గోవా జైల్లో ఉన్న డ్రగ్‌ డాన్‌ ఫైజల్‌ అరెస్టు

పంజాగుట్ట డ్రగ్స్‌ కేసులో మరో ప్రధాన నిందితుడిని అరెస్టు చేశారు. గోవా డ్రగ్స్‌ నెట్‌వర్క్‌లో కీలకంగా వ్యవహరించే నైజీరియన్‌ ఇవాల ఉడోక స్టాన్లీకి సహచరుడు మహ్మద్‌ ఉస్మాన్‌ అలియాస్‌ ఫైజల్‌(29)ను తాజాగా అదుపులోకి తీసుకున్నారు.

Updated : 27 Mar 2024 06:00 IST

పీటీ వారెంటుపై నగరానికి తీసుకొచ్చిన పంజాగుట్ట పోలీసులు
కొల్వాలే జైల్లోనే రిమాండు చేయాలన్న నాంపల్లి కోర్టు
ఏడు రోజుల కస్టడీ కోరుతూ తాజాగా పిటిషన్‌ దాఖలు

ఈనాడు, హైదరాబాద్‌: పంజాగుట్ట డ్రగ్స్‌ కేసులో మరో ప్రధాన నిందితుడిని అరెస్టు చేశారు. గోవా డ్రగ్స్‌ నెట్‌వర్క్‌లో కీలకంగా వ్యవహరించే నైజీరియన్‌ ఇవాల ఉడోక స్టాన్లీకి సహచరుడు మహ్మద్‌ ఉస్మాన్‌ అలియాస్‌ ఫైజల్‌(29)ను తాజాగా అదుపులోకి తీసుకున్నారు. గోవాలోని కొల్వాలే జైల్లో విచారణ ఖైదీగా ఉంటూ డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న ఇతన్ని నాలుగైదు రోజుల క్రితం పీటీ వారెంటుపై నగరానికి తీసుకొచ్చారు. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపర్చగా కేసు పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోనే ఉన్నా నిందితుడిని గోవాలోని కొల్వాలే జైలులోనే రిమాండులో ఉంచాలని న్యాయమూర్తి ఉత్తర్వులిచ్చారు. దీంతో పోలీసులు ఫైజల్‌ను తిరిగి అక్కడికే తరలించారు. ఫైజల్‌ను ఏడు రోజుల కస్టడీకి కోరుతూ పంజాగుట్ట పోలీసులు మంగళవారం నాంపల్లి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

మరో ఇద్దరి గుర్తింపు

పంజాగుట్ట కేసులో పోలీసులు మరో ఇద్దరు నిందితుల్ని గుర్తించారు. గోవాలో క్యాబ్‌ డ్రైవర్లుగా పనిచేసే రాజు, జేవియర్‌లు స్టాన్లీ నెట్‌వర్క్‌లో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు  తేల్చారు. స్టాన్లీ ఫోన్‌లోని సమాచారం, ఇతర సాంకేతిక ఆధారాలతో రాజు, జేవియర్‌ను త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని చెప్పారు.

రెండు కేసులకు లింకు ఎలాగంటే..

టీఎస్‌ న్యాబ్‌, పంజాగుట్ట పోలీసులు దేశవ్యాప్తంగా డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ చేస్తున్న నైజీరియన్‌ స్టాన్లీని ఫిబ్రవరి రెండో వారంలో అరెస్టు చేశారు. అతన్ని విచారించగా.. గోవాలోని కొల్వాలే జైలులో ఉండే నైజీరియన్‌ ఆంటోనియో ఒబింటా అలియాస్‌ ఓక్రా, ఫైజల్‌ పేర్లు బయటపడ్డాయి.
నీ ఇదే సమయంలో గచ్చిబౌలిలోని రాడిసన్‌ హోటల్‌ డ్రగ్స్‌ పార్టీ వ్యవహారంలో ఫిబ్రవరి 25న మంజీరా గ్రూపు డైరెక్టర్‌ గజ్జల వివేకానంద్‌, అతని స్నేహితులు, సినీ దర్శకుడు క్రిష్‌, ఇద్దరు యువతులపై కేసు నమోదైంది.

  • పార్టీకి కొకైన్‌ సరఫరాపై ఆరా తీయగా మంజీరా గ్రూపు సంస్థల మాజీ ఉద్యోగి సయ్యద్‌ అబ్బాస్‌ అలీజాఫ్రీ.. వివేకానంద్‌కు అందిస్తున్నట్లు తెలిసింది.
  • అతన్ని అరెస్టు చేసి విచారించగా.. అత్తాపూర్‌లోని కేఫ్‌ రెస్టారెంట్‌లో క్యాషియర్‌గా పనిచేసే మీర్జా వహీద్‌ బేగ్‌ ద్వారా వస్తున్నట్లు తేలింది.
  • అతన్ని కూడా అరెస్టు చేసి విచారించగా.. ముషీరాబాద్‌కు చెందిన సయ్యద్‌ అబ్దుల్‌ రెహ్మాన్‌, దిల్లీకి చెందిన నరేంద్ర శివనాథ్‌ లింకు బయటపడింది.
  • వారిద్దరినీ ఈ నెల 20న అరెస్టు చేసినప్పుడు గోవా నుంచి ఫైజల్‌ సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. దీంతో రాడిసన్‌ డ్రగ్స్‌ పార్టీ, పంజాగుట్ట డ్రగ్స్‌ కేసు రెండింట్లోనూ ఫైజల్‌ నిందితుడిగా చేర్చారు.
  • ఫైజల్‌ తన నెట్‌వర్క్‌ ద్వారా దిల్లీలోని నరేంద్ర శివనాథ్‌కు డ్రగ్స్‌ పంపిస్తే.. అక్కడి నుంచి వేర్వేరు మార్గాల్లో హైదరాబాద్‌కు వస్తున్నాయని పోలీసులు తేల్చారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని