Scam Alert: బరితెగిస్తున్న సైబర్‌ నేరగాళ్లు.. ఫెడెక్స్‌ కొరియర్‌ పేరుతో మోసాలు!

Scam Alert: డిజిటల్‌ యుగంలో సైబర్‌ దాడులు పేట్రేగిపోతున్నాయి. సాంకేతికతను ఉపయోగించుకొని సైబర్‌ నేరగాళ్లు పెద్దఎత్తున మోసాలకు తెర తీస్తున్నారు.

Published : 10 Apr 2024 18:55 IST

Scam Alert | ఇంటర్నెట్‌డెస్క్‌: ‘సైబర్‌ క్రైమ్‌’.. ఈ పదం తరచూ వినిపిస్తూనే ఉంది. అంతలా సమాజంలో ఈ నేరాలు పెరిగిపోయాయి. ఇన్నాళ్లు ఉద్యోగం, వ్యాపారం, చలాన్లు, ఆఫర్లు అంటూ రకరకాల పంథాల్లో మోసాలకు పాల్పడిన సైబర్‌ నేరగాళ్లు.. ఇప్పుడు ఫెడ్‌ఎక్స్‌ కొరియర్‌ పేరిట కొత్త మోసాలకు తెరతీసి పెట్రేగిపోతున్నారు. తాజాగా బెంగళూరుకు చెందిన ఓ న్యాయవాదినే బోల్తా కొట్టించి దాదాపు రూ.15 లక్షలు కొట్టేశారు.

‘‘ఫెడెక్స్‌ కొరియర్‌ సంస్థ నుంచి కాల్‌ చేస్తున్నాం. మీరు ముంబయి నుంచి థాయ్‌లాండ్‌కు పంపించిన పార్శిల్‌లో ఐదు నకిలీ పాస్‌పోర్ట్‌లు, మూడు క్రెడిట్ కార్డులు, డ్రగ్స్‌తో పాటు ఇతర నిషేధిత వస్తువులు ఉన్నాయి. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు’’ అంటూ బెంగళూరుకు చెందిన న్యాయవాది (29)కి కొరియర్‌ సంస్థ పేరిట సైబర్‌ నేరగాళ్ల నుంచి నకిలీ కాల్‌ వచ్చింది. నిజంగా అధికారులేనేమో అనుకున్న ఆమె వాళ్లు చెప్పిన మాటలు నమ్మింది. అందులోని వస్తువులు తనవి కావని ఎవరో తన ఐడీని దుర్వినియోగం చేసుంటారని బదులిచ్చింది. దీంతో కేటుగాళ్లు మరో ఎత్తుగడ వేశారు. వెంటనే ఫిర్యాదు చేయాలంటూ నకిలీ సైబర్‌ క్రైమ్‌ టీమ్‌కు తన కాల్‌ను బదిలీ చేశారు.

ఇండిగో సత్తా.. అమెరికా సంస్థను దాటేసి టాప్‌-3లోకి!

తర్వాత సైబర్‌ క్రైమ్‌ టీమ్‌కు చెందిన సభ్యులమంటూ నమ్మించి స్కైప్‌ వీడియో కాల్‌లో పాల్గొనేలా చేశారు. మాయమాటలు చెప్పి ఆధార్‌ వివరాలు, అకౌంట్‌లో డబ్బులు, ఆదాయం.. ఇలా ఆమె వ్యక్తిగత వివరాలన్నీ తెలుసుకున్నారు. ఇలా 36 గంటల పాటు ఆమెను వీడియో కాల్‌లోనే ఉండేలా చేసి బ్యాంక్‌ ఖాతా నుంచి దాదాపు రూ.15 లక్షలు బదిలీ చేయించుకున్నారు. ‘నార్కోటిక్ టెస్టులు’ సాకుతో ఆమెను నగ్నంగా కెమెరా ముందు నిల్చోబెట్టి అమానవీయంగా వ్యవహరించారు. అలా చేయకపోతే తనతో పాటు కుటుంబసభ్యులందరినీ డ్రగ్స్‌ కేసులో అరెస్టు చేస్తామని బెదిరించారు. తీరా డబ్బులు పంపాక స్కామ్‌కు గురైనట్లు గ్రహించిన ఆమె.. పోలీసులను ఆశ్రయించింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈమె ఒక్కరే కాదు.. ఇటీవల కాలంలో ఒక్క బెంగళూరులోనే ఇలా ఇప్పటివరకు సైబర్‌ నేరగాళ్లు రూ.5 కోట్లకు పైగా డబ్బులు కాజేశారు. 2023లోనే ఈతరహా సైబర్ స్కామ్‌లకు సంబంధించి 163 కేసులు నమోదయ్యాయి.

ఆ వివరాలు ఇవ్వొద్దు: ఫెడ్‌ఎక్స్‌

తమ సంస్థ పేరుతో జరుగుతున్న మోసాలపై ఫెడ్‌ఎక్స్‌ సైతం స్పందించింది. ఫోన్‌ కాల్స్‌ ద్వారా తాము ఎప్పుడూ వ్యక్తిగత సమాచారం కోరబోమని తెలిపింది. ఎవరైనా వ్యక్తిగత సమాచారం కోరుతూ ఫోన్లు, మెసేజ్ చేస్తే వెంటనే స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించింది. 

ఇవి పాటించండి. 

  • ఈతరహా పార్శిల్‌ స్కామ్‌ల బారిన పడకుండా ఉండాలంటే అధికారిక ఫెడెక్స్‌ వెబ్‌సైట్లో మాత్రమే ప్యాకేజీ స్టేటస్‌ను చెక్‌ చేయండి.
  • యూపీఐ పిన్‌, ఐడీ లాంటి సున్నితమైన సమాచారాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ షేర్‌ చేయొద్దు.
  • అనుమానాస్పదంగా అనిపించే ఫోన్‌ కాల్స్‌కు రియాక్ట్‌ అవ్వొద్దు. 
  • సైబర్‌ దాడుల్లో చిక్కుకున్నామని ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే 112 లేదా 1930 నెంబర్‌కు కాల్‌ చేయండి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని