Hanamkonda: సీఐ కుమారుడి నిర్లక్ష్యం.. కారు ఢీకొని మహిళ మృతి

ఓటు వేసి వెళ్తుండగా కారు అతి వేగంగా వచ్చి ఢీకొనడంతో మహిళ మృతి చెందిన ఘటన హనుమకొండ జిల్లాలో చోటు చేసుకుంది.

Updated : 01 Dec 2023 17:43 IST

కాజీపేట టౌన్‌: ఓటు వేసి వెళ్తుండగా కారు అతి వేగంగా వచ్చి ఢీకొనడంతో గాదె కవిత(35) అనే నర్సు మృతి చెందిన సంఘటన కాజీపేట ఫాతిమానగర్‌లో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లాలోని దర్గా కాజీపేటకు చెందిన గాదె జోసెఫ్‌, కవిత భార్యాభర్తలు. వీరిద్దరు గురువారం స్థానిక సెయింట్‌ గాబ్రియేల్‌ పాఠశాలలో ఓటు వేయడానికి ద్విచక్రవాహనంపై వెళ్లారు. ఓటు వేసి తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో ద్విచక్రవాహనం ఎక్కుతుండగా ఫాతిమానగర్‌ నుంచి దర్గా వైపు కారు అతి వేగంగా వచ్చి కవితను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె తలకు బలమైన గాయాలయ్యాయి. చికిత్స కోసం ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. నిర్లక్ష్యంగా కారు నడిపిన ఎక్సైజ్‌ సీఐ కుమారుడు వంశీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ కాజీపేట వంతెన వద్ద మృతురాలి బంధువులు శుక్రవారం రాస్తారోకో చేశారు. ఘటనపై కాజీపేట పోలీసు ఇన్స్‌పెక్టర్‌ రాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు