Crime News: 31 ఏళ్లుగా తప్పించుకు తిరిగి.. భార్య ‘నంబర్‌’తో దొరికిపోయి!

ఓ హత్య కేసులో 31 ఏళ్లుగా పరారీలో ఉన్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ముంబయిలో ఈ ఘటన వెలుగుచూసింది.

Published : 31 Dec 2023 16:23 IST

ముంబయి: ఓ హత్య కేసులో మూడు దశాబ్దాలకుపైగా తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. మహారాష్ట్ర (Maharashtra) రాజధాని ముంబయిలో ఈ వ్యవహారం వెలుగుచూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. 1989లో స్థానికంగా ఓ వ్యక్తి హత్య కేసులో దీపక్‌ నారాయణ్‌ భీసే(62) నిందితుడిగా ఉన్నాడు. 1992లో బెయిల్ మంజూరయ్యింది. అప్పటినుంచి కోర్టు విచారణకు హాజరుకాలేదు. ఈ క్రమంలోనే 2003లో కోర్టు అతడిని పరారీలో ఉన్న వ్యక్తిగా ప్రకటించింది. అతడి ఆచూకీ కనిపెట్టాల్సిందిగా పోలీసులను ఆదేశించింది.

కర్మాగారంలో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవదహనం

ఆ సమయంలో నిందితుడి నివాస ప్రాంతమైన కాందివలీకి పోలీసులు వచ్చినప్పుడల్లా.. అతడు చనిపోయి ఉండొచ్చని స్థానికులు తెలిపేవారు. కానీ, పోలీసులు మాత్రం దర్యాప్తు కొనసాగించారు. ఈ క్రమంలోనే ఇటీవల భీసే భార్య ఫోన్ నంబర్‌ను సంపాదించారు. దాన్ని ట్రాక్‌ చేసి, నాలాసొపారా ప్రాంతంలో నిందితుడిని పట్టుకున్నారు. మూడు దశాబ్దాల కాలంలో అనేక ప్రదేశాలను మార్చిన అతడు.. భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి రెండేళ్లుగా ఈ ప్రాంతంలో స్థిరపడినట్లు వెల్లడించారు. చెట్ల నరికివేత పనులు చేపడుతూ జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు. నిందితుడిని జైలుకు తరలించామని, తదుపరి విచారణ కొనసాగుతోందని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని