సామాజిక మాధ్యమాల్లో గొప్పలు.. లంచాల కోసం తప్పులు!

ఆమె ప్రభుత్వ ఉద్యోగి.. ఆదివారం వస్తే వ్యవసాయ పనులకు వెళ్తూ.. వచ్చిన కూలి డబ్బులతో ఇతరులకు సాయం చేస్తున్నట్లు, ట్రస్టు నిర్వహిస్తున్నానంటూ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేసుకున్న ఆమె లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు.

Published : 23 Mar 2024 05:21 IST

అనిశాకు చిక్కిన సబ్‌రిజిస్ట్రార్‌ తస్లీమా

ఈనాడు, మహబూబాబాద్‌ - మహబూబాబాద్‌, నెహ్రూసెంటర్‌, న్యూస్‌టుడే: ఆమె ప్రభుత్వ ఉద్యోగి.. ఆదివారం వస్తే వ్యవసాయ పనులకు వెళ్తూ.. వచ్చిన కూలి డబ్బులతో ఇతరులకు సాయం చేస్తున్నట్లు, ట్రస్టు నిర్వహిస్తున్నానంటూ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేసుకున్న ఆమె లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. ఇంటి స్థలం రిజిస్ట్రేషన్‌ కోసం వచ్చిన ఓ వ్యక్తి నుంచి ముడుపులు తీసుకుంటున్న మహబూబాబాద్‌ సబ్‌రిజిస్ట్రార్‌ తస్లీమా, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి ఎ.వెంకట్‌ను అనిశా అధికారులు శుక్రవారం పట్టుకున్నారు. వరంగల్‌ రేంజ్‌ అనిశా డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల మేరకు.. దంతాలపల్లి మండలం దాట్ల గ్రామానికి చెందిన గుండగాని హరీష్‌ దంతాలపల్లిలో ఎకరం 28 గుంటలు వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు. ఇందులో 128 గజాల ఇంటి స్థలం రిజిస్ట్రేషన్‌ కోసం ఈ నెల మొదటి వారంలో సబ్‌రిజిస్ట్రార్‌ తస్లీమాను సంప్రదించగా.. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి వెంకట్‌ను కలిస్తే పూర్తి వివరాలు చెబుతారని పంపించారు. డాక్యుమెంటేషన్‌ ఫీజు కాకుండా గజానికి రూ.200 అదనంగా ఇవ్వాలని వెంకట్‌ డిమాండ్‌ చేశారు. దీంతో ఆ సొమ్ము ఇవ్వలేనని చెప్పడంతో రిజిస్ట్రేషన్‌ చేసేందుకు వారు అంగీకరించలేదు. రెండు, మూడు సార్లు కార్యాలయం చుట్టూ తిరిగి విసుగుచెందిన హరీష్‌.. వరంగల్‌లోని అనిశా కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అనంతరం సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్లి గజానికి రూ.150 ఇచ్చేందుకు ఒప్పందం చేసుకొని స్లాట్‌ నమోదు చేసుకున్నారు. శుక్రవారం సాయంత్రం హరీష్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి వెళ్లి ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి వెంకట్‌కు రూ.19,200 ఇస్తుండగా.. అనిశా అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇవే కాకుండా అదనంగా లెక్కలు లేకుండా రూ.1.72 లక్షలు వెంకట్‌ వద్ద ఉన్నాయి. వాటినీ స్వాధీనం చేసుకొని సబ్‌రిజిస్ట్రార్‌ తస్లీమా, వెంకట్‌లను అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేశామని.. శనివారం న్యాయస్థానంలో హాజరు పరుస్తామని అనిశా అధికారులు తెలిపారు. అనిశా ఇన్‌స్పెక్టర్లు శ్యాంసుందర్‌, ఎస్‌.రాజు, సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని