‘ఆర్థిక సర్వే’కు ప్రాధాన్యత ఎందుకంటే..!

ప్రతి ఏటా కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టే ముందు రోజు ‘ఆర్థిక సర్వే’ నివేదిక విడుదల అవుతుంది. ఇందులో భాగంగానే కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఆర్థిక సర్వే

Updated : 29 Jan 2021 20:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏటా కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టే ముందు రోజు ‘ఆర్థిక సర్వే’ నివేదిక విడుదల అవుతుంది. అయితే, ఈ సారి రెండు రోజుల ముందుగానే కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఆర్థిక సర్వే 2020-21 నివేదికను విడుదల చేశారు. దేశ ఆర్థిక స్థితిగతులను కళ్లకు కట్టిచూపించే ఈ నివేదిక ఆధారంగానే బడ్జెట్ రూపకల్పన జరుగుతుంది. అందుకే ఆర్థిక మంత్రిత్వ శాఖ రూపొందించే ఈ ‘ఆర్థిక సర్వే’కు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది.

ఏమిటీ ఈ ఆర్థిక సర్వే..?
గడిచిన సంవత్సర కాలంలో దేశ ఆర్థిక పనితీరును..రాబోయే రోజుల్లో ఆర్థికంగా ఎదురయ్యే సవాళ్లను ముందుగానే అంచనా వేసి చెప్పేదే ఈ ఎకనమిక్‌ సర్వే. దేశ ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేసేదిగా భావించే ఈ సర్వే ఆధారంగానే ప్రతిఏటా బడ్జెట్‌ రూపకల్పన జరుగుతుంది. ఆర్థిక మంత్రిత్వశాఖ రూపొందించే ఈ సర్వే.. రానున్న రోజుల్లో దేశం ముందున్న సవాళ్లు, వాటిని ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యలను ముందుగానే అంచనా వేసి పలు సూచనలు చేస్తుంది. ఆర్థిక వ్యవహారాలశాఖలోని ఎకనమిక్‌ విభాగం ప్రతిఏటా ఈ నివేదికను రూపొందిస్తుంది. ప్రస్తుత కేంద్ర ముఖ్య ఆర్థిక సలహాదారుగా ఉన్న కృష్ణమూర్తి సుబ్రమణియన్‌ ఆధ్వర్యంలో ఈ నివేదికను తయారుచేశారు. ఫిబ్రవరి 1వ తేదీన ప్రారంభమయ్యే బడ్జెట్‌ సమావేశాల ముందు ఈ నివేదికను విడుదల చేస్తారు.

ప్రాధాన్యత ఎందుకంటే..?
బడ్జెట్‌ రూపకల్పనలో కీలక పాత్ర పోషించే ఈ సర్వే దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. కేవలం దేశ ఆర్థిక పరిస్థితులను తెలుపడమే కాకుండా ప్రధాన రంగాలైన వ్యవసాయ, పారిశ్రామికోత్పత్తి, మౌలిక సదుపాయాలు, ఎగుమతి దిగుమతులు, విదేశీ మారక నిల్వలు, నగదు చలామణి, ఉద్యోగాలు, ధరల పెరుగుదల వంటి ఆర్థిక అంశాలను కూడా వివరిస్తుంది. ప్రభుత్వం అమలుచేస్తోన్న అభివృద్ధి కార్యక్రమాల స్థితిగతులు, ప్రభుత్వ విధాన నిర్ణయాలు, వాటివల్ల వస్తోన్న ఫలితాలనూ ఈ సర్వే విశ్లేషిస్తుంది. వీటితో పాటు వచ్చే ఏడాది ఎదురయ్యే ఆర్థిక సవాళ్లు, వాటిని ఎదుర్కొనే వ్యూహాలను కూడా ఈ సర్వే సూచిస్తుండడంతో దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది.

బడ్జెట్‌ Vs ఎకనమిక్‌ సర్వే..
కేంద్ర బడ్జెట్‌లో వివిధ రంగాల్లో రాబడి, ఖర్చుల కేటాయింపులను మాత్రమే పేర్కొంటారు. కానీ ఆర్థిక సర్వేలో మాత్రం గత సంవత్సరం దేశ ఆర్థిక వ్యవస్థ పనితీరు విశ్లేషణ, రాబోయే రోజుల్లో ఎదురయ్యే సవాళ్లు, చేపట్టాల్సిన సంస్కరణలను ప్రముఖంగా ప్రస్తావిస్తారు. అందుకే ఈ ఆర్థిక సర్వే ఆధారంగానే కేంద్ర బడ్జెట్‌ను రూపొందిస్తారు.

ఎన్నో ఏళ్ల ఆనవాయితీ..!
బడ్జెట్‌ కన్నా ముందురోజే ఆర్థిక సర్వేను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడం ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. మొట్టమొదటిసారిగా ఈ ఆర్థిక సర్వేను 1950-51 ఆర్థిక సంవత్సరంలో పార్లమెంటులో ప్రవేశపెట్టారు. 1964 వరకు సాధారణ బడ్జెట్‌తోనే కలిపి ప్రవేశపెట్టేవారు. కానీ, 1964 నుంచి దీన్ని బడ్జెట్‌ కన్నా ముందురోజే ప్రత్యేకంగా ప్రవేశపెడుతున్నారు. కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపుల ప్రతిపాదనలను తేలికగా అర్థం చేసుకోవడం కోసమే ఆర్థిక సర్వేను ప్రత్యేకంగా విడుదల చేస్తున్నారు. రెండు విభాగాల్లో ప్రవేశపెట్టే ఈ సర్వేలో.. తొలి విభాగంలో భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రముఖంగా ప్రస్తావించగా, రెండో విభాగంలో మాత్రం గత ఏడాదికి సంబంధించిన దేశ ఆర్థిక పనితీరును సవివరంగా పొందుపరుస్తారు.

ఇవీ చదవండి..
లోక్‌సభ ముందుకు ఆర్థిక సర్వే
ఆర్థిక సర్వే: 2021-22లో రెండంకెల వృద్ధి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని