Vizianagaram: రెండు రైళ్లు ఢీ.. విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం

విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. కొత్తవలస మండలం అలమండ-కంటకాపల్లి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.

Updated : 30 Oct 2023 03:40 IST

విజయనగరం: విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర రైలు ప్రమాదం జరిగింది. రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో 14 మంది మృతి చెందగా, 100 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను అంబులెన్స్‌లలో విజయనగరం, విశాఖపట్నం ఆసుపత్రులకు తరలించారు. రైల్వే అధికారుల, ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రి 7.10 గంటల సమయంలో విశాఖ నుంచి పలాస వెళ్తున్న ప్రత్యేక ప్యాసింజర్‌ రైలు కొత్తవలస మండలం అలమండ-కంటకాపల్లి వద్ద సిగ్నల్‌ కోసం పట్టాలపై ఆగి ఉంది. అదే సమయంలో దాని వెనకాలే వస్తున్న విశాఖ-రాయగడ రైలు.. ప్యాసింజర్‌ రైలును ఢీ కొట్టింది. ప్రమాదంపై రైల్వే బోర్డు గ్రూపులో డీఆర్‌ఎం సౌరబ్ ప్రసాద్‌ సమాచారం ఇచ్చారు. ఎన్డీఆర్‌ఎఫ్, రెవెన్యూ, పోలీసు సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ఈ ప్రమాదంలో మూడు బోగీలు పట్టాలు తప్పాయి. రైళ్లు ఢీకొనడంతో ఘటనా స్థలంలో విద్యుత్‌ వైర్లు తెగిపోయాయి. దీంతో ఆ ప్రాంతమంతా అంధకారం నెలకొనడంతో సహాయక చర్యలకు ఆటంకమేర్పడింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. ఘటనా స్థలిలో భీతావహ పరిస్థితి నెలకొంది. 

హెల్ప్‌ లైన్‌ నంబర్లు

విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాద దుర్ఘటన నేపథ్యంలో అధికారులు హెల్ప్‌ లైన్‌ నంబర్లు ఏర్పాటు చేశారు. సమాచారం కోసం..  0891 2746330, 0891 2744619, 81060 53051, 81060 53052, 85000 41670, 85000 41677, 83003 83004, 85005 85006 నెంబర్లకు ఫోన్‌ చేయాలని సూచించారు.

మంత్రి బొత్స సత్యనారాయణ, విజయనగరం జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి, ఎస్పీ దీపికా పాటిల్‌ ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. ప్యాసింజర్‌ రైలు కావడంతో ప్రయాణికుల వివరాలు తెలుసుకోవడం అధికారులకు కష్టంగా మారింది. కోల్‌కతా-చెన్నై ప్రధాన మార్గంలో రైలు ప్రమాదం జరగడంతో భువనేశ్వర్‌ వద్ద కొన్ని రైళ్లను నిలిపివేశారు. కోల్‌కతా వైపు రైళ్లను విశాఖ తదితర స్టేషన్లలో నిలిపివేశారు. రైలు బాధితులకు సహాయం, సమాచారం అందించడం కోసం విజయనగరం కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్టు జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి తెలిపారు. బాధితుల సమాచారం కోసం కలెక్టర్ కార్యాలయంలో 9493589157, రైల్వే కార్యాలయంలో 8978080006 ఫోన్‌ నంబర్లకు సంప్రదించాలని సూచించారు. 

రైలు ప్రమాద ఘటనపై సీఎం దిగ్భ్రాంతి

రైలు ప్రమాద దుర్ఘటనపై ముఖ్యమంత్రి జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. విజయనగరం సమీప జిల్లాలైన విశాఖపట్నం, అనకాపల్లి నుంచి వీలైనన్ని అంబులెన్స్‌లను పంపించాలని, మెరుగైన వైద్యం అందించడానికి సమీప ఆస్పత్రుల్లో అన్నిరకాల ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. వైద్య ఆరోగ్య, పోలీసు, రెవిన్యూ సహా ఇతర ప్రభుత్వ శాఖలు సమన్వయంతో వేగంగా సహాయక చర్యలు చేపట్టి, క్షతగాత్రులకు వైద్య సేవలు అందేలా చూడాలని సీఎం ఆదేశాలు జారీచేశారు.

మృతులకు రూ.10 లక్షల పరిహారం..

రైలు ప్రమాదంలో మృతి చెందిన వారికి ఏపీ సీఎం పరిహారం ప్రకటించారు. మృతుల్లో ఏపీకి చెందిన వారు ఉంటే వారికి. 10లక్షలు ఎక్స్‌గ్రేషియా, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షల సహాయం అందించనున్నట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాలకు చెందినవారు మరణిస్తే రూ.2 లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడ్డవారికి రూ. 50వేల చొప్పున సహాయం చేయనున్నట్లు ప్రకటించారు. మరోవైపు ఈ ప్రమాదంలో మృతి చెందిన వారికి కేంద్రం తరఫున రూ.10 లక్షల పరిహారం అందించనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడ్డవారికి రూ.50,000 అందించనున్నట్లు తెలిపారు.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని