Cybercrime: సైబర్‌ దొంగల కొత్త అడ్డా.. నుహ్‌

హరియాణాలోని నుహ్‌ జిల్లా.. సైబర్‌ నేరప్రపంచంలో మరో కొత్త అడ్డాగా మారుతోంది. రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌, ఝార్ఖండ్‌లోని జామ్‌తారాలను తలదన్నే రీతిలో సైబర్‌ మోసగాళ్లకు హబ్‌గా మారింది. ఇది భౌగోళికంగా హరియాణా, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌ సరిహద్దుల మధ్య ఉంది.

Updated : 12 Jun 2023 11:23 IST

హరియాణాలో ఛేదించిన పోలీసులు
14 గ్రామాలపై 5 వేల మంది బలగాలతో దాడి
భరత్‌పూర్‌, జామ్‌తారాలను తలదన్నేలా మోసాలు
28 వేల నేరాలు.. రూ.100 కోట్లు స్వాహా
యూపీ, రాజస్థాన్‌ తర్వాత తెలంగాణ బాధితులే అధికం

2023 ఏప్రిల్‌ 26. గురుగ్రామ్‌లోని పోలీస్‌ రిజర్వు బెటాలియన్‌ కేంద్రం. హరియాణాలోని వివిధ ప్రాంతాలకు చెందిన దాదాపు అయిదువేల మంది పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఏ ఆపరేషన్‌ కోసం వచ్చామనేది వారిలో ఏ ఒక్కరికీ తెలియదు. స్థానిక పోలీసులకైతే సమాచారమే లేదు. మరుసటి రోజు తెల్లవారుజామున 3.30 గంటలకు ఆపరేషన్‌ ప్రారంభమైంది. బలగాలను 102 బృందాలుగా విభజించారు. ఏకకాలంలో 14 గ్రామాల్లోని 300 ప్రాంతాల్లో దాడులు చేసి 125 మంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. వారిలో 65 మందిని కరడుగట్టిన నేరస్థులుగా గుర్తించారు. నిందితుల్లో ఎక్కువ మంది 18-35 ఏళ్ల లోపు యువకులే. ఈ తరహా భారీ దాడి దేశంలోనే తొలిసారి కావడం గమనార్హం. దేశవ్యాప్తంగా సుమారు 28 వేల సైబర్‌నేరాల్లో ఈ ముఠాలు రూ.100 కోట్లు కొల్లగొట్టినట్లు తేలింది. డబ్బు పోగొట్టుకున్న బాధితుల్లో ఉత్తర్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌ తర్వాత తెలంగాణవారే అధికంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

హరియాణాలోని నుహ్‌ జిల్లా.. సైబర్‌ నేరప్రపంచంలో మరో కొత్త అడ్డాగా మారుతోంది. రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌, ఝార్ఖండ్‌లోని జామ్‌తారాలను తలదన్నే రీతిలో సైబర్‌ మోసగాళ్లకు హబ్‌గా మారింది. ఇది భౌగోళికంగా హరియాణా, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌ సరిహద్దుల మధ్య ఉంది. దేశరాజధాని దిల్లీ నుంచి కేవలం రెండు గంటల్లోనే చేరుకునే దూరంలో ఉన్న ఈ ప్రాంతం.. దేశంలో వెెనకబడిన జిల్లాల్లో ఒకటి. మూడేళ్ల కిందటి వరకు ఈ జిల్లాలోని నేరస్థులు ఏటీఎంల్లో చోరీలు, సెల్‌ఫోన్‌ దొంగతనాలు, వాహనాలను ఎత్తుకెళ్లడం, నకిలీ బంగారం అంటగట్టడం వంటి మోసాలకు పాల్పడేవారు. కరోనా సమయంలో ఇళ్లకే పరిమితం కావడంతో వీరి దృష్టి సైబర్‌ నేరాల వైపు మళ్లింది. సమీపంలోనే ఉన్న భరత్‌పూర్‌తో నుహ్‌ యువకులకు వివాహ సంబంధాలుండటంతో ఆ ముఠాల నుంచి మెలకువలు నేర్చుకుని.. మోసాలు మొదలుపెట్టారు. ఈ ముఠాలు ప్రధానంగా ఆన్‌లైన్‌లో మోసపూరిత ప్రకటనలు (ఫేస్‌బుక్‌ బజార్‌ లేదా ఓఎల్‌ఎక్స్‌ వేదికల ద్వారా మోసాలు) పోస్ట్‌ చేసి డబ్బు కొట్టేయడంతోపాటు సెక్స్‌టార్షన్‌ (వాట్సప్‌లో అమ్మాయిలతో నగ్నంగా వీడియోకాల్స్‌ చేయించి బ్లాక్‌మెయిల్‌ ద్వారా దోచుకోవడం)కు పాల్పడుతున్నట్లు తాజా దర్యాప్తులో వెల్లడైంది.

రెండు నెలల పథక రచన.. 200 ఫైళ్ల వడబోత

‘ఆపరేషన్‌ నుహ్‌’ను చేపట్టేందుకు హరియాణా పోలీసులు రెండు నెలలపాటు పథకరచన చేశారు. మొదట ఆ రాష్ట్రంలోని దాదాపు 200 మంది సైబర్‌ నేరస్థుల ఫైళ్లను వడబోశారు. నుహ్‌ జిల్లాలో రికార్డయిన ఫోన్‌కాల్స్‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకుని నేరస్థుల జాతకాల్ని సేకరించారు. ఇందుకోసం సైబర్‌ నిపుణులతో వర్క్‌షాప్‌లు నిర్వహించారు. నేరస్థులకు ఉప్పందుతుందనే అనుమానంతో నుహ్‌ జిల్లా పోలీసులకు ఆపరేషన్‌ విషయం తెలియకుండా జాగ్రత్తపడ్డారు. తక్కువ మంది పోలీసులతో వెళ్తే నేరస్థులు దాడి చేసే ప్రమాదం ఉండటంతో భారీగా బలగాల్ని సమీకరించారు. దాడుల్లో 66 స్మార్ట్‌ఫోన్లు, 65 సిమ్‌కార్డులు, 128 డెబిట్‌ కార్డులు, 5 పాన్‌కార్డులను స్వాధీనం చేసుకున్నారు. వీటన్నిటినీ నిందితులు నకిలీ పేర్లతోనే తీసుకున్నట్లు గుర్తించారు.


మారుపేర్లతో 347 సిమ్‌లు.. వేల మందికి బురిడీ

* హరియాణా, పశ్చిమబెంగాల్‌, అస్సాం, రాజస్థాన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌, ఒడిశా, దిల్లీ, పంజాబ్‌, తమిళనాడు, కర్ణాటకతోపాటు తెలుగు రాష్ట్రాల్లో యాక్టివేట్‌ చేసిన 347 సిమ్‌లను మోసాలకు వినియోగించినట్లు గుర్తించారు.

* 29 బ్యాంకుల్లో 219 ఖాతాలు తెరిచి, 140 యూపీఐ ఖాతాల్లో లావాదేవీలు నిర్వహించారు.

* దేశవ్యాప్తంగా వీరిపై ఇప్పటికే 1346 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.

* మొత్తం 27,798 కేసుల్లో ఉత్తర్‌ప్రదేశ్‌ (7,645), రాజస్థాన్‌ (3,225)ల తర్వాత తెలంగాణ (2,047)లోనే బాధితులు ఎక్కువగా ఉన్నారు.

* ఈ ముఠాలను పట్టుకున్నాక దేశంలో సైబర్‌నేరాల నమోదు కాస్త తగ్గడం గమనార్హం. ఏప్రిల్‌ 1-20 తేదీల మధ్య 5728 నేరాలు నమోదు కాగా.. మే 1-20 మధ్య కాలానికి అవి 4218కి తగ్గాయి.


ప్యాకేజీ రూపంలో బ్యాంకు ఖాతాలు

ఉద్యోగాలిప్పిస్తామంటూ యువతను ముఠాల్లో పనిచేసేందుకు ఆకర్షిస్తారు. వారితో బ్యాంకు ఖాతాలు తెరిపిస్తారు. ఆ సమయంలోనే నో యువర్‌ కస్టమర్‌ (కేవైసీ) వెరిఫికేషన్‌ పేరిట పూర్తి వివరాలను, ధ్రువపత్రాలను సేకరిస్తారు. వాటినే వినియోగించి దూరప్రాంతంలోని మరో బ్యాంకులో ఖాతాలు తెరుస్తారు. డెబిట్‌కార్డుతోపాటు ఆన్‌లైన్‌ ఖాతా క్రెడెన్షియల్స్‌ తమ వద్దకే చేరేలా చూసుకుంటారు. అనంతరం తమ వలకు చిక్కిన బాధితుల నుంచి ఆ ఖాతాల్లోకే డబ్బు బదిలీ చేయించుకుంటారు. దర్యాప్తు క్రమంలో పోలీసులు గుర్తించినా తాము దొరక్కుండా ఉండేందుకే ఈ తతంగం. ఇలా బ్యాంకుఖాతాలను ప్యాకేజీ రూపంలో సమకూర్చేందుకూ ప్రత్యేకంగా ముఠాలుండటం గమనార్హం. ఒకవేళ అరెస్టయినా.. కేసులను ఎదుర్కొనేందుకు నిందితులు భారీ ఫీజులిచ్చి లాయర్ల బృందాలను ముందే సిద్ధం చేసుకుంటున్నారు.


ఈనాడు, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని