Fake Mail: నకిలీ మెయిల్‌.. సొమ్మంతా స్వాహా

ప్రముఖ సంస్థలు.. జాతీయ, అంతర్జాతీయంగా వ్యాపారాలు. రూ.కోట్లల్లో లావాదేవీలు. గోప్యంగా జరిగే వ్యవహారాల్లోనూ సైబర్‌ నేరగాళ్లు చొరబడుతున్నారు.  వేల కిలోమీటర్ల దూరంలో ఉండి క్షణాల్లో రూ.లక్షలు కాజేస్తున్నారు.

Updated : 13 Sep 2022 09:30 IST

ఈనాడు, హైదరాబాద్‌ : ప్రముఖ సంస్థలు.. జాతీయ, అంతర్జాతీయంగా వ్యాపారాలు. రూ.కోట్లల్లో లావాదేవీలు. గోప్యంగా జరిగే వ్యవహారాల్లోనూ సైబర్‌ నేరగాళ్లు చొరబడుతున్నారు.  వేల కిలోమీటర్ల దూరంలో ఉండి క్షణాల్లో రూ.లక్షలు కాజేస్తున్నారు. ఈ ఏడాది నగర సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు సుమారు 10 ఫిర్యాదులు అందాయి. ఆన్‌లైన్‌ బ్యాంకు లావాదేవీలను తమ చేతుల్లోకి తీసుకొని సొత్తు స్వాహా చేస్తున్నారు.

అక్షరం మార్చి..: బహుళజాతి సంస్థలు, ఫార్మా, రక్షణ, పరిశోధన, ఐటీ సంస్థలు, వ్యాపారులే మోసగాళ్ల లక్ష్యం. నైజీరియాకు చెందిన హ్యాకర్లు ప్రముఖ కంపెనీల వెబ్‌సైట్లు, ఈ-మెయిళ్లను హ్యాక్‌ చేస్తారు. ఈ-మెయిల్‌ ద్వారా ఆర్థిక లావాదేవీలు, ఇన్‌వాయిస్‌ వివరాలను ముందుగానే సేకరిస్తారు. సరకు ఎగుమతి, దిగుమతుల అంశాలను గుర్తించి.. దానికి తగినట్లుగా ఈ-మెయిళ్లు, వెబ్‌సైట్స్‌ పేర్లలోని అక్షరాలను అటు ఇటుగా మార్చుతారు.  నకిలీ ఈ-మెయిల్స్‌తో ముగ్గులోకి దింపి.. డబ్బు తమ ఖాతాల్లోకి మళ్లించుకుంటారు.  చివరకు అసలు సంస్థలు తమకు నగదు చేరలేదని చెప్పడంతో తాము మోసపోయినట్లు గుర్తిస్తున్నారు.

ఎలా మోసపోయారంటే.. అమీర్‌పేట్‌కు చెందిన ప్రముఖ సంస్థ కార్లు, ఆటోల సామగ్రిని చైనా నుంచి దిగుమతి చేసుకుంటుంది. గత నెల చైనా సంస్థకు ఆర్డరిచ్చారు. రూ.1.19 కోట్లు పంపితే సరకు పంపుతామంటూ ఈ-మెయిల్‌కు ఇన్‌వాయిస్‌ పంపారు. కొన్ని రోజులకు తాము గతంలో పంపిన బ్యాంకు ఖాతా స్తంభించిపోయిందని.. మరో ఖాతాకు నగదు పంపాలంటూ దానిలోని సారాంశం. నిజమని భావించిన సంస్థ.. కొత్త బ్యాంకు ఖాతాకు నగదు బదిలీ చేశారు. రోజులు గడుస్తున్నా సరకు చేరకపోవటంతో ఆ దేశ సంస్థకు ఫోన్‌ చేసి అడిగారు. బాధితుడు తాను డబ్బు పంపిన ఖాతాను పరిశీలించటంతో అసలు విషయం వెలుగు చూసింది. తాను పంపిన సొమ్ము లండన్‌లోని ఖాతాకు చేరినట్లు గుర్తించి సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంతోష్‌నగర్‌లో వైద్య పరికరాలు విక్రయించే సంస్థ. తమకు అవసరమైన సామగ్రిని అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటుంది.  నైజీరియన్లు మెయిల్‌ను హ్యాక్‌ చేసి.. తమ బ్యాంకు ఖాతాకు డబ్బు పంపమంటూ రూ.46 లక్షలు జమ చేయించుకున్నారు. అమెరికాకు చెందిన సంస్థ మూడు, నాలుగు నెలలకోసారి బ్యాంకు ఖాతాలు మార్చే అలవాటు ఉండటంతో నగర వ్యాపారి తేలికగా నమ్మి సొమ్ము పోగొట్టుకున్నాడు. తాజాగా కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ అనుబంధ సంస్థ మిధాని అల్యూమినియం కోసం కెనడా సంస్థకు ఆర్డరిచ్చారు. నిర్దేశిత సమయానికి సరకు మిధాని చేరింది. కంపెనీకి చెల్లించాల్సిన రూ.40 లక్షలు మరో బ్యాంకు ఖాతాకు జమచేయమంటూ మెయిల్‌కు వర్తమానం పంపారు. నిజమని భావించి ప్రతినిధులు సొమ్ము పంపారు. కెనడా సంస్థ తమకు నగదు అందలేదని, త్వరగా పంపమని ఒత్తిడి చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.


నిర్ధారించుకున్నాకే లావాదేవీలు

నైజీరియన్‌ హ్యాకర్లు ఈ తరహా మోసాలకు పాల్పడుతుంటారు. సంస్థలు, వ్యాపారులు ఆన్‌లైన్‌లో నిర్వహించే లావాదేవీల్లోకి చేరి డబ్బు కాజేస్తున్నారు. నగదు బదిలీ చేసేటప్పుడు ఈ-మెయిల్‌, బ్యాంకు ఖాతా వివరాలను నిశితంగా పరిశీలించాలి. సంబంధిత సంస్థలతో మాట్లాడి నిర్ధారించుకున్నాకే లావాదేవీలు నిర్వహించాలి. ఒకటి, రెండు అక్షరాలను మార్చి అసలు మెయిల్‌గా నమ్మిస్తుంటారు.

- కె.వి.ఎం.ప్రసాద్‌, ఏసీపీ, నగర సైబర్‌క్రైమ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని