
Zomato: జొమాటో నుంచి NBFC.. మరో రెండు స్టార్టప్‌ల్లో పెట్టుబడులు
దిల్లీ: ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో (Zomato) ఆర్థికసేవల రంగంలోకి అడుగుపెడుతోంది. త్వరలో ఓ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (ఎన్బీఎఫ్సీ)ని నెలకొల్పనుంది. అలానే స్టార్టప్స్‌లో పెట్టుబడులను సైతం వేగవంతం చేసింది. తాజాగా మరో రెండు కంపెనీల్లో వాటాలు కొనుగోలు చేసింది. ఈ వివరాలను బీఎస్ఈ ఫైలింగ్‌లో ఆ కంపెనీ శుక్రవారం తెలియజేసింది.
రూ.10 కోట్లతో ఎన్బీఎఫ్సీని ఏర్పాటు చేయాలని జొమాటో భావిస్తోంది. దీనికి ఏ పేరు పెట్టాలనేది కంపెనీ ఇంకా నిర్ణయించలేదు. దీనికి కేంద్ర కార్పొరేట్ వ్యవహారాలు మంత్రిత్వశాఖ, ఆర్బీఐ నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది. ఇక పెట్టుబడుల విషయానికొస్తే జొమాటో తాజాగా డిజిటల్ అడ్వర్టైజింగ్ కంపెనీ యాడ్ఆన్మో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో రూ.112.21 కోట్లతో 19.48 శాతం వాటాను కొనుగోలు చేసింది. అర్బన్ పైపర్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్‌లో రూ37.39 కోట్లతో 5 శాతం వాటాను కొనుగోలు చేసింది. పెద్ద ఎత్తున వచ్చే ఆర్డర్లను సులువుగా హ్యాండిల్ చేయడానికి రెస్టారెంట్లకు అర్బన్పైపర్ సాఫ్ట్వేర్ సేవలను అందిస్తోంది. ఈ రెండు కంపెనీలూ తమ వ్యాపారాభివృద్ధికి దోహదం చేస్తాయని జొమాటో ఫైలింగ్‌లో పేర్కొంది.
మరోవైపు గతేడాది స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టయినప్పటి నుంచి ఇప్పటి వరకు జొమాటో పలు స్టారప్ల్లో పెట్టుబడులు పెట్టింది. షిప్‌రాకెట్, సామ్‌సెట్ టెక్నాలజీస్, క్యూర్ ఫిట్ వంటి సంస్థల్లో వాటాలు కొనుగోలు చేసింది. రాబోయే రెండేళ్ల ఒక బిలియన్ డాలర్లను వివిధ స్టార్టప్‌ల్లో పెట్టుబడులుగా పెట్టాలన్న లక్ష్యానికి అనుగుణంగా ముందుకెళుతోంది. మరోవైపు స్టాక్ మార్కెట్లో కంపెనీ షేరు విలువ రోజురోజుకూ పడిపోతోంది. దీంతో ఇన్వెస్టర్ల నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ తాజా పెట్టుబడులను పెట్టడం గమనార్హం.