Updated : 09 Jun 2022 19:13 IST

Credit card bill: అధ్యక్షా..! ప్రతిసారీ ‘మినిమమ్‌ డ్యూ‌’ కడితే ఎట్టాగా..?

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒకప్పుడు ఏదైనా కొనాలంటే డబ్బులు చేతిలోఉంటేనే సాధ్యమయ్యేది. కానీ రోజులు మారాయి. పరిస్థితులూ మారాయి. క్రెడిట్‌కార్డులు (Credit cards) అందుబాటులోకి వచ్చాయి. దీంతో వెంట వెంటనే అప్పు పుడుతోంది. వాటితో కావాల్సిన వస్తువులను కొనుగోలు చేయడం సులువైపోయింది. చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా క్రెడిట్‌ కార్డు చేతిలో ఉంటే చాలు, కావాల్సినంత షాపింగ్‌ చేసేయొచ్చు. ఇంతవరకు బానే ఉంది. మరి బిల్లు మాటేంటి? దాదాపు క్రెడిట్‌ కార్డు వాడుతున్నవారు ఎదుర్కొంటున్న సమస్యే ఇది. నెలంతా చేసిన ఖర్చును ఒక్కసారి చెల్లించాల్సి రావడంతో ఎక్కువ మంది ‘మినిమమ్‌ బిల్లు’ (Minimum due) కట్టేందుకు మొగ్గు చూపుతున్నారు. అలా చేస్తే ఆ నెలకు గుండెల నుంచి భారం దిగిపోయినట్లు అనిపించినా.. దీర్ఘకాలంలో నష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరూ ‘మినిమమ్‌’ అధ్యక్షులే అయితే.. ఈ కథనం చదవండి.

మినిమమ్‌ డ్యూ/ పేమెంట్‌ వల్ల కలిగే నష్టాల గురించి తెలుసుకునేముందు అసలు మినిమమ్‌ డ్యూ గురించి తెలుసుకుందాం. క్రెడిట్‌ కార్డు వినియోగదారుడు తనకు వచ్చిన బిల్లు మొత్తం కట్టకుండా ఆ నెల కొంత మొత్తం మాత్రమే చెల్లించడమే మినిమమ్‌ పేమెంట్‌ లేదా మినిమమ్‌ డ్యూ అంటారు. అన్ని బ్యాంకులు/ ఎన్‌బీఎఫ్‌సీలు ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. మొత్తం బిల్లులో 5 శాతం దీని కింద చెల్లించాల్సి ఉంటుంది. (కార్డు వినియోగం, ఈఎంఐలపై ఇది ఆధారపడి ఉంటుంది) చాలామంది ‘మినిమమ్‌’ చెల్లిస్తే ఎలాంటి వడ్డీ పడదని అనుకుంటారు. అయితే అది వాస్తవం అదికాదు. కనీస చెల్లింపుల వల్ల పెనాల్టీలు, లేటు ఫీజుల నుంచి మాత్రమే మీకు ఊరట వస్తుంది. చెల్లించాల్సిన మొత్తానికి బ్యాంకు మీకు వడ్డీ విధిస్తుంది.

ఉదా: లోహిత్‌ అనే చిరుద్యోగి జూన్‌ నెలకు గానూ కార్డులో రూ.20 వేలు వాడుకున్నాడు అనుకుందాం. జులై నెలలో ఆ మొత్తం బిల్లు కట్టాల్సి ఉంటుంది. అయితే, ఆ నెల అతడి వద్ద డబ్బులు లేకపోతే మినిమమ్‌ బిల్లు కట్టేసి బయటపడొచ్చు. అంటే ఓ వెయ్యి రూపాయలు చెల్లిస్తే చాలు. ఆ తర్వాతి నెలలో రూ.19వేలతో పాటు దానికి బ్యాంకు విధించే వడ్డీ కలిపి చెల్లించాలి. ఆ నెల కూడా కొంత మొత్తం షాపింగ్‌ చేస్తే అది కూడా తర్వాతి నెల బిల్లింగ్‌లో చెల్లించాల్సి ఉంటుంది.

‘మినిమమ్‌’తో నష్టాలివే..

  • ఏదైనా వస్తువు తక్కువలో వచ్చిందనో, లేదంటే అవసరమనో క్రెడిట్‌ కార్డు ఉపయోగించి కొంటారు చాలామంది. చాలా తక్కువకే కొన్నానని మనసులో అప్పటివరకు ఫీలవుతుంటారు. కానీ, ఆ బిల్లును మినిమమ్‌ బిల్లుగా చెల్లించడం వల్ల వచ్చిన లాభం కోల్పోయినట్లే. మినిమమ్‌ బిల్లు కట్టగా మిగిలిపోయిన మొత్తంపై వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఇలా ఓ రెండు, మూడు దఫాలు చేస్తే మీరు తక్కువకే వస్తువు కొన్నామన్న సంబరం కాస్తా ఆవిరైపోతుంది. పైగా అదనంగా చెల్లించిన విషయాన్ని ఆలస్యంగా గ్రహించి చింతించాల్సి ఉంటుంది.
  • క్రెడిట్‌ కార్డు ఉందంటే మన చేతిలో అత్యవసర నిధి ఉన్నట్లే (అలాగని అత్యవసర నిధి ఉండకూడదని కాదు). ఇప్పటికీ చాలా మందికి అత్యవసర నిధిని దాచుకునే అలవాటు లేదు. అలాంటి వారికి క్రెడిట్‌కార్డు ఆపత్కాలంలో పనిచేస్తుంది. ఒకవేళ మీరు క్రెడిట్‌ కార్డును మినిమమ్‌ బిల్లు కట్టుకుంటూ వెళితే అత్యవసర సమయాల్లో మీకు ఇబ్బందులు ఎదురవ్వొచ్చు. దీంతో ఆ సమయంలో క్రెడిట్‌ కార్డులో లిమిట్‌ లేకపోవడం వల్ల ఎక్కువ వడ్డీకి అప్పులు చేయాల్సి రావొచ్చు.
  • ప్రతిసారీ మినిమమ్‌ బిల్లు కట్టడం, ఆపై ప్రతినెలా ఎంతో కొంత మళ్లీ షాపింగ్‌ చేయడం వల్ల క్రెడిట్‌కార్డు బిల్లు పెరిగిపోతుంది. దీనివల్ల మీరు అప్పుల ఊబిలోకి జారిపోయే ప్రమాదం ఉంది. పైగా క్రెడిట్‌ యుటిలైజేషన్‌ రేషియో 40 శాతం మించితే అది క్రెడిట్‌ స్కోరుపై ప్రభావం చూపుతుంది. కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని క్రెడిట్‌ కార్డు పట్ల కాస్త అప్రమత్తంగానే ఉండండి. సకాలంలో బిల్లులు చెల్లించినప్పుడే 45 రోజుల వడ్డీ రహిత పీరియడ్‌తో పాటు, రివార్డుల పాయింట్ల ప్రయోజనాలను ఆనందించొచ్చు.
Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని