కారుపై ‘పొక్లెయిన్‌’ పిడుగు!.. ముగ్గురి దుర్మరణం.. ఇద్దరికి తీవ్రగాయాలు

దేవాలయానికి వెళ్లి తిరిగివస్తున్న ఓ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం ఛిన్నాభిన్నం చేసింది. నిజామాబాద్‌ జిల్లాలో మంగళవారం రాత్రి జరిగిన ఈ దుర్ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు.

Published : 29 Mar 2023 05:44 IST

భీమ్‌గల్‌, న్యూస్‌టుడే: దేవాలయానికి వెళ్లి తిరిగివస్తున్న ఓ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం ఛిన్నాభిన్నం చేసింది. నిజామాబాద్‌ జిల్లాలో మంగళవారం రాత్రి జరిగిన ఈ దుర్ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు. భీమ్‌గల్‌ ఎస్సై రాజ్‌భరత్‌రెడ్డి కథనం ప్రకారం... మోర్తాడ్‌ మండలం దొన్కల్‌కు చెందిన లక్ష్మి తన కుటుంబ సభ్యులతో బడాభీమ్‌గల్‌ ఎల్లమ్మ వద్దకు మొక్కులు తీర్చుకోవడానికి వెళ్లారు. కారులో మొత్తం ఏడుగురితో తిరుగు ప్రయాణమయ్యారు. మంగళవారం రాత్రి భీమ్‌గల్‌ పట్టణంలోని విద్యుత్తు ఉపకేంద్రం వద్ద ట్రాక్టర్‌ ట్రాలీపై ఉన్న పొక్లెయిన్‌ వారి కారుపై పడడంతో అందులో ఉన్న లక్ష్మి కుమారుడు ముప్పారపు రాజేశ్వర్‌ (45), కోడలు జ్యోతి (42), కుమార్తె రమ (41) అక్కడిక్కడే మృతి చెందారు. నుజ్జునుజ్జయిన కారు నుంచి మృతదేహాలను, క్షతగాత్రులను బయటికి తీసేందుకు 108 సిబ్బంది గంటసేపు శ్రమించాల్సి వచ్చింది. తీవ్రంగా గాయపడిన లక్ష్మి, అల్లుడు చుక్కారపు రాజేశ్వర్‌ను 108 అంబులెన్సులో నిజామాబాద్‌ జనరల్‌ ఆసుపత్రికి తరలించారు. ముప్పారపు రాజేశ్వర్‌, జ్యోతి దంపతులకు కుమార్తె, కుమారుడు సంతానం. తల్లిదండ్రులను కోల్పోయి ఆ ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారారు. ట్రాక్టర్‌ ట్రాలీపై నుంచి పొక్లెయిన్‌.. ఎదురుగా వస్తున్న కారుపై ఎలా పడింది? కారు ట్రాక్టర్‌ ట్రాలీని ఢీకొట్టిందా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు