Atal Setu: అటల్‌ సేతుపై బోల్తాపడ్డ కారు.. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

అటల్‌ సేతుపై అదుపుతప్పి ఓ కారు బోల్తాపడింది. ఈ ప్రమాద దృశ్యాలు వంతెనపై ప్రయాణిస్తున్న మరో వాహనం డ్యాష్‌కామ్‌లో రికార్డయ్యాయి. 

Updated : 22 Jan 2024 12:06 IST

ముంబయి: దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో నూతనంగా నిర్మించిన ‘అటల్‌ సేతు’ (Atal Setu)పై తొలి ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలు సహా చిన్నారులు గాయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. పోలీసుల కథనం ప్రకారం.. ఆదివారం మధ్యాహ్నం ముంబయి నుంచి రాయ్‌గఢ్‌ జిల్లాలోని చిర్లేకు వెళుతున్న కారు అటల్‌ సేతుపైకి చేరుకోగానే.. ముందు వెళుతున్న మరో వాహనాన్ని దాటేందుకు యత్నించింది. దీంతో అదుపు తప్పి రెయిలింగ్‌ను ఢీకొని పల్టీలు కొట్టింది. ప్రయాణికులు గాయాలతో బయటపడ్డారు. 

ప్రమాదం తీవ్రత మరింత ఎక్కువగా ఉంటే వాహనం సముద్రంలో పడేదని అక్కడి వారు తెలిపారు. ఈ ఘటన మొత్తం వంతెనపై వెళుతున్న మరో కారు డ్యాష్‌కామ్‌లో రికార్డు కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అటల్‌ సేతు ప్రారంభించిన తర్వాత ఇదే తొలి ప్రమాదమని అధికారులు తెలిపారు. గాయపడిన మహిళలు, చిన్నారులను ముంబయి ట్రాఫిక్‌ పోలీసులు ఆసుపత్రికి తరలించారు. 

ముంబయిలోని సేవ్రీ నుంచి రాయ్‌గఢ్‌ జిల్లాలోని నవశేవాను కలుపుతూ నిర్మించిన ఈ వంతెనను జనవరి 12న ప్రధాని మోదీ ప్రారంభించారు. ‘ముంబయి ట్రాన్స్‌హార్బర్‌ లింక్‌ ’ (MTHL)గా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ నిర్మాణం రెండు ప్రాంతాల మధ్య దూరాన్ని గంటన్నర నుంచి 20 నిమిషాలకు తగ్గించింది. ఆరు లేన్లుగా నిర్మించిన ఈ వంతెనపై గరిష్ఠ వేగం 100 కి.మీ.లు కాగా, కనిష్ఠ వేగం 40 కి.మీ.లుగా నిర్దేశించారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలకు అనుమతి లేదు. దీని మొత్తం పొడవు 21.8 కి.మీ.లు కాగా.. 16 కి.మీ.లకు పైగా అరేబియా సముద్రంపైనే ఉండటం విశేషం.    


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని