ఇండిగో సత్తా.. అమెరికా సంస్థను దాటేసి టాప్‌-3లోకి!

ఇండిగో సంస్థ కీలక మైలురాయిని చేరుకుంది. మార్కెట్‌ విలువ పరంగా ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. 

Published : 10 Apr 2024 17:18 IST

Indigo | ఇంటర్నెట్ డెస్క్‌: ఇండిగో (Indigo) పేరిట సేవలందిస్తున్న దేశీయ విమానయాన సంస్థ ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ సరికొత్త మైలురాయిని అందుకుంది. సంవత్సరం క్రితం టాప్‌-10 ఎయిర్‌లైన్స్‌ జాబితాలో కూడా లేని సంస్థ.. ఏడాది తిరగకముందే ఆ జాబితాలో టాప్‌-3లో చోటు దక్కించుకుంది. మార్కెట్‌ వాటా పరంగా ఇప్పటికే దేశీయ అతిపెద్ద ఎయిర్‌లైన్స్‌గా కొనసాగుతున్న ఇండిగో.. మార్కెట్‌ విలువ పరంగా ప్రపంచంలో మూడో స్థానంలో నిలిచింది.

బ్లూమ్‌బెర్గ్‌ ప్రకారం.. అమెరికాకు చెందిన డెల్టా ఎయిర్‌లైన్స్‌ మార్కెట్‌ విలువ పరంగా 30.4 బిలియన్‌ డాలర్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ర్యానైర్‌ హోల్డింగ్స్‌ సంస్థ 26.5 బిలియన్‌ డాలర్లతో రెండో స్థానంలో ఉంది. అమెరికాకు చెందిన సౌత్‌ వెస్ట్ ఎయిర్‌లైన్స్‌ విలువ 17.3 బిలియన్‌ డాలర్లు కాగా.. 17.6 బిలియన్‌ డాలర్లతో ఇండిగో మూడో స్థానాన్ని ఆక్రమించింది. ఇండిగో షేరు వరుసగా నాలుగో రోజూ 4.73 శాతం లాభపడి 3,806.00 వద్ద ముగిసింది. ఈ క్రమంలో మార్కెట్‌ విలువ పరంగా మూడో అతిపెద్ద ఎయిర్‌లైన్‌గా ఇండిగో అవతరించింది. గత ఒక్క నెలలోనే ఇండిగో షేరు విలువ దాదాపు 22 శాతం మేర పెరిగింది. గత ఏడాదిలో దాదాపు రెట్టింపైంది.

Truecaller: ట్రూకాలర్‌లో వెబ్‌ వెర్షన్‌.. పీసీలోనూ ఇక నంబర్లు వెతకొచ్చు

గతేడాది మార్చిలో ప్రపంచ పౌర విమానయాన సంస్థల జాబితాలో విలువ పరంగా 14వ స్థానంలో ఉన్న ఇండిగో ఏడాదిలోనే 10 స్థానాలను మెరుగుపరుచుకుంది. గతేడాది డిసెంబర్‌లో యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ను అధిగమించిన ఇండిగో..  జనవరిలో ఎయిర్‌ చైనా, ఫిబ్రవరిలో సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ను సైతం దాటేసింది. తాజాగా సౌత్‌ వెస్ట్‌ ఎయిర్‌లైన్స్‌ను కూడా దాటేయడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని