logo

నిత్యం అ‘శాంతి’..!

జిల్లా దేవాదాయశాఖలో ఒక వెలుగు వెలిగిన పూర్వ సహాయ కమిషనర్‌ కె.శాంతి పలు వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచారు. బదిలీపై ఎన్టీఆర్‌ జిల్లాకు వెళ్లినప్పటికీ ఆమెను వివాదాలు వీడడం లేదు. ఏదో ఒక విధంగా విశాఖ రావాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తుండడంతో ఇక్కడి నుంచి అంతే వేగంగా ఆమెపై దేవాదాయశాఖ కమిషనర్‌కు ఫిర్యాదులు వెళుతున్నాయి.

Published : 15 Aug 2022 03:43 IST

వివాదాల నుంచి కేసు వరకు..

బదిలీపై వెళ్లినా వీడని విచారణలు

విశాఖపట్నం, న్యూస్‌టుడే

కె.శాంతి, పూర్వ సహాయ కమిషనర్‌, జిల్లా దేవాదాయశాఖ

జిల్లా దేవాదాయశాఖలో ఒక వెలుగు వెలిగిన పూర్వ సహాయ కమిషనర్‌ కె.శాంతి పలు వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచారు. బదిలీపై ఎన్టీఆర్‌ జిల్లాకు వెళ్లినప్పటికీ ఆమెను వివాదాలు వీడడం లేదు. ఏదో ఒక విధంగా విశాఖ రావాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తుండడంతో ఇక్కడి నుంచి అంతే వేగంగా ఆమెపై దేవాదాయశాఖ కమిషనర్‌కు ఫిర్యాదులు వెళుతున్నాయి. ఆయా ఫిర్యాదులపై ఆ శాఖ అధికారులు విచారణ చేపట్టారు. ఇటీవల విశాలక్షినగర్‌లోని తన నివాసం వద్ద జరిగిన గొడవలో తాజాగా ఆమెపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. దీనిపై దేవాదాయశాఖ కమిషనర్‌ కార్యాలయం ఆరా తీస్తున్నట్లు సమాచారం. కేసు నమోదైన నేపథ్యంలో శాఖాపరమైన విచారణ చేపట్టాలని దేవాదాయశాఖ వర్గాలు భావిస్తున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు 16, 17 తేదీల్లో వచ్చే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.

వైకాపా ముఖ్య నేత అండదండలతో..

* జిల్లా దేవాదాయశాఖ సహాయ కమిషనర్‌గా 2020 మే నెలలో శాంతి నియమితులయ్యారు. ఈ ఏడాది జూన్‌ 30 వరకు ఇక్కడ సేవలందించారు. 25నెలల పాటు జిల్లాలో పనిచేసిన ఆమె పలు వివాదాలకు కేంద్రబిందువుగా మారారు. ఉప కమిషనర్‌ పుష్పవర్ధన్‌పై ఇసుక చల్లి కొత్త వివాదానికి తెరలేపారు. వైకాపాకు చెందిన ముఖ్య నేత అండదండలతో ఇష్టారాజ్యంగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

* డీసీ క్యాడర్‌లో ఉన్న కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం ఈఓ (ఇన్‌ఛార్జి)గా నాలుగు నెలల పాటు పనిచేశారు. సూపరింటెండెంట్‌ క్యాడర్‌ స్థాయి ఆలయమైన ఎర్నిమాంబ ఆలయ ఈఓగా ఏడాదికిపైగా సేవలందించారు. ఈ ఆలయంలో ముగ్గురు ఉద్యోగులను అనధికారికంగా నియమించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆమె బదిలీ తర్వాత ఆయా నియామకాలను రద్దు చేశారు. నియామకాల్లో నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలపై తాజాగా ఆర్జేసీ (కాకినాడ) సురేష్‌బాబు విచారణ జరిపారు. విచారణ నివేదికను త్వరలో కమిషనర్‌కు అందజేయనున్నట్లు తెలిసింది.

వ్యవహారశైలిపై ఫిర్యాదులు

* కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయ ఈఓగా నాలుగు నెలలే పనిచేసినప్పటికీ పలు ఆరోపణలు వచ్చాయి. కమిషనర్‌ అనుమతులు లేకుండా పీఆర్వో, ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులను నియమించారు. దీనిపై పాలకమండలి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆలయంలో శటారి, తీర్థం ఇచ్చే పద్ధతిలో మార్పు చేశారు. అమ్మవారి దర్శనాలకు వీలుగా ఏర్పాటు చేసిన చెక్క కారిడార్‌ను తొలగించారు. 24గంటల దర్శనాలను సైతం నిలిపివేశారు. శాంతి వ్యవహారశైలిని తప్పుబడుతూ పాలక మండలి కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. మళ్లీ ఈమె ఆలయ ఇన్‌ఛార్జి ఈఓగా వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం సాగడంతో పాలకమండలి అప్రమత్తమై ఆమెను ఎట్టి పరిస్థితిలో ఈఓగా నియమించవద్దని కోరుతూ లేఖ పంపారు. వైకాపా ముఖ్యనేతల దృష్టికి శాంతి వ్యవహార శైలిని తీసుకెళ్లడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని