icon icon icon
icon icon icon

కొండారెడ్డి బురుజుపై కూటమి జెండా!

కరవుసీమ కర్నూలులో గత ఎన్నికల్లో వైకాపాకు బ్రహ్మరథం పట్టిన ఓటర్లు.. ఈసారి కూటమి వైపు చూస్తున్నారు. అభివృద్ధి మచ్చుకైనా లేదన్న అసంతృప్తి, రహదారులు అధ్వానంగా ఉన్నాయన్న ఆగ్రహం, గొంతు తడుపుకోవడానికి గుక్కెడు నీళ్ల కోసం కష్టాలు పడాల్సి వస్తోందన్న ఆక్రోశం..

Published : 09 May 2024 06:22 IST

కర్నూలులో తాగు, సాగునీటికి కటకట..  అభివృద్ధి వెలవెల
ప్రభుత్వ పనితీరుపై జనంలో వ్యతిరేకత
పథకాలనే నమ్ముకున్న వైకాపా
ఎమ్మిగనూరు, కర్నూలు స్థానాల్లో తెదేపా దూకుడు
జిల్లాలో బీసీలకు కూటమి పెద్దపీట
కర్నూలు నుంచి ‘ఈనాడు’ ప్రత్యేక ప్రతినిధి

కరవుసీమ కర్నూలులో గత ఎన్నికల్లో వైకాపాకు బ్రహ్మరథం పట్టిన ఓటర్లు.. ఈసారి కూటమి వైపు చూస్తున్నారు. అభివృద్ధి మచ్చుకైనా లేదన్న అసంతృప్తి, రహదారులు అధ్వానంగా ఉన్నాయన్న ఆగ్రహం, గొంతు తడుపుకోవడానికి గుక్కెడు నీళ్ల కోసం కష్టాలు పడాల్సి వస్తోందన్న ఆక్రోశం.. అధిక శాతం మంది ఓటర్లలో వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత నేపథ్యంలో కూటమి మంచి ఫలితాలను సాధించే అవకాశం కనిపిస్తోంది. చెప్పుకోవడానికి చేసిన అభివృద్ధి ఏమీ లేని వైకాపా.. సంక్షేమ పథకాలనే నమ్ముకొని ప్రచారం సాగిస్తోంది. పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని.. మూడు పార్టీల శ్రేణులు కలిసికట్టుగా ముందుకెళితే కర్నూలు కొండారెడ్డి బురుజు మీద కూటమి జెండా ఎగరేయవచ్చని భావిస్తున్నారు. ‘ఈనాడు’ ప్రతినిధి కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో పర్యటించి ఓటర్లతో మాట్లాడినప్పుడు సర్కారు తీరుపై వ్యతిరేకత వ్యక్తమైంది. కర్నూలును న్యాయ రాజధాని అని ఐదేళ్లలో చేసింది శూన్యమని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రెడ్డి సామాజికవర్గం ఆధిపత్యం కనిపించే ఈ జిల్లాలో.. కూటమి బీసీలకు పెద్దపీట వేసింది. తెదేపా కర్నూలు లోక్‌సభకు కురుబ, మంత్రాలయంలో వాల్మీకి, పత్తికొండలో ఈడిగ సామాజికవర్గాల అభ్యర్థులను బరిలోకి దింపింది. భాజపా ఆదోని నుంచి వాల్మీకి సామాజికవర్గానికి అవకాశమిచ్చింది. వైకాపా మంత్రాలయం, ఆదోనిలో పాత అభ్యర్థులైన రెడ్డి సామాజికవర్గం నేతలు అదీ అన్నదమ్ములనే బరిలోకి దించింది. వైకాపా కర్నూలు లోక్‌సభ అభ్యర్థితోపాటు ఎమ్మిగనూరు, ఆలూరు అసెంబ్లీ స్థానాలకు బీసీలకు టికెట్లిచ్చింది. కర్నూలు లోక్‌సభ స్థానంలో ప్రధాన పార్టీల నుంచి రెడ్లు లేకుండా జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవే కావడం విశేషం.


కర్నూలు.. భరతుడికి పట్టం?

ఐదేళ్లుగా కర్నూలు అభివృద్ధికి నోచుకోలేదు. రెండో సమ్మర్‌ స్టోరేజీ ట్యాంక్‌ నిర్మాణంలో అధికార పార్టీ వైఫల్యంతో ప్రజలు తాగునీటి సమస్య ఎదుర్కొంటున్నారు. వైకాపా సిటింగ్‌ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ను పక్కనబెట్టి విశ్రాంత ఐఏఎస్‌ అధికారి ఇంతియాజ్‌కు టికెట్‌ ఇచ్చింది. పోయినసారి వైకాపా ఉద్ధృతిలోనూ కేవలం 5,353 ఓట్ల తేడాతో ఓడిన టీజీ భరత్‌ను మరోసారి తెదేపా బరిలో దింపింది. విద్యావంతుడు, సౌమ్యుడన్న పేరు, సామాజిక సేవా కార్యక్రమాలు భరత్‌కు ప్రజల్లో ఆదరణ పెంచాయి. నగరాభివృద్ధికి ఆయన ప్రత్యేక మ్యానిఫెస్టో రూపొందించి ప్రచారం చేస్తున్నారు. నగరంలో ముస్లిం ఓటర్లు 80 వేల మంది వరకు ఉన్నారు. భరత్‌ తండ్రి, మాజీ మంత్రి టీజీ వెంకటేశ్‌కు ముస్లింలతో ఉన్న విస్తృత పరిచయాలు కలిసొస్తున్నాయి. ఇటీవల ఒక ముస్లిం కార్పొరేటర్‌ తెదేపాలో చేరారు. మరికొంత మంది చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతియాజ్‌ స్థానికేతరుడు కావడం, మాజీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ను ప్రచారానికి దూరంగా ఉంచుతుండటంతో స్థానిక ముస్లిం నేతలు సహకరించకపోవచ్చని ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో 58 శాతం ఓట్లే పోలయ్యాయి. ఈసారి పోలింగ్‌ శాతం పెంచుకుంటే భరత్‌ గెలుపు ఖాయమన్న అంచనాలున్నాయి. ‘న్యాయ రాజధాని చేస్తామని ఐదేళ్లు ఒరగబెట్టిందేమీ లేదు.. మళ్లీ జగన్‌ వస్తే రాష్ట్రం ఇంకా అధ్వానంగా మారుతుంది. మా కర్నూలులో అభివృద్ధి అసలే ఉండదు’ అని ఓ వ్యాపారి వ్యాఖ్యానించారు.


ఆదోని: అరాచకాలు ఘనం.. అభివృద్ధి శూన్యం

కూటమి పొత్తులో భాగంగా ఆదోని టికెట్‌ అనూహ్యంగా భాజపాకు దక్కింది. గత రెండు ఎన్నికల్లో వైకాపా నుంచి గెలిచిన సాయిప్రసాద్‌రెడ్డి మూడోసారి బరిలో దిగారు. భాజపా అభ్యర్థిగా డాక్టర్‌ పీవీ పార్థసారథి తలపడుతున్నారు. సాయిప్రసాద్‌రెడ్డి పదేళ్లలో ఆదోనిని ఏమీ అభివృద్ధి చేయలేదని ఓటర్లు మండిపడుతున్నారు. వ్యాపార కేంద్రంగా, చినబొంబాయిగా పేరు తెచ్చుకున్న ఆదోనిలో ప్రధాన రహదారులు సైతం అధ్వానంగా ఉన్నాయి. ఫ్లైఓవర్లపైనా భారీ గుంతలున్నా పట్టించుకోని జగన్‌ సర్కారుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ‘రైతులను చాలా చిన్నచూపు చూశారు. ఈసారి జగన్‌ పార్టీని పాతరేస్తాం’ అని ఆదోని మండలం మదిరె గ్రామానికి చెందిన ఓ రైతు వ్యాఖ్యానించడం గమనార్హం. ఆదోని మున్సిపాలిటీలోని 70 వేల మంది ఓటర్లలో సుమారు 55 వేల మంది ముస్లింలే. దీంతో ఈ సీటు భాజపాకు కేటాయించగానే గెలుపు తమదేనని వైకాపా నేతలు వ్యాఖ్యానించారు. అయితే సాయిప్రసాద్‌రెడ్డి దౌర్జన్యాలు, భూకబ్జాలు, సెటిల్‌మెంట్లపై భాజపా అభ్యర్థి పార్థసారథి తన వాగ్ధాటితో జనాల్లోకి దూకుడుగా వెళ్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ముస్లింలను వేధించి ఆత్మహత్యలకు పాల్పడేలా చేసింది వైకాపానా? భాజపానా? అని ప్రశ్నిస్తున్నారు. నియోజకవర్గంలో పట్టున్న తెదేపా మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు ముస్లింల మద్దతు కూడగట్టే పనిలో ఉన్నారు. గత ఎన్నికల్లో 12 వేలకుపైగా ఓట్లు తెచ్చుకున్న జనసేన బలం కలిసొస్తుందని నమ్ముతున్నారు.


ఎమ్మిగనూరులో ‘జయ’హో!

ఎమ్మిగనూరు నియోజకవర్గంలో మాజీ మంత్రి బీవీ మోహన్‌రెడ్డి అభివృద్ధి మార్కును ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు. తెదేపా నుంచి ఆయన తనయుడు బీవీ జయనాగేశ్వర్‌రెడ్డి వరుసగా రెండోసారి ఎన్నికల బరిలో నిలిచారు. గత ఎన్నికల్లో ఆయన ఓడిపోయినా.. తమ కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నారన్న భావన ఓటర్లలో వ్యక్తమవుతోంది. ఓడినా గెలిచినా ఎమ్మిగనూరును వదలవద్దని తండ్రి మోహన్‌రెడ్డి తన వద్ద మాట తీసుకున్నారని, అందుకే సునాయాసంగా గెలిచే స్థానాల నుంచి పోటీ చేయాలని పార్టీ కోరినా వెళ్లలేదని ఆయన ప్రచారం చేస్తున్నారు. ‘గత ఎన్నికల్లో జగన్‌కు ఓసారి అవకాశమివ్వాలని వైకాపా అభ్యర్థికి ఓటేశాం. ఆయన పాలనలో చేసిందేమీ లేదు. అందుకే ఈసారి జయనాగేశ్వర్‌రెడ్డిని గెలిపిస్తాం’ అని ఎమ్మిగనూరులో ఎరువుల దుకాణానికి వచ్చిన పలువురు రైతులు తెలిపారు. జయనాగేశ్వర్‌రెడ్డి గెలవాలని కోరుకుంటున్నామని కొంత మంది యువకులు అభిప్రాయపడ్డారు. ‘ఒకప్పుడు ఎమ్మిగనూరు మున్సిపాలిటీ అంటే శుభ్రతకు మారుపేరు. ఇప్పుడు ఎక్కడ చూసినా చెత్తే’ అని ఓ దుకాణ యజమాని అసంతృప్తి వ్యక్తం చేశారు. సిటింగ్‌ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిని కాదని వైకాపా మాజీ ఎంపీ బుట్టా రేణుకకు టికెటిచ్చింది. ఆమె స్థానికురాలు కాదన్న ప్రచారం, చెన్నకేశవరెడ్డి సహకరించరన్న విశ్లేషణలు వైకాపాను కంగారుపెడుతున్నాయి. రేణుక డబ్బులు వెదజల్లి అయినా గెలవాలని చూస్తున్నారన్న మాట వినిపిస్తోంది.


మంత్రాలయం: అభివృద్ధి లేదు.. అరాచకమే

కర్ణాటక సరిహద్దు నియోజకవర్గాల్లో ఒకటైన మంత్రాలయంలో ఈసారి పోటీ రసవత్తరంగా మారింది. 2009 నుంచి వరుసగా మూడుసార్లు గెలుపొందిన బాలనాగిరెడ్డి మరోమారు వైకాపా తరఫున పోటీపడుతున్నారు. తెదేపా వాల్మీకి సామాజికవర్గానికి చెందిన రాఘవేంద్రరెడ్డిని బరిలోకి దింపింది. ఇక్కడ వాల్మీకి సామాజికవర్గ ఓటర్లు దాదాపు లక్ష మంది వరకు ఉన్నారు. తమ సామాజికవర్గానికి రాకరాక అవకాశం వచ్చిందన్న భావనతో వాల్మీకులు ఏకతాటిపైకి వస్తున్నారు. బాలనాగిరెడ్డిని మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించినా కనీస అభివృద్ధి లేదని, రోడ్లు దారుణంగా ఉన్నాయని, తాగునీరు కూడా దొరకని పరిస్థితి నెలకొందని ప్రజలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఉపాధి లేక మంత్రాలయం నియోజకవర్గం నుంచి వేల మంది గుంటూరు, ఇతర జిల్లాలకు వలసపోతున్నారు. ఎమ్మెల్యే తమ అనుచరులతో భూదందాలు చేశారని, 2006లో పేదలకు ఇచ్చిన 9 ఎకరాల భూమిని కబ్జా చేసి ప్లాట్లుగా అమ్ముకున్నారన్న ఆరోపణలు ఎన్నికల్లో తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. ‘ఒకసారి అధికారం పోతే అన్నీ చక్కబడతాయి. ఈసారి మా బీసీలను గెలిపించుకుంటాం’ అని ఎరిగేరి గ్రామానికి చెందిన గొర్రెలకాపరి ఒకరు వ్యాఖ్యానించారు. చంద్రబాబు పర్యటించినప్పుడు తాము అధికారంలోకి వస్తే కౌతాళంలో 100 పడకల ఆస్పత్రి నిర్మిస్తామని, ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం కలిసివస్తాయని తెదేపా ఆశాభావంతో ఉంది.


కోడుమూరు.. ఎవరిదో జోరు?

ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన కోడుమూరులో ఈసారి ప్రధాన పార్టీ అభ్యర్థులిద్దరూ కొత్తవారే. గత ఎన్నికల్లో వైకాపా నుంచి గెలిచిన సుధాకర్‌ను కాదని, ప్రకాశం జిల్లాకు చెందిన మంత్రి ఆదిమూలపు సురేష్‌ సోదరుడు డాక్టర్‌ సతీష్‌ను బరిలో నిలిపింది. తెదేపా బొగ్గుల దస్తగిరికి టికెట్‌ ఇచ్చింది. ఇక్కడ అభ్యర్థులు ఎవరైనా గెలుపోటములను భుజానికెత్తుకునేది రెడ్డి నేతలే. గత ఐదేళ్లలో అభివృద్ధి ఏమీ జరగలేదని, ఈసారి మార్పు తప్పదని కోడుమూరుకు చెందిన పీజీ విద్యార్థి వ్యాఖ్యానించారు. ప్రభుత్వ వ్యతిరేకతతోపాటు కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి వర్గం గట్టిగా పనిచేస్తే తెదేపా గెలుపు ఖాయమని భావిస్తున్నారు.


పత్తికొండ.. అభివృద్ధి సున్నా

పత్తికొండలో వైకాపా అభ్యర్థి కంగాటి శ్రీదేవి గెలుపొందినా ఈ ఐదేళ్లలో అభివృద్ధి శూన్యమన్న విమర్శ బలంగా వినిపిస్తోంది. పట్టణంలో 2.5 కిలోమీటర్ల రోడ్ల విస్తరణ హామీని పూర్తి చేయలేకపోవడం, హంద్రీనీవా కాలువ నుంచి పైపులైను వేసి వేసవిలో సమస్య లేకుండా చేస్తానని ఇచ్చిన వాగ్దానం నెరవేర్చకపోవడం లాంటివి వైకాపా గెలుపునకు ప్రతిబంధకాలుగా మారుతున్నాయి. తెదేపా అభ్యర్థిగా మాజీ మంత్రి కేఈ కృష్ణమూర్తి తనయుడు శ్యామ్‌కుమార్‌ రెండోసారి పోటీ చేస్తున్నారు. ఈసారి వైకాపాపై వ్యతిరేకత, శ్యామ్‌కుమార్‌పై సానుభూతి తెదేపా గెలుపునకు కలిసొచ్చే అంశాలుగా ఉన్నాయి.


ఆలూరు.. కష్టపడితే సైకిల్‌దే పరుగు

గత ఐదుసార్లుగా ఆలూరు తెదేపాకు అందని ద్రాక్షగా మారింది. వైకాపాను గెలిపించినా సాగునీరే కాదు.. కనీసం తాగునీరూ ఇవ్వలేకపోయారని ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. సిటింగ్‌ ఎమ్మెల్యే, మంత్రి గుమ్మనూరు జయరామ్‌ తెదేపాలో చేరి ఈసారి గుంతకల్లు నుంచి పోటీ చేస్తున్నారు. వైకాపా స్థానిక జడ్పీటీసీ సభ్యుడు బి.విరూపాక్షికి, తెదేపా బి.వీరభద్రగౌడ్‌కు అవకాశమిచ్చాయి. ఈసారి ప్రజలు బలంగా మార్పు కోరుకుంటున్న నేపథ్యంలో తెదేపా నేతలు కష్టపడితే ఇక్కడ సైకిల్‌ పరుగు ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img