పోస్టల్‌ బ్యాలెట్‌ ఇంకా రెండు రోజులే!

ఆదిలాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు 16,972 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ నమోదు చేసుకోగా.. ఇప్పటి వరకు 5,200 మంది మాత్రమే  వినియోగించుకున్నారు.

Updated : 07 May 2024 06:59 IST

పొరపాటు చేస్తే ఓటు చెల్లదు

ఓటు కోసం వరుసలో ఉద్యోగులు

న్యూస్‌టుడే, రాంనగర్‌ : ఆదిలాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు 16,972 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ నమోదు చేసుకోగా.. ఇప్పటి వరకు 5,200 మంది మాత్రమే  వినియోగించుకున్నారు. ఇంకా రెండు రోజులు మాత్రమే గడువుంది.  పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు వేసేది ఉద్యోగులు, ఉపాధ్యాయులే అయినా.. చిన్న పొరపాట్ల కారణంగా తిరస్కరణకు గురవుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో చాలా మంది ఉద్యోగుల ఓట్లు తిరస్కరించారు. లోక్‌సభ ఎన్నికల్లో సమస్య ఏర్పడకుండా, ఎప్పటికప్పుడు సందేహాలను నివృత్తి చేసేందుకు హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేశారు.

చెల్లుబాటు కావాలంటే..

పోస్టల్‌ బ్యాలెట్‌ చెల్లుబాటు కావాలంటే ఉద్యోగులు జాగ్రత్తగా ఓటు వేయాల్సి ఉంటుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా మొత్తంలో 988 ఓట్లు తిరస్కరణకు గురికాగా, అందులో ఆదిలాబాద్‌ నియోజకవర్గంలో అత్యధికంగా 304 ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి. మీ ఆర్డర్‌ కాపీతో పాటు ఓటరుకార్డు లేదా ఆధార్‌కార్డు నియోజకవర్గంలోని అధికారికి చూపిస్తే.. పోస్టల్‌ బ్యాలెట్‌తో పాటు ఏ, బీ, సీ అని మూడు కవర్లు ఇస్తారు. ఫారం ఎ (డిక్లరేషన్‌) ఇది పేపర్‌ రూపంలో ఉంటుంది. దీనిపై మన వివరాలు రాసి మన సంతకంతో పాటు, గెజిటెడ్‌ అధికారి సంతకం తీసుకోవాలి. గెజిటెడ్‌ అధికారిని అందుబాటులో ఉంచుతారు. బ్యాలెట్‌లో నచ్చిన అభ్యర్థికి టిక్‌ కొట్టి డిక్లరేషన్‌తో పాటు బ్యాలెట్‌ పత్రాన్ని చిన్న కవర్‌లో పెట్టి, రెండింటికి కలిపి పెద్ద కవర్‌లో పెట్టి అక్కడే ఉంచి ట్రంక్‌ పెట్టెలో వేయాలి. కవర్లు తారుమారైనా.. మీది, గెజిటెడ్‌ అధికారి సంతకాలు లేకపోయినా.. టిక్‌ సరిగా చేయకపోయినా.. బ్యాలెట్‌పై అదనపు రాతలున్నా.. మీ ఓటు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని