేఖ ప్రధాన పెట్టుబడిదారులుగా ఉన్నారు. కంపెనీ గణాంకాల ప్రకారం.. టైటాన్‌లో రాకేశ్‌కు 4.02 శాతం, ఆయన సతీమణికి 1.07 శాతం షేర్లు ఉన్నాయి. అంటే ఈ కంపెనీలో వీరి మొత్తం షేర్ల విలువ 5.09శాతం (4.52 కోట్ల షేర్లు)గా ఉంది. శుక్రవారం నాటి మార్కెట్‌ ట్రేడింగ్‌లో టైటాన్‌ కంపెనీ ఒక్కో షేరు ధర రూ.53.20 కుంగింది. దీంతో ఈ కంపెనీ ద్వారా రాకేశ్ దంపతులకు రూ.240కోట్ల మేర నష్టం వాటిల్లినట్లయింది. 

ఇక స్టార్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌లో రాకేశ్, ఆయన సతీమణి షేర్ల వాటాల విలువ 17.50శాతం. అంటే దాదాపు 10 కోట్లకు పైనే షేర్లు ఉన్నాయి. నిన్నటి ట్రేడింగ్‌లో స్టార్ హెల్త్‌ షేరు ధర రూ.18.55 తగ్గింది. దీంతో ఝున్‌ఝున్‌వాలా నికర సంపద దాదాపు రూ.186 కోట్ల మేర తరిగింది. అలా ఈ రెండు కంపెనీల ద్వారా శుక్రవారం ఒక్కరోజే ఆయన రూ.426 కోట్ల మేర నష్టపోయినట్లు మార్కెట్‌ గణాంకాలు పేర్కొన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని