Pakistan To Hyderabad: భార్య కోసం సరిహద్దులు దాటిన పాకిస్థానీ

ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కోసం ఓ పాకిస్థానీ దేశ సరిహద్దులు దాటొచ్చాడు. పాకిస్థాన్‌ నుంచి నేపాల్‌ మీదుగా భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించి హైదరాబాద్‌ చేరాడు.

Updated : 01 Sep 2023 11:38 IST

హైదరాబాద్‌లో అక్రమంగా ఏడాది కాలంగా నివాసం
ఆధార్‌ సంపాదించే క్రమంలో పోలీసులకు చిక్కిన నిందితుడు

ఈనాడు, హైదరాబాద్‌, కేశవగిరి, న్యూస్‌టుడే: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కోసం ఓ పాకిస్థానీ దేశ సరిహద్దులు దాటొచ్చాడు. పాకిస్థాన్‌ నుంచి నేపాల్‌ మీదుగా భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించి హైదరాబాద్‌ చేరాడు. అతని వ్యవహారం తొమ్మిది నెలల తర్వాత బయటపడింది. మరోవ్యక్తి పేరిట ఆధార్‌ కార్డు సంపాదించే క్రమంలో పోలీసులకు చిక్కినట్లు దక్షిణ మండల డీసీపీ సాయిచైతన్య గురువారం రాత్రి ఒక ప్రకటనలో వెల్లడించారు. అందులో ఉన్న ప్రకారం... పాకిస్థాన్‌లోని ఖైబర్‌ పఖ్తూంఖ్వా చెందిన ఫయాజ్‌ అహ్మద్‌(24) ఉపాధి కోసం 2018 డిసెంబరులో షార్జా వెళ్లాడు. అక్కడి సైఫ్‌జోన్‌లోని వస్త్ర పరిశ్రమలో పనికి కుదిరాడు. హైదరాబాద్‌ బహదూర్‌పుర ఠాణా పరిధిలోని కిషన్‌బాగ్‌కు చెందిన నేహ ఫాతిమా(29) సైతం ఉపాధి కోసం 2019లో షార్జా వెళ్లింది. అక్కడి మిలీనియం ఫ్యాషన్‌ పరిశ్రమలో ఉద్యోగం పొందేందుకు ఫయాజ్‌ సహకరించాడు. ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారి షార్జాలోనే 2019లో వివాహం చేసుకున్నారు. వారికి ఒక అబ్బాయి ఉన్నాడు. ఫాతిమా ఒక్కతే గతేడాది హైదరాబాద్‌ వచ్చి కిషన్‌బాగ్‌లోని అసఫ్‌ బాబానగర్‌లో ఉంటోంది. ఫయాజ్‌ పాకిస్థాన్‌ వెళ్లిపోయాడు. ఈ క్రమంలోనే ఫాతిమా తల్లిదండ్రులు జుబేర్‌ షేక్‌, అఫ్జల్‌ బేగం... ఫయాజ్‌ను సంప్రదించారు. హైదరాబాద్‌ రావాలని గుర్తింపు పత్రాలు వచ్చేలా చూసుకుంటామని హామీ ఇచ్చారు.

వీసా, ఇతరత్రా ఎలాంటి గుర్తింపు లేకున్నా ఫయాజ్‌ 2022 నవంబరులో పాకిస్థాన్‌ నుంచి నేపాల్‌ వెళ్లాడు. జుబేర్‌ షేక్‌, అఫ్జల్‌ బేగం ఇద్దరూ నేపాల్‌లోని కాఠ్‌మాండూ వెళ్లి ఫయాజ్‌ను కలిశారు. కొందరి సాయంతో సరిహద్దులు దాటించి భారత్‌కు తీసుకొచ్చారు. అనంతరం కిషన్‌బాగ్‌లో అక్రమంగా ఆవాసం కల్పించారు. అతనికి ఆధార్‌ కార్డు ఇప్పించి స్థానికుడిలా నమ్మించేందుకు పథకం వేశారు. మాదాపూర్‌లో ఒక ఆధార్‌ కేంద్రానికి తీసుకెళ్లి తమ కుమారుడు మహ్మద్‌ గౌస్‌ పేరిట రిజిస్టర్‌ చేసేందుకు ప్రయత్నించారు. ఈ మేరకు నకిలీ జనన ధ్రువపత్రం సమర్పించారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఫయాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని పాకిస్థాన్‌ పాస్‌పోర్టు గడువు ముగిసినట్లు తేలింది. జుబేర్‌, అఫ్జల్‌బేగం ఇద్దరూ పరారీలో ఉన్నారు. నిందితుణ్ని కౌంటర్‌ ఇంటలిజెన్స్‌, కేంద్ర నిఘావర్గాలు విచారించాయి. ఉద్దేశపూర్వకంగా సరిహద్దులు దాటాడా.. కుట్రకోణం ఏమైనా ఉందా.. అని లోతుగా విచారిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని