logo

నిర్మల్‌ నేతలదే ఆధిపత్యం

ఇప్పుడు జరగబోయే ఎన్నికలు 18వ లోక్‌సభకు సంబంధించినవి. ఆదిలాబాద్‌ ఎంపీ స్థానానికి మాత్రం 19వ సారి   జరుగుతున్నాయి. 2008లో అప్పటి ఎంపీ మధుసూదన్‌రెడ్డి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక జరిగింది.

Updated : 20 Apr 2024 06:41 IST

పార్లమెంట్‌కు వెళ్లింది 12 మంది

ఇప్పుడు జరగబోయే ఎన్నికలు 18వ లోక్‌సభకు సంబంధించినవి. ఆదిలాబాద్‌ ఎంపీ స్థానానికి మాత్రం 19వ సారి   జరుగుతున్నాయి. 2008లో అప్పటి ఎంపీ మధుసూదన్‌రెడ్డి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక జరిగింది. ఇప్పటి వరకు ఈ స్థానం నుంచి గెలుపొందిన అభ్యర్థులు, వారి పార్టీ, పదవీ కాలం, తదితర వివరాలతో కథనం.

న్యూస్‌టుడే, నిర్మల్‌, మామడ: ఆదిలాబాద్‌ లోక్‌సభ స్థానానికి ఇప్పటి దాకా 18 సార్లు ఎన్నికలు జరిగాయి. గెలిచి పార్లమెంట్‌కు వెళ్లిన వ్యక్తులు మాత్రం 12 మందిగానే చెప్పొచ్చు. ఎందుకంటే మాధవరెడ్డి, గంగారెడ్డి, నర్సింహారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి రెండేసి సార్లు, వేణుగోపాలాచారి మూడు సార్లు విజయం సాధించారు. వీరు కాకుండా మరో ఏడుగురు ఎంపీగా ఆదిలాబాద్‌ నుంచి లోక్‌సభకు వెళ్లారు.

తొమ్మిది పర్యాయాలు ఎంపీలుగా అక్కడి వారే

పూర్వం రాజులు పాలించిన ప్రాంతం నిర్మల్‌. అప్పటి నుంచి రాజకీయ నాయకత్వ లక్షణాలు అందిపుచ్చుకున్న ఇక్కడి ప్రాంతవాసులు జిల్లా, రాష్ట్ర, దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఉద్ధండులే కావడం గమనార్హం. గడిచిన ఆరు దశాబ్దాలకుపైగా ఈ ప్రాంతం రాజకీయ ఖిల్లాగా వర్ధిల్లుతోంది. పదవులతోపాటు పార్టీ పరమైన బాధ్యతలతో ఈ ప్రాంత నాయకులే ఆధిపత్యం వహిస్తూ వస్తున్నారు. రాజకీయ, సామాజిక చైతన్యం ఎక్కువగా ఉన్న నిర్మల్‌ ప్రాంతంలోని నేతలు ఉన్నత విద్యాభాస్యం చేసిన వారే. ఇందులో చాలామంది న్యాయవాదులు, వైద్యులు కావడం గమనార్హం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జరిగిన వివిధ ఎన్నికల్లో ఈ ప్రాంత నాయకులే పోటీచేస్తూ గెలుపొందుతూ వచ్చారు. జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌లుగా, పార్లమెంటు సభ్యులుగా, రాష్ట్ర మంత్రులతోపాటు కేంద్ర మంత్రులు కూడా ఈ ప్రాంత నేతలే ఇప్పటివరకు ఎక్కువగా కొనసాగారు. పార్టీల అధ్యక్ష పదవులు చేపట్టిన వారిలోనూ వీరిదే ఆధిపత్యం కొనసాగింది. ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ స్థానం గిరిజనులకు రిజర్వ్‌ అయ్యే వరకు ఇదే ఒరవడి సాగింది.

హ్యాట్రిక్‌ విజయం, ఉప ఎన్నికలో గెలుపు

ఇప్పటివరకు ఆదిలాబాద్‌ పార్లమెంటు స్థానానికి ఒక ఉప ఎన్నికతోపాటు 17 సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఇందులో వరుసగా మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్‌ కొట్టిన నేత నిర్మల్‌కు చెందిన వేణుగోపాలాచారి ఒక్కరే కావడం గమనార్హం. ఈయన 1996, 1998, 1999లలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తెదేపా నుంచి పోటీచేసి విజయం సాధించారు. 2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆదిలాబాద్‌ స్థానం నుంచి తెరాస అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందిన మధుసూదన్‌రెడ్డి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా 2008లో రాజీనామా చేశారు. అప్పుడు ఆదిలాబాద్‌ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో నాటి నిర్మల్‌ ఎమ్మెల్యే అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీచేసి గెలుపొందారు.

ఒకరు మూడుసార్లు.. ఇద్దరు రెండుసార్లు

1952 నుంచి జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కువసార్లు పార్లమెంటు సభ్యులుగా గెలుపొందిన వారు నిర్మల్‌ ప్రాంత నేతలు కావడం గమనార్హం. ఇదివరకు ఆదిలాబాద్‌ పార్లమెంటు స్థానానికి 17 సార్వత్రిక ఎన్నికలు, ఓ సారి ఉప ఎన్నిక జరిగింది. ఇందులో తొమ్మిది పర్యాయాలు నిర్మల్‌ జిల్లా నేతలే ఎంపీలుగా గెలుపొందారు. ఇందులో ఒకరు మూడుసార్లు, ఇద్దరు రెండుసార్లు, మరో ఇద్దరు ఒక్కోసారి ఎంపీగా విజయం సాధించారు. 1962-1967 మధ్య కాలంలో జి.నారాయణరెడ్డి (కాంగ్రెస్‌), 1967-1970, 1971-1977 మధ్య కాలంలో రెండు పర్యాయాలు వరుసగా పదేళ్లు పొద్దుటూరి గంగారెడ్డి (కాంగ్రెస్‌) ఎంపీగా ఉన్నారు. 1989-1991 వరకు పొద్దుటూరి నర్సారెడ్డి (కాంగ్రెస్‌), 1991-1996 మధ్య అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి (తెదేపా), 1996-1998, 1998-1999, 1999-2004 వరకు వరుసగా మూడుసార్లు డా.వేణుగోపాలాచారి (తెదేపా) హ్యాట్రిక్‌ విజయం సాధించారు. 2008లో జరిగిన లోక్‌సభ ఉప ఎన్నికల్లో అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి (కాంగ్రెస్‌) గెలుపొందారు. ఆ తర్వాత ఆదిలాబాద్‌ పార్లమెంటు స్థానం ఎస్టీ కేటగిరీకి రిజర్వ్‌ కావడంతో అప్పటి నుంచి ఇక్కడి నేతలు పోటీ చేయలేదు. ఇందులో పొద్దుటూరి నర్సారెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా, హ్యాట్రిక్‌ ఎమ్మెల్యేగా, రెండుసార్లు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. డా.వేణుగోపాలాచారి కేంద్ర విద్యుత్తు, వ్యవసాయ సహాయ మంత్రిగా కొనసాగారు. అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి రెండు పర్యాయాలు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. వీరితోపాటు పలువురు జడ్పీ ఛైర్మన్లుగా, డీసీఎంఎస్‌ అధ్యక్షులుగా, డీసీసీబీ ఛైర్మన్లు, ఇలా ఎన్నో పదవులు ఇక్కడి నేతలే చేపట్టడం గమనార్హం.

ఓటు హక్కుతో పోరాడి రాజులు అవుతారో అమ్ముకొని బానిసలు అవుతారో నిర్ణయం మీ చేతుల్లో ఉంది

అంబేడ్కర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని